Site icon NTV Telugu

Anantapur TDP Politics : అనంతపురం నేతలకు గట్టిగానే క్లాస్ తీసుకున్న చంద్రబాబు

Ananthapur

Ananthapur

Chandrababu took a strong class to the leaders of Anantapur :

కొందరు చెబితే వింటారు. మరికొందరు కోప్పడితే దారిలో పడతారు. ఇంకొందరు ఏం చేసినా మారరు. ఇందులో మూడో కేటగిరికి చేరారట ఆ జిల్లాలోని టీడీపీ నేతలు. స్వయంగా చంద్రబాబు కన్నెర్ర చేసినా.. గట్టిగా క్లాస్‌ తీసుకున్నా.. దులిపేసుకుంటున్నారట. ఇంతకీ ఎవరా నాయకులు? చంద్రబాబు కోపానికి కారణం ఏంటి? లెట్స్‌ వాచ్‌..!

గతంలో సమావేశాలు పెడితే గంటల తరబడి స్పీచ్‌లు ఇచ్చే చంద్రబాబు.. ప్రస్తుతం టీడీపీ మీటింగ్స్‌లో చెప్పాల్సింది సూటిగా చెప్పేస్తున్నారు. 2019 ఓటమి తర్వాత వర్క్‌ స్టయిల్‌ మారిపోయిందనేది పార్టీ నేతలు చెప్పేమాట. నియోజకవర్గాల్లో ఏం జరుగుతోంది? ఎవరు ఏం చేస్తున్నారు? నాయకులపై ప్రజల అభిప్రాయం ఏంటీ? ఇలా ఎప్పటికప్పుడు ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్నారట. ఆ నివేదిక ఆధారంగానే సమావేశాల్లో మాట్లాడుతున్నారట చంద్రబాబు. ఈ క్రమంలో జరిగిన ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ మీటింగ్‌ పార్టీ వర్గాల్లో చర్చగా మారింది.

జూమ్‌లో చంద్రబాబు సమావేశం అని చెప్పగానే.. అనంతపురం జిల్లా నాయకులు రొటీన్‌ మీటింగ్‌ గానే భావించారట. బాగా పనిచేయాలని చెబుతారని లైట్‌ తీసుకున్నారట నేతలు. సమావేశం ప్రారంభం కాగానే.. ఎవరెవరు ఏం చేస్తున్నారో చంద్రబాబు ఫుల్‌ క్లారిటీతో క్లాస్‌ తీసుకోవడం మొదలుపెట్టారట. దాంతో సమావేశం మొదలైన రెండు నిమిషాలకే జూమ్‌లో హాజరైన టీడీపీ నేతలకు పరిస్థితి అర్థమైంది. ఈసారి క్లాస్‌.. డోస్‌ గట్టిగానే ఉంటుందని భయపడ్డారట. ఇంతలోనే మీకు చెప్పింది ఏంటి? మీరు చేస్తోంది ఏంటి? అని ప్రశ్నల వర్షం కురిపించారట చంద్రబాబు. విద్యుత్‌, ఆర్టీసీ ఛార్జీలు.. నిత్యావసరాల ధరలపై ఎందుకు నిరసనలు చేయడం లేదని నిలదీశారట. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని లైట్‌గా తీసుకున్న నేతలకు జూమ్‌లోనే తలంటేశారట టీడీపీ అధినేత.

నిరసన కార్యక్రమాల పేరుతో రెండు రోజులు రోడ్డెక్కుతున్న నేతలు.. తర్వాత పత్తా లేకుండా పోతున్నారని.. వీలు కుదిరినప్పుడు జనాల్లోకి వెళ్తున్నారని… టీడీపీ నేతల జాతకాలు బయట పెట్టారట చంద్రబాబు. పార్టీ కార్యక్రమాలను లైట్ తీసుకుంటున్న వాళ్లకు గట్టిగానే తలంటినట్టు తెలుస్తోంది. ఎవరో ఒకరిద్దరు కాకుండా.. జిల్లాలో నాయకులందరి పరిస్థితి అలాగే ఉందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట చంద్రబాబు. గతానికి భిన్నంగా జూమ్‌ మీటింగ్‌ జరగడంతో అనంత టీడీపీ నేతలకు నోటిమాట రాలేదట. ఐదు జిల్లాలకు టీడీపీ కోఆర్డినేటర్‌గా ఉన్న మాజీ మంత్రి అమర్నాథరెడ్డి ఏం చేస్తున్నారని నిలదీయడంతో కాసేపు చర్చ అటు మళ్లింది. జిల్లాలో టీడీపీ నేతలపై ఇదే విధంగా ఫోకస్‌ ఉంటుందని.. సీరియస్‌గా స్పందించకపోయినా.. నాయకుల తీరులో మార్పు రాకపోయినా.. ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తానని చంద్రబాబు హెచ్చరించినట్టు సమాచారం.

చంద్రబాబు ఆగ్రహం చూశాక.. పార్టీ ఇంఛార్జ్‌ అమర్నాథరెడ్డి జిల్లాల వారీగా టీడీపీ సమావేశాలకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు నాయకుల పనితీరుపై నివేదికలు పంపాలని నిర్ణయించారట. దీంతో నియోజకవర్గాల్లో నిద్రాణంగా ఉన్న టీడీపీ నేతల్లో కదలిక వస్తుందా రాదా అనే ప్రశ్న వినిపిస్తోంది. వైసీపీ సర్కార్‌పై పార్టీ చేపట్టిన బాదుడే బాదుడు ఎలా ఉన్నా.. చంద్రబాబు తమను మాత్రం బాగానే బాదేశారని చెవులు కొరుక్కుంటున్నారట టీడీపీ నేతలు.

 

Exit mobile version