NTV Telugu Site icon

Dharma Reddy Additional EO TTD : సీన్ రివర్స్ అయ్యిందా..? హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గప్ చుప్ అయ్యారా..?

Ttd

Ttd

Dharma Reddy Additional EO TTD

కొండ నాలుక్కి మందు వేస్తే.. ఉన్న నాలుక ఊడినట్టు తయారైంది వారి పరిస్థితి. కీలక పదవిలో ఉన్న అధికారికి ఎర్త్‌ పెట్టాలని చూసి చేతలు కాల్చుకున్నారు. తాజాగా హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. బీరాలు పలికిన వాళ్లు గప్‌చుప్‌ కాక తప్పలేదు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

తిరుమల తిరుపతి దేవస్థానం ఇంఛార్జ్‌ కార్యనిర్వహణాధికారిగా ధర్మారెడ్డిని నియమించడాన్ని సవాల్‌ చేస్తూ.. హైకోర్టుకు వెళ్లిన వారికి ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. సర్వీస్ మ్యాటర్స్‌తో సంబంధంలేని వారు కూడా ఇంఛార్జ్‌ ఈవోను ఇబ్బంది పెట్టాలని చూడటం.. వారికి కోర్టులో షాక్‌ తగలడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. గత మే నెలలో టీటీడీ ఈవో జవహర్‌రెడ్డిని బదిలీచేసి అడిషనల్‌ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ఇంఛార్జ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌గా నియమించింది ప్రభుత్వం. ధర్మారెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంపై సమగ్ర అవగాహన ఉంది. అప్పటికే అడిషనల్ ఈవో హోదాలో కొండపై దళారి వ్యవస్థకు చెక్ పెట్టారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వడం.. సంస్కరణలు చేపట్టడంతో ఆయనకే పూర్తిగా పగ్గాలు ఇచ్చింది రాష్ట్ర సర్కార్‌. కానీ.. ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలని చూశారు కొందరు. దేవాదాయశాఖ చట్టంలోని సెక్షన్‌ 107 ప్రకారంకలెక్టర్‌గా పనిచేసిన IASకే TTD EOగా బాధ్యతలు అప్పగించాలని కోర్టుకెళ్లారు. ధర్మారెడ్డి నియామకంపై అభ్యంతరం తెలిపారు. రెండుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో.. కోర్టుకెళ్లిన వారికి షాక్‌ తగిలింది.

1991 బ్యాచ్‌ సివిల్‌ సర్వీసెస్‌ అధికారి అయిన ధర్మారెడ్డి గతంలో అహ్మదాబాద్‌, చెన్నై కంటోన్మెంట్‌లలో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా , హోం అఫైర్స్‌ డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వహించారు. 2004లోనే TTD జేఈవోగా, 2006లో గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అడిషనల్‌ కమిషనర్‌గా, 2010లో సమాచారశాఖ అడిషనల్‌ కమిషనర్‌గా, 2015లో హోంమంత్రిత్వశాఖలో పనిచేసి.. 2019లో మరోసారి TTDకి వచ్చారు. అడిషనల్‌ ఈవోగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర సర్వీసెస్‌లో జాయింట్‌ సెక్రటరీ హోదాలో పనిచేయడంతో.. అది రాష్ట్ర సర్వీసులో సెక్రటరీ హోదాతో సమానమని కోర్టుకు తెలిపారు. సెక్రటరీ అంటే.. కలెక్టర్‌ కంటే పెద్ద పోస్టే అని చెప్పడంతో.. ఆ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో ఎక్కడ పనిచేసినా సివిల్‌ సర్వీసెస్‌ అధికారులను TTD ఈవోగా నియమించడానికి అర్హులని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఇంఛార్జ్‌ ఈవో హోదాలో ఉన్న ధర్మారెడ్డిని.. హైకోర్టు తీర్పు తర్వాత పూర్తిస్థాయి ఈవోగా నియమించడానికి కూడా లైన్‌ క్లియరైందని చర్చ నడుస్తోంది.

తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమార్కులకు ధర్మారెడ్డి చెక్‌ పెట్టడంతో.. అలాంటి వాళ్లంతా ఏకమయ్యారు. ఆయన్ని TTD నుంచి పంపించేయాలని చూశారు. కానీ హైకోర్టు తీర్పుతో వాళ్లంతా కుదేలైన పరిస్థితి. జూన్‌లోనే ధర్మారెడ్డి డెప్యుటేషన్‌ ముగిసిపోతుందని.. తిరిగి సెంట్రల్‌ సర్వీసుకు వెళ్లిపోతారని ఆవర్గం భావించిందట. అయితే TTDలో అనేక సంస్కరణలు చేపట్టిన ధర్మారెడ్డిని మరికొంతకాలం ఈవోగా కొనసాగించాలని సీఎం జగన్‌ అభిప్రాయ పడుతున్నారట. ధర్మారెడ్డి పదవీకాలాన్ని పొడిగించాలని స్వయంగా సీఎం జగన్‌ కేంద్రాన్ని కోరడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇంతలో అదనపు ఈవోగా మరో రెండేళ్లు ధర్మారెడ్డి పదవీకాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు కూడా తొలిగిపోయి.. ఈవో పోస్టుపై మరింత స్పష్టత వచ్చింది. ధర్మారెడ్డికి పూర్తిస్థాయి ఈవోగా బాధ్యతలు అప్పగిస్తే.. కొండపై అక్రమాలకు చేయాలనే తలంపే ఎవరికీ రాదని.. అలాంటి ఆలోచనలో ఉన్నవాళ్లంతా చాప చుట్టేస్తారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ధర్మారెడ్డికి వ్యతిరేకంగా కోర్టుకెళ్లిన వారికి గట్టి మొట్టికాయే పడిందని TTD వర్గాల్లో చర్చ సాగుతోంది.