Site icon NTV Telugu

Komatireddy Rajagopal Reddy : రాజగోపాల్ రాజీనామా చేస్తే! సీటు కోసం పావులు కదుపుతున్న టీఆర్ఎస్ నేతలు!

Munugodu Trs

Munugodu Trs

Komatireddy Rajagopal Reddy : ఎమ్మెల్యే పార్టీ మార్పు.. అక్కడ ఉపఎన్నికకు దారి తీస్తుందా? లోకల్‌ టీఆర్‌ఎస్‌ నేతలు అప్పుడే అలర్ట్‌ అయ్యారా? ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా నాయకుల తీరు ఉందా? తమకు సీటు కేటాయించాలనే విజ్ఞప్తులు పెరిగాయా? ఇంతకీ ఉపఎన్నిక అంటూ వస్తే అధికారపార్టీ ఆలోచన ఏంటి?

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి వెళ్తే ఉపఎన్నిక తప్పదనే చర్చ మునుగోడు నియోజకవర్గంలో జోరందుకుంది. ప్రధాన పార్టీలు ఈ దిశగా ఫోకస్‌ పెడుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ నాయకులైతే ఏకంగా తమ పేరును పరిశీలించాలని అధిష్ఠానానికి విన్నపాలు చేస్తున్నారు. 2014లో గెలిచి.. 2018 ఓడిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ముచ్చటగా మూడోసారి పోటీ చేసేందుకు అనుమతి కోరుతున్నారట. ప్రస్తుతం మునుగోడు టీఆర్ఎస్‌ ఇంఛార్జ్‌ గా ఉన్నది ఆయనే. తప్పకుండా టికెట్‌ ఇస్తారనే లెక్కల్లో ఉన్న ఆయన.. తన గెలుపునకు ఉపయోగ పడే అంశాలను అధిష్ఠానం ముందు ఉంచుతున్నారట. అయితే కూసుకుంట్ల వల్లే మునుగోడులో టీఆర్‌ఎస్‌లో వర్గాలు పెరిగాయనే అభిప్రాయం పార్టీ పెద్దల్లో ఉందట. ఇది ఆయనకు మైనస్‌ కావొచ్చన్నది టీఆర్ఎస్‌లోని కూసుకుంట్ల ప్రత్యర్థులు చెప్పేమాట.

టీఆర్‌ఎస్‌ టికెట్‌ను బీసీలకు ఇవ్వాలనే డిమాండ్‌ కూడా వినిపిస్తోంది. నియోజకవర్గంలో బీసీలు 85 శాతానికి పైగా ఉన్నారు. టీఆర్ఎస్‌ పెద్దలతో సన్నిహితంగా ఉంటున్న కర్నాటి విద్యాసాగర్‌ సైతం టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారట. మునుగోడులో పద్మశాలీ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో తప్పకుండా ఆ కోణం కలిసివస్తుందనే అంచనాల్లో ఉన్నారు విద్యాసాగర్‌. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ సైతం మునుగోడు టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఉద్యమ నేతగా.. బీసీ సామాజికవర్గానికి చెందిన తనకు పార్టీ ఛాన్స్‌ ఇస్తుందనే ఆశల్లో ఉన్నారు కర్నె. కర్నాటి, కర్నె ఇద్దూ బీసీ నేతలే కావడంతో వాళ్ల మధ్య టికెట్‌ రేస్‌ ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి ఎప్పుడు వెళ్తారో తెలియదు. ఒకవేళ జంప్‌ చేస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారో లేదో స్పష్టత ఇవ్వడం లేదు. రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఆయనపై అనర్హత వేటు వస్తే.. ఉపఎన్నికకు ఆస్కారం ఉంటుంది. వేటు వేసినా.. ఎన్నికల నిర్వహణకు కొద్దినెలల సమయం పడుతుంది. జనరల్‌ ఎన్నికలకు.. ఉప ఎన్నికకు పెద్దగా గ్యాప్‌ ఉండకపోవచ్చు. ఈ విషయం తెలిసినా..ముందుగా కర్చీఫ్‌ వేస్తే పోయేది ఏముంది అనే కోణంలో టీఆర్‌ఎస్‌లో ప్రయత్నాలు ఊపందుకున్నాయి. కూసుకుంట్ల, కర్నె, కర్నాటిల చుట్టూ టీఆర్‌ఎస్‌ రాజకీయం తిరుగుతోంది.

వాస్తవానికి మునుగోడు టీఆర్ఎస్‌లో వర్గపోరు ఎక్కువైంది. ఇక్కడి అంశాలను టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ప్రత్యేకంగా పరిశీలిస్తోంది. వివరాలు సేకరించి.. సమస్యను కొలిక్కి తెచ్చే పనిలో ఉంది. ఇలాంటి తరుణంలో ఉపఎన్నిక అనివార్యమైతే అధికారపార్టీ వ్యూహం మార్చొచ్చు. ప్రస్తుతం లాబీయింగ్‌లో ఉన్న ముగ్గురు పార్టీ నేతల్లో ఒకరికి టిక్‌ పెడుతుందో లేక కొత్త వారిని తెరపైకి తెస్తుందో తెలియదు. ఇంతలో ఆశావహులు మాత్రం ఎన్నికలపై అనేక కలలు కంటున్నారు. మరి.. ఎవరి కలైనా సాకారం అవుతుందో లేక పీడకలగా మిగిలిపోతుందో చూడాలి.

 

Exit mobile version