మెగా ఫ్యామిలీలో సంతోషం మరోసారి వెల్లివిరిసింది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మరోసారి గర్భం దాల్చారు. ఇటీవలే దీపావళి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన వేడుకల్లో భాగంగా, ఉపాసనకు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా సీమంతం కూడా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన వార్తలు బయటకు రావడంతో మెగా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు 2023 జూన్‌లో మొదటి సంతానంగా పాప ‘క్లీంకార కొణిదెల’ జన్మించిన సంగతి తెలిసిందే. క్లీంకార రాకతో మెగా కుటుంబంలో కొత్త వెలుగులు నిండాయి. ఇప్పుడు, దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ వారి ఇంటికి మరో వారసుడు/వారసురాలు రాబోతుండటంతో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ హ్యాపీ న్యూస్ తెలిసిన వెంటనే సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులు రామ్ చరణ్-ఉపాసన దంపతులకు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.
Also Read:Chiranjeevi : అయ్యప్ప మాల ధారణ చేసిన మెగాస్టార్
ఈసారైనా మనవడు పుడతాడా?
ఉపాసన రెండోసారి ప్రెగ్నెంట్ అనే వార్తతో పాటు, ఇప్పుడు మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. “ఈ సారైనా మెగాస్టార్ చిరంజీవి కోరిక నెరవేరుతుందా? ఆయన కోరుకున్నట్టు మనవడే పుడతాడా?” అని అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇలాంటి చర్చ జరగడానికి కారణం లేకపోలేదు. గతంలో చిరంజీవి స్వయంగా తనకు మనవడి కోసం ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారో వెల్లడించారు. తన కొడుకు రామ్ చరణ్‌కు (క్లీంకార), అలాగే ఇద్దరు కూతుళ్లకు (సుస్మిత, శ్రీజ) కూడా ఆడపిల్లలే కావడంతో, తన ఇల్లంతా ‘లేడీస్ హాస్టల్’లా మారిపోయిందని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. “ఇంట్లో అందరూ ఆడపిల్లలే.. ఒక మనవడిని ఇవ్వరా అని రామ్ చరణ్‌ను అడిగాను,” అని చిరంజీవి గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. దీంతో, ఉపాసన రెండో ప్రెగ్నెన్సీతోనైనా మెగాస్టార్ చిరకాల కోరిక తీరి, మెగా కుటుంబంలోకి ఓ మనవడు అడుగుపెడతాడేమోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
