Site icon NTV Telugu

ఏలూరు కార్పొరేషన్‌లో మేయర్‌ భర్త పెత్తనం…?

భార్య రాజకీయంగా కీలక పదవిలో ఉంటే… భర్త పెత్తనం చేయడం చాలాచోట్ల చూస్తుంటాం. ఈ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. ఆ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోనూ అదే జరుగుతోందట. ఆయన పర్మిషన్‌ ఇస్తేనే ఫైల్‌ కదులుతోందని పార్టీ కేడర్‌.. అధికారులు కోడై కూస్తున్నారు. దేవుడు వరమిచ్చినా.. ఆయన కరుణ లేకపోతే పనే కాదట. ఆ బాగోతం ఎక్కడో ఏంటో ఇప్పుడు చూద్దాం.

షాడో మేయర్‌గా మారిన భర్త?

షేక్‌ నూర్జహాన్‌. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌ మేయర్‌. వరసగా రెండోసారి మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు నూర్జహాన్‌. పురపాలక సంఘంలో సుదీర్ఘకాలంగా పట్టుసాధించడం వల్లో ఏమో.. కార్పొరేషన్‌లో ఏ పని జరగాలన్నా మేయర్‌ భర్త పెదబాబు అనుమతి కావాలట. కార్పొరేషన్‌లో ఆయన కోఆప్షన్‌ సభ్యుడు కూడా కావడంతో.. షాడో మేయర్‌గా మారిపోయినట్టు పార్టీ కేడర్‌.. అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు.

ఉన్నతాధికారులతో షాడో మేయర్‌ సమీక్షలు?

మేయర్‌గా నూర్జహాన్‌ ఇవ్వాల్సిన ఆదేశాలన్నీ పెదబాబు నుంచే వెళ్తాయట. అధికారులు ఏం చేయాలో శ్రీవారే నిర్దేశిస్తారని ఉద్యోగవర్గాలు కథలు కథలుగా చెప్పుకొంటున్నాయట. మేయర్‌ ఛాంబర్‌లో నూర్జహాన్‌తో సమానంగా మరో కుర్చీ పెదబాబు కోసం వేశారట. ఏదైనా ఫైల్‌పై మేయర్‌ సంతకం పెట్టాలంటే.. ముందుగా పరిశీలించేది షాడో మేయరేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగనన్న స్వచ్ఛ సంకల్పం.. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంపై ఇటీవల ఉన్నతాధికారులతో పెదబాబు సమీక్ష నిర్వహించారట. ఆయన ఆదేశిస్తే కార్పొరేషన్‌లో ఎంతటి అధికారైన హుటాహుటిన హాజరుకావడం అధికారపార్టీలోనే చర్చగా మారింది.

వైసీపీ కార్పొరేటర్లకే పెదబాబు తీరు రుచించడం లేదా?

మేయర్‌ భర్తగా గౌరవమిస్తాం. కో ఆప్షన్‌ సభ్యుడిగా ఆయన పరిధిలోని పనులకు విలువ ఇస్తాం. కానీ.. మేయర్‌ నూర్జహాన్‌ చేయాల్సిన పనులను షాడో నిర్వహించడం ఏంటని ఇప్పుడిప్పుడే కొందరు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారట. వైసీపీ కార్పొరేటర్లకు సైతం పెదబాబు వైఖరి రుచించడం లేదని సమాచారం. ఈ వైఖరి పార్టీకి ప్రతికూలంగా మారితే ప్రమాదమని ఆందోళన చెందుతున్న వైసీపీ నేతలు.. పెదబాబుకు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా.. ఎలా చెప్పాలా అని మథన పడుతున్నారట. ఎవరు చెబితే పెదబాబు వింటారో.. వాళ్ల దృష్టికే తీసుకెళ్దామని అనుకుంటున్నారట. అయితే.. పైవాళ్లకు తెలియకుండా ఇదంతా జరుగుతుందా.. ఏంటీ? అని పార్టీలోని ఇంకో వర్గం అభిప్రాయపడుతోందట. మొత్తానికి ఎవరేమనుకున్నా.. ఏలూరులో షాడో మేయర్‌ తీరు మాత్రం పార్టీలోనూ.. ప్రజల్లోనూ పెద్ద చర్చే జరుగుతోంది.

Exit mobile version