Kodad Politics : అక్కడ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పార్టీ కేడర్ కూత పెడుతోందా? గొడవలు రోడ్డున పడుతున్నాయా? అధికారపార్టీలో లుకలుకలు చూశాక.. వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజారిటీ ఖాయమని విపక్షాలు తొడకొడుతున్నాయా? నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కిందా? ఎక్కడో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
బొల్లం మల్లయ్య యాదవ్. 2018 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌లో చేరి.. కోదాడ ఎమ్మెల్యేగా గెలిచారు. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతిపై స్వల్ప తేడాతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు మల్లయ్య. గెలిచాక పార్టీపై పట్టు బిగించారు. సీనియర్లకు చెక్ పెట్టుకుంటూ వచ్చారని చెబుతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వర్గానికే ప్రాధాన్యం ఇచ్చి గెలిపించుకున్నారు. దీంతో ఉద్యమ కాలం నుంచి టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్నవారికి.. ఎమ్మెల్యేకు గ్యాప్ వచ్చేసింది. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఆశించిన నేతలు.. వచ్చే ఎలక్షన్‌లోనూ పోటీ కాకుండా జాగ్రత్త పడుతున్నారట మల్లయ్య. అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్నట్టు.. ఎమ్మెల్యే వైరివర్గం ఒక్కసారిగా బుసలు కొట్టడం మొదలు పెట్టింది.
మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు, పార్టీ నేత శశిధర్‌రెడ్డి వర్గాలు మల్లయ్య యాదవ్‌పై గుర్రుగా ఉన్నారు. దీనికితోడు మండలస్థాయి పాత నాయకులకు కూడా ఎమ్మెల్యే అంటే పడటం లేదు. చాలా గ్యాప్ వచ్చేసిందట. ముఖ్యంగా కోదాడ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సైతం మల్లయ్య పేరు చెబితేనే మండిపడుతున్నారు. పనులు అప్పగింత.. కాంట్రాక్టు పనులకు ఆమోదం తెలియజేసే విషయంలో పార్టీకి చెందిన జడ్పీటీసీలు.. ఎంపీపీలు, ఎంపీటీసీలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదట. పైగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారితో సన్నిహితంగా ఉంటున్నారనే ఆరోపణలు గులాబీ శిబిరంలోనే వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకోవడంతో.. కోదాడలో ఎమ్మెల్యే వ్యతిరేకులంతా జట్టు కట్టేశారు. పదవులు ఆశించి భంగపడ్డవాళ్లు.. కాంట్రాక్టు పనులు దక్కని నేతలు.. టికెట్ ఆశించిన వాళ్లంతా మల్లయ్య యాదవ్‌పై కత్తులు నూరుతున్నారట. వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ ఇస్తే.. ఓడించాలనే కసితో రగిలిపోతున్నారట. ఇక్కడి పరిణామాలను పార్టీ పెద్దలు కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే కోదాడ రాజకీయాలను తిరిగి అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇటీవల ఉత్తమ్ కుమార్‌రెడ్డి చేసిన కామెంట్స్‌ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో కోదాడలో 50 వేల మెజారిటీతో కాంగ్రెస్ గెలవబోతున్నదని ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు. టీఆర్‌ఎస్ శిబిరంలో ఉన్న లుకలుకల వల్లే ఆ విధమైన ప్రకటన చేశారని అధికారపార్టీలో చర్చ జరుగుతోందట. ఇంత జరుగుతున్నా.. వైరి వర్గాన్ని ఎమ్మెల్యే లైట్ తీసుకుంటున్నట్టు సమాచారం. అధిష్ఠానం పరిస్థితులు చక్కదిద్దేలోపు కోదాడలో పొలిటికల్ కలర్స్ మారిపోతున్నాయని గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయట. మరి.. టీఆర్‌ఎస్ పెద్దలు సమస్యను ఎప్పుడు కొలిక్కి తెస్తారో చూడాలి.