Site icon NTV Telugu

MLA Post : వాళ్ళందరికీ చేతిలో పదవి ఉన్నా..ఎమ్మెల్యే కావాలన్న కోరిక బలంగా నాటుకపోయిందా..?

Telangana

Telangana

MLA Post :  వాళ్లందరికీ చేతిలో పదవి ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యే కావాలనే కోరిక బలంగా నాటుకుపోయిందా? నియోజకవర్గాలపై ఫోకస్‌ పెట్టి.. సిట్టింగ్‌లను టెన్షన్‌ పెడుతున్నారా? ఎన్నికల నాటికి ఇదో సమస్యగా మారుతుందా? ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా కథా?

వరసగా రెండుసార్లు తెలంగాణలో సర్కార్ ఏర్పాటు చేసిన టిఆర్ఎస్.. మరోసారి అధికారం దక్కించుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గల వారిగా చేరికలను ప్రోత్సహిస్తోంది. చేరికల తర్వాత నేతల స్థాయిని బట్టి నామినేటెడ్, ఎమ్మెల్సీ పదవులు ఇస్తోంది అధికారపార్టీ. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్లు ఆశించే వారి సంఖ్యను వీలైనంత వరకు తగ్గించుకోవాలనేది టీఆర్ఎస్‌ ఆలోచన. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే పదవుల్లో ఉన్నా నాయకులు అసెంబ్లీ సెగ్మెంట్లపై గురి పెట్టడం గులాబీ శిబిరంలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీలుగా ఉన్నప్పటికీ కొందరు ఎమ్మెల్యే టికెట్‌ ఆశించడం ఎక్కువగా ఉందట.

ఎమ్మెల్సీలుగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కోటిరెడ్డి, మధుసూదనాచారి, శంభీపూర్‌ రాజుల చుట్టూ ఎక్కువ చర్చ జరుగుతోంది. పట్నం మహేందర్‌రెడ్డి తాండూరు సీటుపై కన్నేశారు. అక్కడ గత ఎన్నికల్లో పట్నం ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్‌ నుంచి నెగ్గిన పైలెట్‌ రోహిత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేశారు. దీంతో మూడేళ్లుగా అక్కడ నేతల పంచాయితీ వేడుక్కుతోనే ఉంది. ఇక కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అక్కడ టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన జైపాల్‌ యాదవ్‌ ఎమ్మెల్యే. ఎన్నికల్లో టికెట్‌ ఆశించకుండా.. కసిరెడ్డిని మరోసారి ఎమ్మెల్సీని చేసి అధిష్ఠానం బుజ్జగించిందని భావించారు. కానీ.. ఆయన చూపు అసెంబ్లీపైనే ఉంది.

ఇటీవల ఎమ్మెల్సీ అయిన కోటిరెడ్డి సైతం నాగార్జునసాగర్‌ అసెంబ్లీ టికెట్‌ ఆశిస్తున్నారు. అక్కడ ఉపఎన్నిక సమయంలోనే అభ్యర్థిగా కోటిరెడ్డి పేరు చర్చకు వచ్చింది. చివరకు నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌కే టీఆర్ఎస్‌ టికెట్‌ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో భగత్‌ గెలిచారు. ఉపఎన్నిక టైమ్‌లోనే కోటిరెడ్డిని ఎమ్మెల్సీని చేస్తానన్న హామీని అమలు చేశారు సీఎం కేసీఆర్‌. అయినప్పటికీ కోటిరెడ్డి దృష్టంతా నాగార్జున సాగర్‌పైనే ఉంది. ఇక మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి విషయంలోనూ చర్చ హాట్ హాట్‌గానే ఉంది. ఆయన గత ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్‌ నుంచి గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి కారెక్కేశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇటీవలే మాజీ స్పీకర్‌ను ఎమ్మెల్సీని చేసింది అధికారపార్టీ. తిరిగి చట్టసభల్లోకి అడుగుపెట్టినా.. మధుసూదనాచారి మాత్రం ఎమ్మెల్యేగానే గెలవాలని లెక్కలేస్తున్నారట.

ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు సైతం కుత్భుల్లాపూర్‌ అసెంబ్లీ సీటుపై కన్నేసినట్టు టాక్‌. అక్కడ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్‌ ఉన్నారు. ఇలా సీటు ఆశిస్తున్నవాళ్లంతా నియోజకవర్గాల్లో వేగంగానే పావులు కదుపుతున్నారట. దీంతో ఎన్నికల నాటికి నియోజకవర్గాల్లో తలెత్తె సమస్యలు తలచుకుని టెన్షన్‌ పడుతున్నారట నేతలు. మరి.. పార్టీ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.

 

Exit mobile version