Site icon NTV Telugu

TRS : టీఆర్ఎస్‌‌లో సెగలు రేపుతున్న పాత పగలు? |

Mahaboobabad Trs

Mahaboobabad Trs

మహబూబాబాద్ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోతున్నారు. గతంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్.. ఎంపీ కవిత చేతుల్లోంచి మైక్ లాక్కొని కలకలం రేపితే… తాజాగా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మంత్రి సత్యవతి రాథోడ్‌పై చేసిన పరోక్ష వ్యాఖ్యలు.. నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మానుకోటలో కారు స్టీరింగ్‌ అదుపు తప్పుతుందా అనే అనుమానాలు పార్టీలో వర్గాల్లో ఉన్నాయట.

ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌.. జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ శాఖకు చెందిన విషయాలు తెలియడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇందులో అధికారుల తప్పు ఉందో.. లేక మంత్రి ప్రమేయంతో అలా జరుగుతుందో తెలియడం లేదని మంత్రి సత్యవతి రాథోడ్‌ను ఉద్దేశించి పరోక్షంగా కామెంట్స్‌ చేశారు. ఎమ్మెల్యేలను కావాలనే మంత్రి దూరం పెడుతున్నారనే అర్థం వచ్చేలా మాటల తూటాలు పేల్చేశారు రెడ్యా నాయక్‌. గతంలో ఏ పథకం అమలు చేయాలన్నా.. నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యే సలహాలు, సూచనలు తీసుకునేవాళ్లని.. ఇప్పుడా పద్ధతే లేదని మండిపడ్డారు ఎమ్మెల్యే. జిల్లాలో శాసనసభ్యుల ప్రాధాన్యం తగ్గించేందుకే ప్రభుత్వ పథకాలు ఇవ్వకుండా మంత్రి అడ్డుకుంటున్నారనే అనుమానం వ్యక్తం చేశారు.

రెడ్యానాయక్‌ వ్యాఖ్యలు జిల్లా టీఆర్ఎస్‌ వర్గాల్లో చర్చగా మారాయి. మంత్రి సత్యవతి రాథోడ్‌తో ఉన్న గ్యాప్‌ వల్లే పొరపచ్చాలు వస్తున్నాయని.. అవి అంతకంతకూ పెరుగుతున్నాయని చెబుతున్నారు. పైగా రానున్న ఎన్నికల్లో మహబూబాబాద్‌ జిల్లాలో కీలక మార్పులు జరుగుతాయనే ప్రచారం ఉంది. సిట్టింగ్‌లలో చాలా మందికి టికెట్‌ ఇవ్వబోరని చర్చకు పెడుతున్నారు. దాంతో గ్రాఫ్‌ పెంచుకునేందుకు నియోజవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు శాసనసభ్యులు. అయితే వర్గపోరు నేతల మధ్య సందేహాలను పెంచేస్తోంది. ఆధిపత్యపోరాటం పీక్స్‌కు వెళ్లిపోతోంది.

డోర్నకల్లే తీసుకుంటే.. 2009లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సత్యవతి రాథోడ్‌.. రెడ్యానాయక్‌పై గెలిచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్‌లో చేరిన ఆమె.. అదే రెడ్యా నాయక్‌ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత రెడ్యానాయక్‌ సైతం టీఆర్‌ఎస్‌లో చేరడంతో .. పాత రాజకీయ వైరం అలాగే ఉండిపోయింది. గత ఎన్నికల్లో రెడ్యానాయక్‌ పోటీ చేయడం.. ఎమ్మెల్యే కావడం జరిగిపోయింది. సత్యవతి రాథోడ్‌ పరిస్థితి ఏంటా అనుకుంటున్న తరుణంలో.. ఆమెను ఎమ్మెల్సీని చేసి కేబినెట్‌లోకి తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో డోర్నకల్‌ నుంచి పోటీ చేయడానికి సత్యవతి రాథోడ్‌ పావులు కదుపుతున్నారట. రెడ్యానాయక్‌ మాత్రం.. ఆయన కుమారుడు రవిచంద్రను బరిలో దింపాలనే ప్లాన్‌లో ఉన్నారట. ఆ కారణంగానే ఇద్దరి మధ్య పాత పగలు.. కొత్తగా పదునెక్కుతున్నాయని అనుకుంటున్నారు. తాజాగా మంత్రిపై ఎమ్మెల్యే కామెంట్స్‌ను ఆ కోణంలోనే చూస్తున్నారట. మరి.. రానున్న రోజుల్లో ఈ వర్గపోరు ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

 

Exit mobile version