NTV Telugu Site icon

Kandukur TDP Incharge : కందుకూరు టీడీపీలో సీన్ రివర్స్

Kandukur

Kandukur

Kandukur TDP Incharge : దాయాదుల పోరు తేలకముందే.. పాత నేత ఎంట్రీ ఇచ్చారా? తెలుగు తమ్ముళ్ల మధ్య రచ్చ మొదలైందా? సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పరిస్థితిని వేడెక్కిస్తున్నాయా? ఇంతకీ ఏంటా సెగ్మెంట్‌? టీడీపీలో జరుగుతున్న గొడవేంటి?

కందుకూరు టీడీపీలో తమ్ముళ్ల మధ్య రగడ సెగలు రేపుతోంది. ఇంఛార్జ్‌ ఇంటూరు నాగేశ్వరరావు.. ఇంఛార్జ్‌ పదవి ఆశించి భంగపడ్డ ఇంటూరి రాజేష్‌ మధ్య పడటం లేదు. ఇంతలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు తిరిగి ఫామ్‌లోకి రావడంతో తెలుగు తమ్ముళ్లలో గందరగోళం మొదలైందట. పార్టీ నేత దివి శివరాం గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో పోతులకు ఛాన్స్‌ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో మహీధర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు పోతుల. అప్పటి నుంచి పోతుల పార్టీకి దూరంగా ఉండటంతో నెల్లూరు పార్లమెంట్‌ టీడీపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఇంటూరి రాజేష్‌ను కందుకూరుకు తీసుకొచ్చారు దివి శివరాం. ఇంఛార్జ్‌ బాధ్యతలు అప్పగించకపోయినా.. రాజేష్‌ నేతృత్వంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసింది. పార్టీ అభ్యర్థులకు రాజేష్‌ ఆర్థికంగా సహకరించారని ప్రచారం జరిగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ గట్టి పోటీ ఇవ్వడంతో పార్టీ తిరిగి గాడిలో పడిందని భావించారు. కానీ నేతల మధ్య సీన్‌ రివర్స్‌ అయ్యింది.

రాజేష్‌ కంటే ఒక అడుగు వెనకొచ్చిన నాగేశ్వరరావు పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడంతో పరిస్థితి మారిపోయింది. చివరకు దివి శివరాం ఆశీసులతో నాగేశ్వరరావు కందుకూరు టీడీపీ ఇంఛార్జ్‌ అయ్యారని టాక్‌. పార్టీ పదవి ఇవ్వకపోయినా రాజేష్‌ మాత్రం దూకుడు తగ్గించలేదట. కార్యకర్తలతో టచ్‌లో ఉంటూ పార్టీ కార్యక్రమాల స్పీడ్‌ పెంచారట. ఆ కార్యక్రమాలను సోషల్‌ మీడియాలో ఊదరగొడుతున్నారట. దీంతో నాగేశ్వరవర్గం కూడా పోటీగా ప్రచారం ప్రారంభించింది. రెండువర్గాల మధ్య ప్రస్తుతం సోషల్ మీడియా వార్‌ నడుస్తోంది.

అనారోగ్యంతో సైలెంట్‌ అయిన పోతుల రామారావు సడెన్‌ ఎంట్రీ ఇచ్చి.. పార్టీ నేతలతో కలిసి బాదుడే బాదుడు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇలా ముగ్గురు నేతలు క్షేత్రస్థాయిలో చేస్తున్న పర్యటనలు.. సమావేశాలు తెలుగు తమ్ముళ్లను గందరగోళంలో పడేస్తున్నాయట. కందుకూరులో టీడీపీ బలోపేతం ఎలా ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో ఈ ముగ్గురిలో ఎవరికి టికెట్‌ అనే చర్చ మొదలుపెట్టేశారట. కలిసి సాగడం మానేసి.. ఎవరికి వారు బలప్రదర్శనలకు దిగడం.. సోషల్ మీడియాను వాడేసుకోవడం చర్చగా మారింది. పరస్పరం విమర్శలతో టీడీపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన తరుణంలో.. నియోజకవర్గాల్లో ఆ ప్రభావం కనిపిస్తోంది. అన్ని వర్గాల్లోనూ వాడీవేడీ చర్చ సాగుతోంది. కందుకూరులో అలాంటి వాతావరణం ఉన్నా.. దానిని పార్టీ నేతలు క్యాచ్‌ చేయడం లేదనేది తమ్ముళ్ల మాట. వర్గపోరుకే ప్రాధాన్యం ఇవ్వడంపై ఆందోళన చెందుతున్నారట. మరి.. కందుకూరు టీడీపీని సెట్‌ చేయడానికి పార్టీ పెద్దలు చొరవ తీసుకుంటారో లేదో అని కేడర్‌ బెంగ పెట్టుకుందట.