NTV Telugu Site icon

Group Politics in Madugula TDP : మాడుగుల టీడీపీలో పరిస్థితి మరింతగా దిగజారిందా..?

Madugala Tdp

Madugala Tdp

Group Politics in Madugula TDP  : అక్కడ టీడీపీ కయ్యాల కాపురం చేస్తోందా? గ్రూపు రాజకీయాలు శ్రుతి మించి వీధికెక్కాయా? పద్ధతి మార్చుకోవాలని ఇచ్చిన హెచ్చరికలను లీడర్స్‌ ఖాతరు చేయడం లేదా? ఎవరు ఎవరికి పొగ పెడుతున్నారు? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఏమా కథా?

టీడీపీ ఆవిర్భావం తర్వాత రెండు దశాబ్దాలపాటు విశాఖ జిల్లా మాడుగులలో ఆ పార్టీ హవానే నడిచింది. 2004లో కాంగ్రెస్‌ నుంచి కరణం ధర్మశ్రీ గెలిస్తే.. 2009లో గవిరెడ్డి రామానాయుడు తిరిగి టీడీపీ వశం చేశారు. గత రెండు ఎన్నికల్లో మాత్రం వైసీపీదే హవా. ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన బూడి ముత్యాల నాయుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎం. విపక్షానికి ఛాన్స్‌ ఇవ్వకుండా పాతుకుపోతున్నారు ముత్యాల నాయుడు. ఇదే సమయంలో టీడీపీ కూడా మాడుగులలో బలహీన పడుతోంది. కేడర్‌ ఉన్నప్పటికీ సింగిల్‌ లీడర్‌ షిప్‌ సమస్య వేధిస్తోందట. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి .. పార్టీ ఇన్ఛార్జ్ పీవీజీ కుమార్ వర్గాల మధ్య రాజకీయ శత్రుత్వం పెరుగుతోందే తప్ప తరగడం లేదు.

ఇంఛార్జ్‌ పదవి ఊడిన తర్వాత గవిరెడ్డి వర్గ రాజకీయాలకు తెరతీశారట. ఇంఛార్జ్‌గా ఉన్న పీవీజీ కుమార్‌కు వ్యతిరేకంగా సభలు, సమావేశాలు నిర్వహించడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. చోడవరం మినీ మహానాడు తర్వాత అనకాపల్లి జిల్లాలో పార్టీ పరిస్థితులపై నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపారు చంద్రబాబు. ఆ సమావేశం సైతం బలపరీక్షకు వేదికగా మార్చుకునేందుకు మాజీ ఎమ్మెల్యే రామానాయుడు ప్రయత్నించడం అధినేత ఆగ్రహానికి కారణమైంది. రామానాయుడికి అనుకూలంగా కొందరు కార్యకర్తలు నినాదాలు చెయ్యడంపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. ప్రస్తుతం పీ.వీ.జీ.కుమార్ నాయకత్వంలో పార్టీ విజయానికి కృషి చెయ్యాలని.. టికెట్‌ విషయం తనకు వదిలి పెట్టాలని అధినేత స్పష్టంగా చెప్పేశారట. ఆ తర్వాత మాడుగులలో పరిస్థితులు మరింత దిగజారాయట.

ఇటీవల మండలస్థాయిలో పార్టీ కమిటీల నియామకం జరిగింది. ఇన్ఛార్జ్ హోదాలో పీవీజీ కొందరి పేర్లను సూచిస్తు టీడీపీ ఆఫీస్‌కు జాబితా పంపించారట. మాజీ ఎమ్మెల్యే వర్గంలోని వాళ్లకు పదవులు దక్కలేదట. దీంతో రెండు వర్గాలు వీధి పోరాటాలకు దిగుతున్నాయి. అరుపులు, కేకలతో పార్టీ సమావేశాలను రచ్చరచ్చగా మార్చేస్తున్నాయి. అధినేత వార్నింగ్ ఇచ్చినప్పటికీ పరిస్థితులు మారలేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరాలనే పట్టుదలతో ఉన్న మాజీ ఎమ్మెల్యే రామానాయుడు లాబీయింగ్ ముమ్మరం చేశారట. ఐతే, పార్టీ కేంద్ర కార్యాలయంలో కొందరు తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారనే అనుమానం ఉందట.

పొమ్మనలేక పోగబెడుతున్నారని భావించి.. మాజీ ఎమ్మెల్యే ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ పిలుస్తోందని.. జనసేన టికెట్‌ ఆఫర్ చేసిందనే చర్చ నడుస్తోంది. ఐతే, అవేవీ వాస్తవం కాదని.. ప్రత్యర్థుల వ్యూహంలో భాగమేనని రామానాయుడి ఆరోపణ. ఎన్నికల నాటికి అధిష్ఠానం తిరిగి తనకే బాధ్యతలు అప్పగిస్తుందనే ధీమాతో ఉన్నారాయన. ఈ తలనొప్పి భరించడమే కష్టం అనుకుంటే.. ఇంకోవైపు పైలా ప్రసాదరావు అనే టీడీపీ నేత అలజడి రేపుతున్నారట. మాడుగల సమస్య టీడీపీ పెద్దలకు తెలియంది కాదు. కానీ.. సమస్యను సకాలంలో పరిష్కరించకపోతే మొదటికే మోసం రావొచ్చని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయ పడుతున్నారట. మరి.. చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.

 

Show comments