Andhra Pradesh Deputy Chief Minister Budi Mutyala Naidu :కుమార్తెకు పెత్తనం అప్పగించిన ఆ డిప్యూటీ సీఎం.. కొత్త ఆలోచనలు చేస్తున్నారా? నియోజకవర్గంతోపాటు.. పార్టీలో అంతర్గత చర్చలు చెబుతున్నదేంటి? పొలిటికల్ స్క్రీన్‌పై కుటుంబ కథా చిత్రం సక్సెస్ అవుతుందా? అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.
ఇక్కడ కనిపిస్తున్న యువతి పేరు ఈర్ల అనురాధ. ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు కుమార్తె. రాజకీయ వారసురాలిగా జనంలో బలమైన ముద్ర వేయడానికి చూస్తున్నారు. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా కే. కోటపాడు జడ్పీటీసీగా ఉన్నారు అనురాధ. ఇటీవల జరిగిన వైసీపీ ప్లీనరీ తర్వాత అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో తండ్రితో కలిసి పాల్గొంటున్నారు కూడా. డిప్యూటీ సీఎం హోదాలో తండ్రి బిజీగా ఉంటే.. మాడుగులలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని లీడ్ చేస్తోంది కుమార్తె. క్రమంగా మాడుగులలో అనురాధ పెత్తనం పెరిగేలా చేస్తున్నారు ముత్యాలనాయుడు. ఒక తండ్రిగా ఆయన ప్రయత్నిస్తున్నా.. నియోజకవర్గంలోని పరిస్థితులు.. కుటుంబ వాతావరణం.. పార్టీలోని రాజకీయాలు అందుకు సహకరిస్తాయా అన్నది ప్రశ్న.
2014లో వైసీపీ నుంచి తొలిసాగి గెలిచారు ముత్యాలనాయుడు. అప్పట్లో టీడీపీ ప్రలోభాలకు ఆయన లొంగలేదు. 2019లో రెండోసారి గెలవడం.. వైసీపీ అధికారంలోకి రావడంతో.. ప్రభుత్వ విప్ అయ్యారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో మంత్రివర్గంలో చోటు సంపాదించడంతోపాటు.. ఏకంగా డిప్యూటీ సీఎంగా పదోన్నతి పొందరు ముత్యాలనాయుడు. పార్టీ పట్ల విధేయత.. సామాజిక సమీకరణాలు ఆయనకు కలిసొచ్చాయి. కాకపోతే వచ్చే ఎన్నికల నాటికి మాడుగులలో రాజకీయంగా మార్పులు తప్పవనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ముత్యాల నాయుడిని ఈ దఫా అనకాపల్లిలో లోక్‌సభకు పోటీ చేయిస్తారనే చర్చ వైసీపీ వర్గాల్లో ఉంది. అనకాపల్లిలో టీడీపీ నుంచి మాజీ మంత్రి కుమారుడు బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఆ ఎత్తుగడ నిజమైతే.. ముత్యాలనాయుడిని అనకాపల్లికి షిఫ్ట్ చేస్తారని సమాచారం. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా డిప్యూటీ సీఎం కదలికలు ఉంటున్నాయి. అదే జరిగితే.. అనురాధను మాడుగులలో పోటీ చేయిస్తారని అనుకుంటున్నారట. దీనిపై నియోజకవర్గంలో గట్టి చర్చే జరుగుతోంది. అయితే వారసత్వం దగ్గరకు వచ్చేసరికి ముత్యాలనాయుడు ఆలోచనలు నల్లేరుపై నడక కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోందట.
కుమార్తె పోటీపై వస్తున్న ప్రశ్నలకు కారణం కుటుంబ పరమైన వ్యవహారాలేనట. ముత్యాల నాయుడు కుమారుడు రవి తనపై తండ్రి నీడ పడకుండా రాజకీయంగా ఎదగాలని చూస్తున్నారట. స్వతంత్రంగా పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. జిల్లా నుంచి రాష్ట్రస్ధాయి నాయకత్వం వరకూ అందరినీ తరచు కలుస్తున్నారు రవి. తండ్రికి వ్యతిరేకంగా వ్యవహరించక పోయినప్పటికీ వారసత్వం విషయంలో ఎంత వరకు రాజీపడతారనేది అనుమానమే. ఈ అంశాలు పార్టీ ఫలితాలనో.. ముత్యాల నాయుడు ఇమేజ్ నో ప్రభావితం చేస్తాయో లేదో కానీ.. రాజకీయంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరి.. మాడుగుల రాజకీయం వచ్చే ఎన్నికల నాటికి ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.