NTV Telugu Site icon

Macherla Politics : బ్రహ్మారెడ్డి వచ్చినా క్యాడర్ లో నిరుత్సాహం ..!

Brahamnand Reddy

Brahamnand Reddy

Macherla Politics  : పాతికేళ్లుగా గెలుపు మొహం చూడని ఆ నియోజకవర్గంలో ఎలాగైనా గెలవటానికి టీడీపీ నానా తంటాలు పడుతోంది. ఎన్నిక ఎన్నికకూ ఒక నేతను పెట్టడం.. అతను ఓడగానే పక్కన పడేయడం. ఇప్పుడు కొత్తగా రంగంలోకి దించిన పాత నేత అప్పుడే సైలెంట్‌ కావడంతో.. కేడర్‌కు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదట. ఏదో చేస్తాడునుకున్న నేత.. ఏం చేయకపోవడంతో నిరాశలో ఉందట అక్కడి కేడర్‌. ఓ పక్క ఆర్థిక, అంగబలాల్లో గట్టిగా ఉన్న ఎమ్మెల్యే.. ఇంకోపక్క ఆ రెండూ లేని నేతతో టీడీపీ చేస్తున్న ప్రయోగం అప్పుడే వెలవెలబోతోందట.

పల్నాడు జిల్లా మాచర్ల ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. టీడీపీ మొదటిసారి ఓడిన 1989లో సైతం అక్కడ గెలిచింది. ఆ తర్వాత 1994, 1999 ఎన్నికల్లో విజయం సాధించింది. ఆ తర్వాత నాయకత్వ లేమి ఆ పార్టీకి పాతికేళ్లుగా మాచర్లలో విజయం దక్కకుండా చేసింది. ఇప్పుడు వైసీపీ అడ్డడాగా మారింది. ఇక్కడ 2009 నుంచి వరసగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుస్తూ వస్తున్నారు. రామకృష్ణారెడ్డికి అడ్డుకట్ట వేసేందుకు టీడీపీ చేయని ప్రయత్నం లేదు. ఎన్నిక ఎన్నికకూ ఒక నేతను బరిలో దింపి.. ప్రయోగం చేసి టీడీపీ చేతులు కాల్చుకుంది. ఈసారి ఎలాగైనా మాచర్ల నియోజకవర్గంలో మార్పు తీసుకురావాలని.. గెలిచే గుర్రాన్నే బరిలో దించుతామని చెప్పిన టీడీపీ, అందుకు తగ్గట్టుగానే బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన జూలకంటి బ్రహ్మారెడ్డిని రంగంలోకి దించింది.

జూలకంటి తండ్రి నాగిరెడ్డి, తల్లి దుర్గాంభ గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు. దుర్గాంభ 1999 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జూలకంటి కుటుంబం రాజకీయాలకు దూరమైంది. ఎంత మంది నేతలతో ఎన్ని ప్రయోగాలు చేసినా గెలుపు దక్కకపోవడం.. పిన్నెల్లి ముందు గెలవలేకపోవడంతో టీడీపీ మళ్లీ జూలకంటి ఫ్యామిలీపైనే కన్నేసింది. ఆయనకు ఇవ్వాల్సిన హామీలన్నీ ఇచ్చి రంగంలోకి దింపారట టీడీపీ పెద్దలు.

