Site icon NTV Telugu

Kesineni Nani : టీడీపీలో మళ్లీ షరా మామూలుగానే నాని తీరు.. ఎక్కడ గ్యాప్ వచ్చింది?

Kesineni

Kesineni

Kesineni Nani :  బెజవాడ ఎంపీ కేశినేని నాని.. టీడీపీలో ఎవరికి గురి పెట్టారు? సూతిమెత్తంగా ఎవరికి చురకలు వేశారు? ఇటీవల జరుగుతున్న పరిణామాలకు వాళ్లే కారణమనే ఫీలింగ్‌లో ఉన్నారా? ప్రైవేట్‌ సంభాషణల్లో నాని చేస్తున్న కామెంట్స్‌ చూస్తుంటే.. ఆయన ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? టీడీపీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి?

కేశినేని నాని. బెజవాడ టీడీపీలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉన్న ఎంపీ. గత ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారానికి దూరమైన తర్వాత.. ఆయన కూడా పార్టీతో అంటీముట్టనట్టే ఉంటున్నారు. మధ్యలో వరస ట్వీట్స్‌తో హీటెక్కించారు. ఆయన కామెంట్స్‌.. సోషల్ మీడియా పోస్టింగ్స్‌ చూశాక.. టీడీపీలో ఇంకెవరితోనో ఆయనకు పడటం లేదని కేడర్‌ అభిప్రాయపడుతోంది. వాస్తవానికి ఉమ్మడి కృష్ణ జిల్లా టీడీపీలో దేవినేని ఉమా సహ.. విజయవాడ సిటీలోని బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలతో కేశినేని నానికి పడదనేది ఓపెన్‌ సీక్రెట్‌. వీళ్లే కాకుండా… టీడీపీలో టాప్‌ లెవల్లో ఇంకెవరితోనో కేశినేని నాని కయ్‌మంటున్నారని పసుపు శిబిరంలో చెవులు కొరుక్కుంటున్నారు.

ఏపీలో టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలలో కేశినేని నాని ఒకరు. రాష్ట్రంలో కీలకమైన బెజవాడ ఎంపీ సీటుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టీడీపీకి అడ్డాగా కేడర్‌ చెప్పుకొనే చోట లోక్‌సభ సభ్యుడిగా ఉన్నప్పటికీ.. పార్టీతో చాలా గ్యాప్‌ మెయింటైన్‌ చేస్తున్నారు నాని. టీడీపీ కార్యక్రమాల్లో కనిపించరు.. పార్టీ నిర్వహించే ఆందోళనల్లో పాల్గొనరు. పైగా ఆయన ట్వీట్స్‌తో సొంతపార్టీకే నష్టం జరుగుతోందనే అభిప్రాయం తెలుగు తమ్ముళ్లలో ఉందట. అయితే ఆ మధ్య ఏపీ టీడీపీ ఆఫీసుపై దాడి తర్వాత చంద్రబాబు నిరసన చేపట్టారు. ఆ సందర్భంగా పార్టీ ఆఫీసుకు వచ్చి.. చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు నాని. సమస్య సర్దుకుందని అంతా భావించారు. కానీ.. షరా మామూలే.

నాని సైలెంట్‌గా ఉండటం.. ఇదే సమయంలో నాని సోదరుడు కేశినేని చిన్ని బెజవాడ టీడీపీలో యాక్టివ్‌ కావడంతో పరిస్థితి మారిపోయింది. చిన్నిని టీడీపీ పెద్దలే ప్రోత్సహిస్తున్నట్టుగా ఆయన అనుమానిస్తున్నారట. ఇంతలో చిన్ని లక్ష్యంగా ఆయన పోలీసులకు ఇచ్చిన కారుపై నకిలీ ఎంపీ స్టిక్కర్‌ వివాదం హీట్‌ పెంచేసింది. అన్నదమ్ముల మధ్య అంతులేని అగాథం వచ్చినట్టుగా కేడర్‌ భావిస్తోంది. ఇదే అంశంపై వాడీవేడీ చర్చ కొనసాగుతోంది. కేశినేని నాని టీడీపీకి గుడ్‌బై చెబుతున్నారని.. పలు పార్టీలతో టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు నాని. ఆ ప్రచారం టీడీపీ శిబిరం నుంచి వచ్చిందని అనుకున్నారో ఏమో.. తాజాగా ఆయన చేసిన ట్వీట్‌ టీడీపీ శిబిరంలో సెగ రాజేసింది. యాదార్థవాది.. లోక విరోధి అనే సామెతను ప్రస్తావిస్తూనే.. తనను బీజేపీ, వైసీపీలోకి పంపించే బదులు చెప్పింది అర్థం చేసుకోవాలని చురకలు వేశారు. టీడీపీని పటిష్ట పరిచి అధికారంలోకి ఎలా తీసుకురావాలో ఆలోచిస్తే మంచిదని హితవూ పలికారు నాని. అయితే ఈ కామెంట్స్‌ టీడీపీలో ఎవరిని ఉద్దేశించి చేశారన్నదే ప్రశ్న. చంద్రబాబుకు గురిపెట్టారా? లేక నారా లోకేష్‌ను ఉద్దేశించి బాణాలు సంధించారా అనేది ప్రశ్న.

వచ్చే ఎన్నికలకు దూరంగా ఉంటానని నాని గతంలో చెప్పినా.. ఇటీవల ఆయన వైఖరి చూశాక.. మనసు మార్చుకున్నారేమో అనే డౌట్‌ కేడర్‌లో ఉంది. ఈ సందేహాలు నివృత్తి చేసుకునే లోపే నర్మగర్భంగా మరిన్ని వ్యాఖ్యలు చేయడం ఆయనేంటో.. ఆయన వైఖరి ఏంటో.. ఏం చేస్తారో తెలుగు తమ్ముళ్లకు అంతుచిక్కడం లేదట. పార్టీతో ఆయనకు ఎందుకు గ్యాప్‌ వచ్చిందో.. ఎవరంటే ఆయనకు పడటం లేదో.. లేక ఎవరికి ఆయనంటే ఇష్టం లేదో ఒక మిస్టరీగా ఉంది. తాజా ట్వీట్‌తో అది మరింత స్పష్టమైంది. మరి..రానున్న రోజుల్లో కేశినేని నాని ఇంకేం చేస్తారో.. ఇంకెలాంటి అస్త్రాలు సంధిస్తారో చూడాలి.

 

Exit mobile version