ఆ ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్ క్లాస్ తీసుకున్నారా? పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారా? ఎమ్మెల్యే ఒక అధికారి పేరును ప్రతిపాదిస్తే.. ముఖ్యమంత్రి మరో ఆఫీసర్‌ను నియమిస్తామని చెప్పారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే..? ఆయనపై సీఎం ఎందుకు గుర్రుగా ఉన్నారు? టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?
నల్లగొండపై సీఎం సమీక్షలో ఆసక్తికర అంశాలు
ఇటీవల నల్లగొండ జిల్లాలో పర్యటించారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ తండ్రి చనిపోవడంతో పరామర్శకు వెళ్లారు ముఖ్యమంత్రి. ఈ పర్యటన సందర్భంగా నల్గొండ జిల్లా అభివృద్ధిపై సమీక్ష చేశారు సీఎం. నల్గొండ అభివృద్ధి కోసం అధికారులకు, ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన సంఘటనలు జరిగినట్టు జిల్లా టీఆర్‌ఎస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిపై అసంతృప్తి?
ఆ సమీక్షా సమావేశంలో నల్లగొండ పట్టణ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఎక్కువగా దృష్టి పెట్టారట. టౌన్‌లో అపరిశభ్రతపై స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇది ఆ నోటా ఈ నోటా బయటకు రావడంతో ఒక్కటే చర్చ. కేవలం నల్లగొండ టౌన్ పరిస్థితిపైనే ఆగ్రహం వ్యక్తం చేశారా? లేక ఇంకేవైనా కారణాలు ఉన్నాయా? అని ఆరా తీసేవాళ్లు ఎక్కువయ్యారు. నల్గొండ మున్సిపాలిటీ అభివృద్ధిపై అధికారులతో సీఎం కేసీఆర్ పూర్తిస్థాయి సమాచారం తీసుకున్నారట. సరిగ్గా వివరాలు చెప్పని ఒక అధికారిని బదిలీ చేశారు.
ఒక అధికారి పేరును నేరుగా సీఎంకు సూచించిన భూపాల్‌రెడ్డి..!
అదే సమావేశంలో నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా ఒక అధికారి పేరును ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సూచించారట. ఆ ప్రతిపాదనను సీఎం కేసీఆర్ పక్కన పెట్టారట. ప్రస్తుత సిద్ధిపేట కమిషనర్‌గా ఉన్న అధికారిని నల్లగొండకు పంపుతామని.. త్వరలో రిటైరయ్యే ఆ ఆఫీసర్ పదవీకాలం కూడా పొడిగిస్తామని తెలిపారట. ఆ అధికారి చేసే పనుల్లో నువ్వేం జోక్యం చేసుకోకు.. అంతా ఆయన చూసుకుంటారు అని ఎమ్మెల్యేకు స్పష్టం చేశారట సీఎం.
ఎమ్మెల్యే తీరుపై సమావేశంలో ఉన్నవాళ్లంతా అవాక్కు..!
వాస్తవానికి తమ నియోజకవర్గానికి ఎవరైనా అధికారులు కావాలి అని ఎమ్మెల్యేలు అనుకుంటే.. సీఎంను వ్యక్తిగతంగా కలిసి విన్నవిస్తారు. లేదంటే సీఎం దగ్గరకు ఆ సమాచారం వెళ్లేలా చొరవ తీసుకుంటారు. కానీ.. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అందరి ముందూ ఒక అధికారి పేరును నేరుగా సీఎం కేసీఆర్‌కు చెప్పడంతో సమావేశంలో ఉన్నవారంతా అవాక్కయ్యారట. భూపాల్‌రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే. అనుభవం లేదని అనుకున్నా.. అదే సమావేశంలో మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారంతా కామ్‌గా ఉంటే భుపాల్‌రెడ్డి మాత్రం అన్నింటీకీ అడ్డంపడటంతో సీఎం అసహనం చెందినట్టు తెలుస్తోంది.
టాక్ ఆఫ్ ది టౌన్‌గా ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి..!
ప్రస్తుతం జిల్లా టీఆర్‌ఎస్ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి. అనుభవ లేమిని అందరి ముందూ బయటపెట్టేసుకున్నారని.. ఆ విషయాన్ని సీఎం అర్థం చేసుకుంటే సరి.. లేదంటే రానున్న రోజుల్లో ఎమ్మెల్యేకు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని ఒక్కటే గుసగుసలు.
