Site icon NTV Telugu

NIMS Director Manohar : CMO, మంత్రుల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న డాక్టర్లు

Nims

Nims

ప్రతిష్టాత్మకమైన నిమ్స్‌లో డైరెక్టర్‌ పోస్ట్‌ కోసం పైరవీలు పీక్స్‌కు చేరుకున్నాయా? ఆశావహుల సంఖ్య భారీగానే ఉందా? సీఎంవోతోపాటు.. మంత్రుల కార్యాలయాల చుట్టూ వైద్యులు చక్కర్లు కొడుతున్నారా? ప్రభుత్వం దృష్టిలో.. ఆ పోస్టుకు అర్హులైన డాక్టర్లు ఎవరు ఉన్నారు?

అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక వైద్య సేవలను అందించే నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌.. నిమ్స్‌ చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదం ముసురుతూనే ఉంటుంది. తాజాగా నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌.. గుండెపోటు వస్తే మరో ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడం విమర్శలకు ఆస్కారం కల్పించింది. ఇంతలో నిమ్స్‌కు కొత్త డైరెక్టర్‌ వస్తారన్న ప్రచారం జోరందుకుంది. ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వబోతున్నట్టు సమాచారం. సెర్చ్‌ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. నిమ్స్‌ ప్రతిష్ఠను పెంచేలా.. అక్కడ సమర్ధుడైన డైరెక్టర్‌ను ఎంపిక చేయడానికి ప్రభుత్వం చూస్తోంది. రోగులకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు.. పరిపాలన పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉండే సీనియర్‌ డాక్టర్‌ కోసం ప్రభుత్వం జల్లెడ పడుతున్నట్టు చెబుతున్నారు.

హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లోని మెడికల్‌ కాలేజీల్లో ఉండే ఉత్తమ ప్రొఫెసర్లపై ప్రభుత్వ ఆరా తీస్తోందట. అనేక వడపోతల తర్వాత ఐదారుగురు పేర్ల మధ్య కసరత్తు జరుగుతోందట. వారిలో ఒకరిని నిమ్స్‌ డైరెక్టర్‌గా నియమిస్తారని చెబుతున్నారు. ఆ ఐదారుగురు పేర్లు బయటకు రాకపోయినా.. వైద్య వర్గాల్లో మాత్రం కొందరి గురించి గట్టిగానే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రి డీన్‌గా ఉన్న డాక్టర్‌ రామ్మూర్తి, సూపరింటెండెంట్‌ నిమ్మ సత్యనారాయణ రేస్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. నిమ్మ సత్యనారాయణ విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటారని.. ఆస్పత్రికి రెగ్యులర్‌గా రారనే విమర్శలు ఉన్నాయట. సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ HODగా ఉన్న డాక్టర్‌ బీరప్ప పేరు కూడా డైరెక్టర్‌ పోస్ట్ కోసం చర్చల్లో నలుగుతోందట. మొత్తంగా నిమ్స్‌లోనే ముగ్గురు మధ్య పోటీ ఉందని తెలుస్తోంది.

సీఎంవోలో OSDగా ఉన్న తాడూరి గంగాధర్‌ పేరు కూడా చర్చల్లో ఉందట. ఆయన పేరును కొందరు వైద్యులు ఇప్పటికే మంత్రి హరీశ్‌రావుకు సూచించారట. వైద్య విద్య డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్‌ రమేష్‌రెడ్డి కూడా నిమ్స్‌ డైరెక్టర్‌ పోస్టుపై ఆశలు పెట్టుకున్నారట. అయితే ఆయనపై ఉన్న విమర్శలు ప్రతికూలంగా మారతాయనే చర్చ ఉంది. ప్రస్తుతం DME పదవి కంటే.. నిమ్స్‌కు డైరెక్టర్‌ను చేస్తే ఇంకా ఎక్కువ పనిచేస్తానని ప్రభుత్వ పెద్దలకు చెప్పారట రమేష్‌రెడ్డి. వీరితోపాటు.. పలువురు ప్రొఫెసర్లు సైతం తమకు అవకాశం ఇవ్వాలని.. తెలంగాణ ఉద్యమ సమయంలో ముందుండి పోరాటం చేశామని సీఎంవో, మంత్రుల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. మరి.. ప్రచారంలో ఉన్న పేర్లకు ప్రభుత్వం టిక్‌ పెడుతుందో.. గతంలో వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఆచి తూచి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

Exit mobile version