Site icon NTV Telugu

ఓరుగల్లులో ఫ్లెక్సీల రగడ..అధికారులకు తలనొప్పిగా మారిన నేతల ఒత్తిళ్లు

Memu Maramuy

Memu Maramuy

వరంగల్‌ నగరంలో వివిధ పార్టీలు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలతో రచ్చ రచ్చ అవుతోంది. వీటి విషయంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. టీఆర్‌ఎస్‌ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే నామ మాత్రంగా ఫైన్స్‌ వేస్తున్నారట. అదే ప్రతిపక్షపార్టీలకు చెందిన ఫ్లెక్సీలు పెడితే.. కేసుల కొరడా లేకపోతే వేలు, లక్షల్లో జరిమానాలు విధిస్తున్నారట. ఇదే సమయంలో టీఆర్ఎస్‌ నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలు కూడా అధికారులకు తలనొప్పిగా మారుతున్నాయి.

ఆ మధ్య వరంగల్‌ నగరానికి టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ రావడంతో పార్టీ నేతలు పోటీపడి ఫ్లెక్సీలతో నింపేశారు. ప్రధాన కూడళ్లలో ఎటుచూసినా అవే కనిపించాయి. ప్రైమ్‌ లోకేషన్స్‌ కోసం అధికారులపై ఓ రేంజ్‌లో ఒత్తిడి చేశారట. ముందుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ముందు ఇంకెవరైనా కడితే.. అధికారులపై ఒత్తిడి తెచ్చి తొలగించడం నగరంలో వర్గపోరు తీవ్రతను తెలియజేస్తోంది. సొంత పార్టీవాళ్లపైనే భారీగా ఫైన్స్‌ వేయాలని అధికారులను అదేపనిగా కోరుతున్నారట. వాస్తవానికి వరంగల్‌లో ఫ్లెక్సీల ఏర్పాటుకు టీఆర్‌ఎస్‌లో ఒక కమిటీని ఏర్పాటు చేశారట. పార్టీలో అందరికీ ప్రాధాన్యం ఇచ్చేలా ఒప్పందం జరిగినట్టు సమాచారం. కానీ.. ఫ్లెక్సీలలో కొందరు నాయకుల ఫొటోలు లేకపోవడంతో.. ఇంకొందరి చిత్రాలకు సరైన ప్రాధాన్యం దక్కకపోవడంతో చర్చగా మారింది.

హన్మకొండ జడ్పీ ఛైర్మన్‌, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావుల ఫొటోలకు ఫ్లెక్సీలలో ప్రాధాన్యం ఇవ్వలేదు. మేయర్‌తో పాటు మరో యువనేత ఫొటోలతో వాటిని నింపేయడంతో పార్టీ నాయకులు ఫైర్‌ అయ్యారట. వాటిని తొలగించాల్సిందేనని ఒత్తిడి చేయడంతో మేయర్‌తోపాటు మరో నాయకుడికి అధికారులు ఫైన్‌ వేసినట్టు మీడియాకు లీకులు ఇచ్చారు. సోషల్ మీడియాలో ఊదర గొట్టారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఫ్లెక్సీలు కట్టిన వారందరికీ జరిమానా వేశారు అధికారులు. మొదట ఒక నాయకుడికి 50 వేలు ఫైన్‌ కట్టాలని చెప్పిన ఆఫీసర్లు.. తర్వాత మాట మార్చి.. ఆయన ఏర్పాటు చేసిన 170 ఫ్లెక్సీలకు 500ల చొప్పున జరిమానా కట్టాలని సూచించారట.

ఈ విషయం తెలిసిన విపక్ష పార్టీల నాయకులు అధికారుల తీరుపై భగ్గుమన్నారు. అధికారపార్టీ నేతలకు నామ మాత్రపు ఫైన్‌ వేసి.. తమను బెదిరిస్తున్నారని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. అందరికీ ఒకేలా ఉండాల్సిన రూల్స్‌.. టీఆర్ఎస్‌ నేతలకు ఒకలా.. మిగతావారికి మరోలా ఎలా మారిపోతాయని ప్రశ్నిస్తున్నారట. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వరంగల్‌ వచ్చినప్పుడు కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు పెట్టాయి. వాటిని మున్సిపల్‌ సిబ్బంది తీసేశారు. అధికారపార్టీ నేతల ఒత్తిడితోనే వాటిని తీసేశారన్నది కాంగ్రెస్‌ నాయకుల ఆరోపణ. మొత్తానికి ఓరుగల్లు రాజకీయాల్లో ఫ్లెక్సీల రగడ రచ్చ రచ్చ అవుతోంది. మాట వింటే ఒకలా.. వినకపోతే ఇంకాల మద్దెల దరువు తప్పడం లేదు అధికారులకు. మరి.. రానున్న రోజుల్లో ఈ అంశం ఇంకెలాంటి వివాదాలు రేపుతుందో చూడాలి.

Exit mobile version