NTV Telugu Site icon

Off The Record: గుమ్మనూరు చుట్టూ వివాదాలు

Maxresdefault (3)

Maxresdefault (3)

భవిష్యత్తులో విరూపాక్షి పోటీకి వస్తాడనేనా..? | OTR | Ntv

తప్పు జరిగితే సరిదిద్దుకుంటారు. మళ్లీ పొరపాట్లకు ఆస్కారం కలగకుండా జాగ్రత్త పడతారు. ఆ మంత్రికి ఏమైందో ఏమో.. వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పుడు సొంత సామాజికవర్గానికి చెందిన పార్టీ నేతలే అమాత్యునిపై తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.

జడ్పీటీసీ విరూపాక్షిపై మంత్రి బంధువుల ఫైర్‌
ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకల్లో మంత్రి గుమ్మనూరు జయరామ్‌ కుటుంబ సభ్యుల తీరుపై నొచ్చుకుని వైసీపీ జడ్పీటీసీ సభ్యుడు విరూపాక్షి రాజీనామాకు సిద్ధపడ్డారు. చిప్పగిరి సభలో మంత్రి కుమారుడు ఈశ్వర్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనికితోడు మంత్రి బంధువు… పార్టీ మండల కన్వీనర్‌ నారాయణ సైతం జడ్పీటీసీవైపు వేలు చూపిస్తూ చేసిన హెచ్చరికలు సమస్యను మరింత పెద్దవి చేశాయి. రెండు కార్లలో వెళ్తే, బ్యానర్లు కట్టుకుంటే లీడర్లు కాలేరని.. బ్రాండ్ అంటే గుమ్మనూరు అని మంత్రి కుమారుడు ఈశ్వర్‌ వ్యాఖ్యలు చేశారు. జడ్పీటీసీ పదవికి రాజీనామా చేస్తే.. ఇద్దరం పోటీ చేసి ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందామని నారాయణ సవాల్‌ విసిరారు. మంత్రి భిక్షతోనే జడ్పీటీసీ అయిన విషయం మర్చిపోవద్దని విరూపాక్షిని దెప్పి పొడిచారు. ఈ వ్యాఖ్యలు, సవాళ్లతో ఒక్కసారిగా వైసీపీ రాజకీయం మారిపోయింది.

రాజీనామాకు సిద్ధపడ్డ జడ్పీటీసీ విరూపాక్షి
మంత్రి కుమారుడు, బంధువుల వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన విరూపాక్షి జడ్పీటీసీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధ పడ్డారు. ఒకటిరెండు రోజుల్లో రాజీనామా చేస్తానని లోకల్‌ పార్టీ గ్రూపుల్లో విరూపాక్షి పోస్టులు పెట్టారు. వైఎస్‌ కుటుంబంపై అభిమానంతో వైసీపీలో పనిచేస్తున్నారని.. అందుకు గుర్తింపుగా జడ్పీటీసీ టికెట్‌ ఇచ్చారని.. ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని చెబుతున్నారు విరూపాక్షి. జడ్పీటీసీ పదవికి రాజీనామా చేసినా వైసీపీలోనే కొనసాగుతానని ఆయన ప్రకటించారు.

మంత్రి, జడ్పీటీసీ మధ్య విభేదాలు
వాస్తవానికి మంత్రి జయరామ్‌కు, జడ్పీటీసీకి కొంతకాలంగా విబేధాలు ఉన్నాయి. జడ్పీటీసీ పనులు ఏవీ చేయొద్దని అధికారులను మంత్రి అనుచరులు అదేశించారట. జడ్పీటీసీ, మంత్రి ఒకే సామాజికవర్గం కావడం, భవిష్యత్తులో తన సీటుకు పోటీ వస్తారని భావించి విరూపాక్షిని వ్యూహాత్మకంగా దూరం పెడుతున్నారట. పోటాపోటీగా కార్యక్రమలు చేపట్టడంతో వారి మధ్య గ్యాప్ వచ్చింది. నిజానికి మంత్రి అయినప్పటి నుంచి జయరామ్‌ను అనేక వివాదాలు ముసురు కున్నాయి. మొదట్లో ESI స్కామ్‌లో ఆరోపణలు వచ్చాయి. తర్వాత నియోజకవర్గంలో పేకాట వ్యవహారాలతో రచ్చ రచ్చ అయ్యింది. ఇటీవల భూ ఆక్రమణల ఆరోపణలు మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. వివాదాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మొన్నటి కేబినెట్‌ విస్తరణలో జయరామ్‌కు సీటు ఉంటుందో ఊడుతుందో అని చర్చ సాగింది. కానీ.. సామాజిక సమీకరణాల లెక్కల్లో జయరామ్‌ తన మంత్రి పదవిని పదిలం చేసుకున్నారు. కేబినెట్‌లో కొనసాగించడంతో తనకేం కాదన్న ధీమానో ఏమో.. మంత్రితోపాటు మంత్రి అనుచరులు, కుటుంబ సభ్యులు గీత దాటుతున్నారని పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ క్రమంలోనే జడ్పీటీసీ విరూపాక్షి ఎపిసోడ్‌ చర్చకు వచ్చింది.

ఉపఎన్నిక వస్తే మంత్రికి కష్టమేనా?
జడ్పీటీసీ విరూపాక్షి రాజీనామాను అధికారులు ఆమోదిస్తే.. ఉపఎన్నిక వస్తే చిక్కుల్లో పడేది మంత్రి జయరామే అనే చర్చ జరుగుతుందట. గతంలో జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడంతో అప్పటి మంత్రి మారెప్పను మంత్రి పదవికి రాజీనామా చేయించారు ఆనాటి సీఎం వైఎస్‌ఆర్‌. ఇపుడు ఉపఎన్నిక వస్తే.. ఫలితాల్లో తేడా కొడితే మంత్రి జయరాం పదవికే ఎసరు రావొచ్చని చెవులు కొరుక్కుంటున్నారట. మరి..ఈ సమస్య ఎటు నుంచి ఎటు దారితీస్తుందో చూడాలి.