Site icon NTV Telugu

Jadcherla Congress Leader : ఆ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీలో ఉండేదెవరు..? పోయేదెవరు..?

Mahaboob Nagar

Mahaboob Nagar

Jadcherla Congress Leader :

ఆ నియోజకవర్గం కాంగ్రెస్‌లో అసంతృప్తి పీక్స్‌కు వెళ్లిందా? పార్టీలో ఉండేదెవరో.. పోయేదెవరో అనే చర్చ నడుస్తోందా? హైకమాండ్‌కు లేఖాస్త్రాలు సమస్య తీవ్రతను పెంచాయా? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఎవరా నాయకులు? లెట్స్‌ వాచ్‌..!

మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. ఇటీవల కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్న మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ తీరుపై.. నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ అనిరుధ్‌రెడ్డి AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌కు లేఖాస్త్రం సంధించారు. దాంతో సమస్య ఎలాంటి మలుపు తీసుకుంటుంది? ఎవరు ఉంటారు… ఎవరు పోతారు అని చర్చ జోరందుకుంది.

ఎర్ర శేఖర్‌ బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరాలని అనుకున్న సమయంలోనే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండతో ఆయన అనుచరుడైన అనిరుధ్‌రెడ్డి బ్రేకులు వేయించారు. కానీ.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఢిల్లీలో లైన్‌ క్లియర్‌ చేయించుకొచ్చి.. ఎర్ర శేఖర్‌ను పార్టీలో చేర్చేసుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ కండువా కప్పుకొని ఎర్ర శేఖర్‌ జడ్చరల్లో పర్యటించడం.. సమావేశాలు పెట్టడం అనిరుధ్‌రెడ్డికి మింగుడు పడటం లేదు. దానికితోడు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ ఎర్రశేఖర్‌కే ఇస్తారనే ప్రచారం సమస్య తీవ్రతను ఇంకా పెంచేస్తోంది.

కాంగ్రెస్‌లో చేరేముందు.. పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి బరిలో ఉంటానని ఎర్ర శేఖర్‌ చెప్పారు. అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమని ప్రకటించారు కూడా. కానీ.. ఆయన దృష్టంతా జడ్చర్లపైనే ఉండటం.. నియోజకవర్గానికి వీడేది లేదని చేస్తున్న ప్రకటనలతో ఇంఛార్జ్‌ అనిరుద్ధరెడ్డి రగిలిపోతున్నారట. దీనికితోడు మూడు పర్యాయాలు జడ్చర్ల నుంచి గెలిచిన ఎర్ర శేఖర్‌.. తన అనుచర వర్గంతోపాటు.. గతంలో తన వెన్నంటి ఉండి.. ప్రస్తుతం ఇతర పార్టీల్లో కొనసాగుతున్న వారితో టచ్‌లోకి వెళ్తున్నారట.

ఇదే సమయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితోనే తన రాజకీయ ప్రయాణం అని అనిరుధ్‌రెడ్డి చేస్తున్న ప్రకటనలు ఆసక్తి కలిగిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ తరహా పోస్టింగ్‌లు వైరల్‌ అవుతున్నాయి. దీంతో తాడోపేడే తేల్చుకోవాలని చూస్తున్నారో ఏమో.. ఎర్ర శేఖర్‌పై పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్‌ ఠాగూర్‌కు లేఖ రాసిపడేశారు అనిరుధ్‌రెడ్డి. మొదటి నుంచి కాంగ్రెస్‌లో పని చేసుకుంటున్న తనకు ఎర్ర శేఖర్‌ వ్యవహారాలు ఇబ్బందిగా మారాయని ఆ లేఖలో ప్రస్తావించారు. సొంత తమ్ముడిని హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అంశాన్ని లేఖలో చెప్పడంతో రాజకీయ వేడి రాజుకుంది.

దాదాపు తొమ్మిది మర్డర్‌ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎర్ర శేఖర్‌తో స్టేజ్‌ పంచుకోలేనని అనిరుధ్‌రెడ్డి చెప్పడంతో జడ్చర్ల కాంగ్రెస్‌లో ఎవరో ఒకరు పార్టీకి గుడ్‌బై చెబుతారనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్‌లో సీనియర్ల అసంతృప్తితో తంటాలు పడుతున్న పార్టీ అధిష్ఠానం .. జడ్చర్ల జగడాన్ని పరిష్కరిస్తుందా? లేక..పార్టీలో జరుగుతున్న ఇతర పరిణామాలతో ముడిపెట్టి సైలెంట్‌గా ఉంటుందా అనేది చూడాలి.

 

Exit mobile version