Site icon NTV Telugu

Congress : ఆలేరు కాంగ్రెస్ లో నేతల వార్.. ఒక్క సీటుకు ఐదుగురు పోటీ

Congress

Congress

ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్‌లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేయడానికి చాలామంది నేతలు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే రేస్‌లో నలుగురు ఉండగా.. తాజాగా బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన బంట్రు శోభారాణి సైతం పోటీలోకి వచ్చారు. ఈ ఐదుగురూ తమ బలాన్ని పెంచుకోవాలని.. అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నారట. దీంతో ఎన్నికల నాటికి ఆలేరు కాంగ్రెస్‌ రాజకీయం ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ.. ఆందోళన కేడర్‌లో కనిపిస్తోంది.

మాజీ ఎమ్మెల్యే కుడుదల నగేష్, పార్టీ నేతలు బీర్ల ఐలయ్య, బోరెడ్డి అయోధ్యరెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డిలు పోటీపై ధీమగా ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన కుడుదుల నగేష్.. ప్రస్తుతం ఆలేరు జడ్పీటీసీగా ఉన్నారు. నియోజకవర్గంలో ఉద్యమనేతగా అందరికీ పరిచయం ఉన్న నగేష్‌.. టీఆర్ఎస్‌తో విభేదించి కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఆయనకు పడటం లేదు. కానీ.. కాంగ్రెస్‌ పెద్దలతో మంచి సంబంధాలే ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యేగా పనిచేయడంతో.. ఈసారి టికెట్‌ ఆశించే వారిలో మొదటి వరసలో ఉన్నారు నగేష్‌.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడిగా ముద్ర పడ్డ ఐలయ్య సైతం తనదే కాంగ్రెస్‌ టికెట్‌ అంటున్నారట. ఆలేరులో కురుమ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. ఐలయ్య అదే సామాజికవర్గం. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి ఈ మధ్య కాలంలో చేరువయ్యారు. మాజీ జడ్పీటీసీ అయోధ్యరెడ్డి సైతం టికెట్‌పై ధీమాగా ఉన్నారు. రేవంత్‌ కోర్‌ టీమ్‌లో ఉండటంతో పెద్ద ఆశలే పెట్టుకున్నారట. వచ్చే ఎన్నికలకు గ్రౌండ్‌ వర్క్‌ కూడా చేసుకుంటున్నట్టు టాక్‌. గతంలో బీఎస్పీ, ఆప్‌ పార్టీల నుంచి ఆలేరులో పోటీ చేసి ఓడిన కల్లూరి రామచంద్రారెడ్డి సైతం కాంగ్రెస్‌లోనే ఉన్నారు. కల్లూరి కూడా కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారట. అయితే గతంలో బొమ్మలరామారం నుంచి జడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ముగ్గురూ భారీగానే ఆశలు పెట్టుకున్నారట.

తాజాగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉన్న బంట్రు శోభారాణి.. కమలానికి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌ కండువా కప్పేసుకున్నారు. ఆమెది కూడా ఆలేరే. అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్‌రెడ్డి సమక్షంలో శోభారాణి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మహిళా కోటాలో టికెట్‌ ఆమెకే ఇస్తారని శోభారాణి వర్గం భావిస్తోందట. అయితే శోభారాణి చేరికపై సమాచారం ఇవ్వలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం అసంతృప్తితో ఉందట. ఆమె 2009లోనే ఆలేరులో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత టీడీపీలో చేరారు. 2018లో ఆలేరు టికెట్‌ ఆశించినా దక్కలేదు. ఆపై బీజేపీలో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్‌ గూటికి వచ్చారు. అయితే అమెరికాలో పార్టీ కండువా కప్పుకొన్న శోభారాణికి పీసీసీ చీఫ్‌ రేవంత్‌ ఇచ్చిన హామీ ఏంటన్నది ప్రశ్నగా ఉంది. మొత్తానికి ఆలేరు కాంగ్రెస్‌లో నేతల సంఖ్య పెరిగే కొద్దీ టికెట్‌ ఆశించేవారు కూడా పెరిగిపోతున్నారు. మరి.. ఈ రేస్‌ హస్తానికి మేలు చేస్తుందో.. ప్రతికూలంగా మారుతుందో కాలమే చెప్పాలి.

Exit mobile version