Site icon NTV Telugu

Bapatla Politics : బాపట్ల తీరంలో కొత్త రాజకీయం మొదలైందా..?

Bapatla Politics

Bapatla Politics

Bapatla Politics : బాపట్ల తీరంలో సరికొత్త రాజకీయం మొదలైందా? ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న నాయకుడు కొత్త పలుకులు పలుకుతున్నారా? కౌంటర్లు పదునుగానే ఉన్నాయా? మాటల తూటాల మార్మం ఏంటి? ఇంతకీ వాళ్లెవరు? లెట్స్‌ వాచ్‌..!

కోన రఘుపతి.. ఏపీ డిప్యూటీ స్పీకర్‌. అన్నం సతీష్‌ ప్రభాకర్‌.. మాజీ ఎమ్మెల్సీ. ఇద్దరూ వేర్వేరు పార్టీలు రఘుపతి వైసీపీ అయితే.. సతీష్‌ ప్రభాకర్‌ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఇద్దరి మధ్య ప్రస్తుత మాటల యుద్ధం సాగుతోంది. వాడీ వేడీ కామెంట్స్‌ నడుస్తున్నాయి. రఘుపతి కార్యాలయం అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని సతీష్‌ ప్రభాకర్‌ ఆరోపిస్తుంటే.. రఘుపతి వర్గం అంతే స్థాయిలో కౌంటర్లు ఇస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఇద్దరు నేతలు పరస్పరం ఆరోపణలు.. విమర్శలు చేసుకోవడం బాపట్ల రాజకీయాన్ని వేడెక్కిస్తోంది.

సతీష్‌ ప్రభాకర్‌ గతంలో టీడీపీ ఎమ్మెల్సీ. ఇప్పుడు బీజేపీ. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి బాపట్లలో పోటీ చేయాలని చూస్తున్నారట. దాంతో ప్రజల్లో అటెన్షన్‌ తీసుకొచ్చేందుకు ఆయన కోన రఘుపతిని టార్గెట్‌ చేశారనేది కొందరి వాదన. వైసీపీలో ఉన్న గ్రూపులను తనవైపు తిప్పుకోవాలని ప్రభాకర్‌ చూస్తున్నారట. ఈ లోగుట్టు పసిగట్టిందో ఏమో.. రఘుపతి వర్గం మరోవైపు నుంచి నరుక్కొస్తున్నట్టు తెలుస్తోంది. సతీష్‌ ప్రభాకర్‌ వ్యాపార కార్యకలాపాలపై ఫోకస్‌పెట్టిందట. ఆయన ఫ్యాక్టరీ నుంచి కాలుష్యం ఎక్కువైందని.. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మండి పడుతున్నారట. రాబోయే రోజుల్లో మీ రొయ్యల ఫ్యాక్టిరీకి ఇబ్బందులు వస్తాయేమో చూసుకోవాలని హెచ్చరిస్తున్నారట.

బాపట్లలో టీడీపీ ఇంఛార్జ్‌ యాక్టివ్‌గా లేకపోవడంతో ఆ పార్టీలో పాత పరిచయాలను తిరగదోడుతున్నారట సతీష్‌ ప్రభాకర్‌. వైసీపీ అసమ్మతి వర్గాలను.. టీడీపీలో పాత మిత్రులను కలుపుకొని వెళ్తే.. బీజేపీ నుంచి పోటీ చేసినా ఇబ్బంది ఉండబోదనే లెక్కల్లో ఉన్నారట. ఇదే సమయంలో కోన రఘుపతి వర్గం మరో అస్త్రం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. సతీష్‌ ప్రభాకర్‌ ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో ఆయన బాధితుల లిస్ట్‌ను సేకరిస్తున్నట్టు సమాచారం. వాళ్లను తెరమీదకు తీసుకొస్తే సతీష్‌ ప్రభాకర్‌ దూకుడికి బ్రేకులు వేయొచ్చనే లెక్కల్లో ఉన్నారట. మొత్తానికి ఇద్దరు నాయకుల తీరుతో బాపట్లలో రాజకీయ వాతావరణం వేడి సెగలు రేపుతోంది. మరి.. రానున్న రోజుల్లో ఇవి ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.

Exit mobile version