జూలకంటి బ్రహ్మారెడ్డి టీడీపీలో యాక్టివ్‌ కావడం.. నియోజకవర్గ ఇంఛార్జ్‌గా నియమించడం చకచకా జరిగిపోయాయి. బ్రహ్మారెడ్డి ఇంఛార్జ్‌గా వచ్చినప్పుడు నిర్వహించిన భారీ ర్యాలీతో టీడీపీ మాచర్లలో బలం పుంజుకుందనే సంకేతాలు ఇచ్చింది. వెల్దుర్తి ప్రాంతంలో సొంతంటి నిర్మాణానికి ప్రయత్నాలు కూడా చేసుకున్నారు బ్రహ్మారెడ్డి. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ టీడీపీ కేడర్‌ ఉత్సాహం నీరు కారిపోతోందట. ఇంఛార్జ్‌ హోదాలో బ్రహ్మారెడ్డి పార్టీ కార్యక్రమాలు ఏమీ నిర్వహించడం లేదట. కేవలం ప్రైవేట్‌ కార్యక్రమాలకు, కార్యకర్తల ఫంక్షన్లకు రావడం తప్ప టీడీపీ కేడర్‌ను ఉత్సాహ పరిచేలా భారీ ప్రొగ్రామ్స్‌ ఏవీ చేయడం లేదట. జిల్లా మొత్తం బాదుడే బాదుడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. మాచర్లలో ఆ ఊసే లేదట. రాష్ట్ర వ్యాప్తంగా అన్నక్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నా.. ఆ జాబితాలో మాచర్ల లేదు. గతంలో ఉన్న నాయకుల్లా కాకుండా బ్రహ్మారెడ్డి కచ్చితంగా టీడీపీకి బలం అవుతారనుకుంటే.. ఆయనే పార్టీకి భారం అయ్యారనే ప్రచారం మాచర్ల లో ఉందట.

అసలు బ్రహ్మారెడ్డి ఎందుకు యాక్టివ్‌గా లేరు? నియోజకవర్గంలో ఎందుకు తిరగడం లేదు? అనే ప్రశ్నలకు కేడర్‌కు సమాధానం దొరకడం లేదట. ఆయన వర్గీయులు మాత్రం పార్టీలో బ్రహ్మారెడ్డి చేరేటప్పుడు టీడీపీ చెప్పిన మాట ఒకటి.. ఇప్పుడు పార్టీ చేస్తున్న విధానం మరకొటి అని రుసరుసలాడుతున్నారట. బ్రహ్మారెడ్డి ఆర్థికంగా స్థితిమంతుడు కాదు. పార్టీ ఇచ్చిన కమిట్మెంట్‌, తోటి నాయకులు ఇచ్చిన భరోసాతో.. రాజకీయాలకు దూరంగా ఎక్కడో గుంటూరులో ఉంటున్న బ్రహ్మారెడ్డి పార్టీ ఇంఛార్జ్‌ పదవితో మాచర్లలో అడుగు పెట్టారు. ఆర్థికంగా బలహీనమైన బ్రహ్మారెడ్డి.. ఎమ్మెల్యే పిన్నెల్లిని ఢీకొట్టడం సాధ్యమయ్యే పనేనా అనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయట.

ఎన్నికలంటే కచ్చితంగా ఆర్థిక వ్యవహారాలు ఉంటాయి. అలాంటి ఆర్థిక పరిస్థితులు బ్రహ్మారెడ్డి దగ్గర లేవట. అదే విషయాన్ని ఆయన అనేక పర్యాయాలు బాహటంగానే కార్యకర్తల దగ్గర చెప్పారట. పార్టీ ఆర్థికంగా ఆదుకోకపోతే తాను ఏమీ చేయలేనని, అందుకే మౌనంగా ఉండాల్సి వస్తోందని బ్రహ్మారెడ్డి చెబుతున్నారట. ఇప్పటికే కార్యకర్తలను, నాయకులను అడిగి కొంతమేర కార్యక్రమాలు చేసినప్పటికీ.. ప్రతిదానికి కార్యకర్తల మీద ఆధారపడటం తనకు ఇష్టం లేదంటున్నారట. ఇవన్నీ ఆంతరంగికుల దగ్గర మాత్రమే బ్రహ్మారెడ్డి ప్రస్తావించడంతో కేడర్‌కు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదట. మరి సమస్యను పార్టీ పెద్దలు గుర్తించి పరిష్కరిస్తారో లేదో చూడాలి.

 

 

Show comments