NTV Telugu Site icon

Kesineni Nani : టీడీపీ ఎంపీ కేశినేని నాని మరో వివాదానికి కారణమయ్యారా?

Kesineni Nani

Kesineni Nani

Kesineni Nani : బెజవాడ టీడీపీలో అనేక విభేదాలకు కేంద్రంగా ఉన్న ఎంపీ కేశినేని నాని.. మరో వివాదానికి కారణం అయ్యారా? ఇటీవల ఆయన చేస్తున్న సన్మానాలతో రచ్చ రచ్చ అవుతోందా? పార్టీ టికెట్‌ ఇచ్చేది లేదని ఎవరికి వార్నింగ్‌ ఇస్తున్నారు? విజయవాడ టీడీపీలో కాక రేపుతున్న ఆ రగడేంటి? లెట్స్‌ వాచ్‌..!

ఏపీలోని అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లు ఓ లెక్క అయితే.. బెజవాడ లోక్‌సభ నియోజకవర్గం మరో లెక్క. ఇక్కడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తీరు మూడేళ్లుగా వివాదాల చుట్టూ తిరుగుతోంది. నాని వ్యవహార శైలే అందుకు కారణమన్నది పార్టీ వర్గాల వాదన. అంతర్గతంగా ఆయన చేసే కామెంట్స్ కలకలం రేపుతుంటాయి. తాజాగా అలాంటి ఎపిసోడే ఒకటి టీడీపీ శిబిరంలో అలజడి సృష్టిస్తోంది. విజయవాడ లోక్‌సభ పరిధిలోని తిరువురూ నియోజకవర్గానికి చెందిన ఆ వివాదం ఇప్పటికే పార్టీ అధినాయకత్వం దృష్టికి వెళ్లిందట.

తిరువూరు టీడీపీ నేత రాజేశ్వరరావుపై అదే సెగ్మెంట్‌కు చెందిన గడ్డిపర్తి వెంకట సురేష్ బాబు అనే అతను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. అయితే ఆ ట్రోలింగ్ అతని పేరు మీద కాకుండా.. ఫేక్ అకౌంట్ ద్వారా చేశారట సురేష్. దానిపై ఆరా తీసిన తెలుగుదేశం నేతలు.. ఐ-టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్న సురేషే.. వేరే సిమ్ తీసుకుని ఆ ఫోన్ నెంబర్ ద్వారా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని గుర్తించారట. అతడిని పార్టీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించారు. తాను తప్పు చేశానని.. కేశినేని నాని కార్యాలయంలో ఉన్న ఓ వ్యక్తి ప్రొద్బలంతో ఆ విధంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నానని రాతపూర్వకంగా రాసిచ్చారట సురేష్. ఆ అంశాన్ని తిరువూరు టీడీపీ ఇంఛార్జ్‌ దేవదత్‌ ఎంపీ నాని దృష్టికి తీసుకెళ్లారట. ఎంపీ ఆఫీసు కేంద్రంగా ఈ తతంగం నడుస్తోందని రాసిచ్చారని వెల్లడించారట దేవదత్‌. వెంటనే సదరు ఐ-టీడీపీ కార్యకర్త సురేష్‌ను పిలిచి శాలువా కప్పి సన్మానం చేశారు కేశినేని నాని.

ఇదే తరహాలో సొంత పార్టీ నేతలపై కూడా ట్రోలింగ్ చేయాలని.. ఎవరూ అడ్డుకుంటారో చూద్దామని సురేష్‌కు ఎంపీ నాని భరోసా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ట్రోలింగ్‌ చేశారని.. కంట్రోల్‌లో పెట్టాలని అడిగేందుకు వెళ్తే.. ఆ వ్యక్తికే ఎంపీ సన్మానం చేయడం టీడీపీ వర్గాల్లో చర్చగా మారింది. ఆ రగడ సన్మానంతోనే ఆగిపోలేదట. తిరువూరు టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న దేవదత్‌కు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చేది లేదని.. ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారో చెబితే.. ఆ మొత్తం ఇచ్చేస్తానని నాని చెప్పారట. దీంతో టీడీపీలో ఎవరికి టికెట్లు ఇవ్వాలో.. వద్దో నానినే తేల్చేస్తున్నారా..? అని ప్రశ్నించుకుంటున్నారట విజయవాడ తెలుగు తమ్ముళ్లు.

ఇప్పటికే బెజవాడలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలతో ఎంపీ నానికి పడటం లేదు. వారి మధ్య ఆధిపత్యపోరాటం ఏదో ఒక సందర్భంలో బుస కొడుతూనే ఉంది. ఇప్పుడు ఆ జాబితాలో తిరువూరు టీడీపీ కూడా చేరింది. అందుకే తాజా వ్యవహారంపై టీడీపీ అధిష్ఠానానికి తిరువూరు నేతలు ఫిర్యాదు చేశారట. అయితే ఇదంతా కరెక్ట్ కాదని.. కేశినేని నాని మీద కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ అనుచరులు మండిపడుతున్నారట. మరి.. ఈ రగడకు ఎక్కడ ఫుల్‌ స్టాప్‌ పడుతుందో చూడాలి.