Vishaka YCP : ఆ నియోజకవర్గంలో అధికారపార్టీ లెక్కలు మారుతున్నాయా? సర్వేల ఎఫెక్ట్‌తో కోఆర్డినేటర్ కాళ్ల కిందకు నీళ్లొచ్చేసినట్టేనా? మార్పు తప్పదనే సంకేతాలతో ఎవరు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు? రాజకీయంగా ఆసక్తి పెంచుతున్న అంశాలేంటి? ఇంతకీ ఏంటా సెగ్మెంట్? లెట్స్ వాచ్..!
విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీలో తిరుగుబాటు పతాకస్థాయికి చేరింది. ప్రస్తుత ఇంఛార్జును సాగనంపడం దాదాపు ఖాయమైందనే చర్చ పార్టీలో ఉంది. ఇక్కడ కొంత కాలంగా మేయర్ హరి వేంకట కుమారి, VMRDA ఛైర్‌పర్సన్ అక్కరమాని విజయనిర్మల మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధం డైరెక్ట్ ఫైట్‌గా మారింది. రాజకీయ ఆధిపత్యం కోసం మొదలైన ఎత్తుగడలు ఒకటైతే.. విజయనిర్మల నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడం మరో ఎత్తు. రెండు పేజీల లేఖలో తన నియోజకవర్గ కార్పొరేటర్లు అవినీతికి పాల్పడుతున్నారని ప్రస్తావించినట్టు సమాచారం. ఈ ఆరోపణల వెనక మెయిన్ టార్గెట్ మేయరే అని అనుమానిస్తున్నారట. దాంతో VMRDA ఛైర్‌పర్సన్, మేయర్‌ల మధ్య ఉప్పు నిప్పులా మారిందని టాక్.
విజయనిర్మలకు వ్యతిరేకంగా మేయర్ భర్త శ్రీనివాస్ నేతృత్వంలో వైసీపీ కార్పొరేటర్లంతా ఏకమయ్యారు. నియోజకవర్గంలో పట్టుకోసం ఎవరికి వారే వ్యూహ ప్రతివ్యూహాలను పదును పెడుతున్నారట. విశాఖ నగరంలో తూర్పు నియోజకవర్గం ప్రత్యేకం. గత మూడు ఎన్నికల్లో టీడీపీ నుంచి వెలగపూడి రామకృష్ణబాబు గెలుస్తున్నారు. 2019 ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే వైసీపీ భావించినా.. సాధ్యం కాలేదు. అప్పటివరకూ నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేసిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ను కాదని, భీమిలి ఇంఛార్జ్‌గా ఉన్న విజయనిర్మలను బరిలో నిలిపింది పార్టీ. ఆమె టీడీపీకి గట్టి పోటీ ఇవ్వలేకపోయారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉందట. అయినప్పటికీ ఆమెనే నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్‌గా కొనసాగిస్తున్నారు. 2024 ఎన్నికల్లోనూ తూర్పు టికెట్ తనదే అనే ధీమాతో ఉన్నారట విజయనిర్మల.
మేయర్ హరి వెంకట కుమారి సైతం తూర్పు నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో విజయనిర్మలకు, మేయర్‌కు మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. ఒకరు హాజరయ్యే కార్యక్రమాలకు మరొకరు హాజరుకానంతగా దూరం పెరిగిపోయింది. నియోజకవర్గ పరిధిలో విజయనిర్మల అంతా తానై వ్యవహరిస్తున్నారని.. కార్పొరేటర్లకు, వార్డు అధ్యక్షులకు కనీసం గౌరవం ఇవ్వడం లేదని మేయర్ వర్గం ఆరోపిస్తోంది. ఇదే నియోజకవర్గానికి చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ ఇచ్చినా.. ఆయన అక్కరమానితో కలిసి పనిచేయడం లేదట. మారిన ఈక్వేషన్స్‌తో వంశీకృష్ణ.. మేయర్‌తోపాటు ఆమె భర్త శ్రీనివాసరావుతో సన్నిహితంగా ఉంటున్నారట. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా నేతల తీరు ఉందట.
ఇప్పటికే తూర్పు నియోజకవర్గ పరిధిలోని వైసీపీ కార్పొరేటర్లు, పార్టీ వార్డు అధ్యక్షులు మేయర్ వర్గంలోని ముఖ్య నేతలు సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో విజయనిర్మలకు టికెట్ ఇస్తే ప్రత్యర్థికి మరోసారి సీటు అప్పటించినట్టేనని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారట. ఈ విమర్శలకు కౌంటర్‌గానే విజయనిర్మల నేరుగా సీఎంకు ఫిర్యాదు చేయడం పుండుమీద కారం చల్లినట్టుగా మారిందట. ప్రస్తుతం సర్వే రిపోర్ట్ ఆధారంగా తూర్పులో వైసీపీ కోఆర్డినేటర్‌ను మార్చేస్తారనే చర్చ సాగుతోంది. మరి.. ఆధిపత్య పోరాటంలో ఎవరు పైచెయ్యి సాధిస్తారో చూడాలి.
