Site icon NTV Telugu

Anantapuram YCP Politics : తాడేపల్లిలో ఆ సమస్య పరిష్కారానికి అధినేత జోక్యం తప్పదా..?

Tadepalli Politics

Tadepalli Politics

Anantapuram YCP Politics :

తాడేపల్లిలో హిందూపురం పంచాయితీ ఎందుకు కొలిక్కి రాలేదు? అధినేత జోక్యం చేసుకుంటే కానీ.. సమస్య పరిష్కారం కాబోదా? రెండు వర్గాల మధ్య పట్టువిడుపుల్లేవా? సమావేశం ఎక్కడైనా.. ఫైటింగ్‌ సీన్లు మామూలేనా? ఎందుకలా? లెట్స్‌ వాచ్‌..!

అనంతపురం జిల్లాలో టీడీపీతో పోలిస్తే వైసీపీలో విబేధాలు తక్కువే. నాలుగైదు నియోజవర్గాలు మినహా పెద్దగా ఎక్కడా నేతల మధ్య తగాదాలు లేవు. కాకపోతే వైసీపీలో విబేధాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఏది అంటే.. హిందూపురం టాప్‌లో ఉంటుంది. 2019 ఎన్నికల ముందు నుంచి ఒక్కటే రగడ. ఎప్పటి నుంచో నవీన్ నిశ్చల్ వైసీపీలో బలమైన నేతగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో బాలకృష్ణపై నవీన్‌ గెలుస్తారని కేడర్‌ భావించిన సమయంలో మాజీ పోలీస్‌ అధికారి మహ్మద్‌ ఇక్బాల్‌ వైసీపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. నవీన్‌ను ఎందుకు పక్కకు పెట్టారో చెప్పకుండానే ఇక్బాల్‌ను బరిలో దించారని ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ ఎన్నికల్లో ఇక్బాల్‌ ఓడిపోయారు. అప్పటి నుంచి వైసీపీలో వీరి మధ్య విబేధాలు ఒక రేంజ్ లో సాగుతున్నాయి.

ఓడిన ఇక్బాల్‌ను ఎమ్మెల్సీని చేశారు. దాంతో ఆయన పెత్తనం పెరిగింది. ఇది నవీన్‌తోపాటు.. ఇక్బాల్‌ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారికి పుండుమీద కారం చల్లినట్టుగా మారింది. గొడవలు సాధారణంగా మారిపోయాయి. నవీన్‌కు నామినేటెడ్‌ పదవి వచ్చినా.. సమస్య చల్లార లేదు. ఆ మధ్య నవీన్ వర్గంతోపాటు మరికొందరు ఏకమై కర్ణాటకలో క్యాంప్ రాజకీయాలు నడిపారు. స్థానికేతరుడైన ఇక్బాల్ పెత్తనం సహించేది లేదని తేల్చేశారు వాళ్లంతా. ప్రెస్ క్లబ్ వేదికగానే రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. పోలీసు కేసులు పెట్టుకున్నారు.

పరిస్థితి చెయ్యి దాటిపోతుందని గమనించిన వైసీపీ అధిష్ఠానం రెండు వర్గాలను పిలిపించింది. పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ గా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. హిందూపురం నుంచి రెండు వర్గాలు పెద్ద సంఖ్యలో తాడేపల్లి వెళ్లాయి. ఆ సమావేశంలోనూ పరస్పరం విమర్శలు వెల్లువెత్తాయి. పెద్దిరెడ్డి సమక్షంలోనే తీవ్ర వాగ్యుద్దానికి దిగారు నాయకులు. హిందూపురంలో లోకల్ నాయకులను ఇంఛార్జ్‌గా పెట్టాలని.. ఎక్కడి నుంచో వచ్చిన వారితో తాము పని చేయలేమని పెద్దిరెడ్డికి స్పష్టం చేశారు. అందరూ కలిసి పనిచేయాలని అధిష్ఠానం సూచించినా అసమ్మతి వర్గం ససేమిరా అంది.

రెండు వర్గాలు వెనక్కి తగ్గే పరిస్థితి లేకపోవడంతో.. మంత్రి పెద్దిరెడ్డి చేతులు ఎత్తేశారట. సమావేశం గందరగోళంగా మారడంతో.. సమస్యను సీఎం జగన్‌ దగ్గర పెడతామన్నారట. దాంతో హిందూపురం పంచాయితీ ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్తోంది. ఆయన ఎప్పుడు పిలుస్తారు? ఎవరిని బుజ్జగిస్తారు? ఎవరిని అదిలిస్తారు అనేది ఉత్కంఠగా మారింది.

 

Exit mobile version