NTV Telugu Site icon

YouTube @ 20: 20 ఏళ్ల యూట్యూబ్.. దీని చరిత్ర మీకు తెలుసా..!

Youtube

Youtube

మన జీవితాల్లో youtube ఎంతగా భాగమయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ఓపెన్ చేయకుండా ఇప్పుడు రోజు ముగియట్లేదు. మనకు ఎలాంటి సమాచారం కావాలన్నా యూట్యూబ్ లో వెతికేస్తుంటాం.. వీడియోల ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడా యూట్యూబ్ కు 20 ఏళ్లు..! ఒక చిన్న వెబ్ సైట్ నుంచి ఇప్పుడు అతిపెద్ద వీడియో ప్లాట్ ఫాంగా మారిన యూట్యూబ్ కథేంటో ఇప్పుడు చూద్దాం…

YouTube ఎలా ప్రారంభమైందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. యూట్యూబ్ ను ప్రారంభించేటప్పుడు ఇది ఇంత పెద్ద వ్యవస్థ అవుతుందని అస్సలు ఊహించలేదు. 2005 ఫిబ్రవరి 14న PayPal ఉద్యోగులు – చాద్ హర్లీ, స్టీవ్ చెన్, జావేద్ కరీమ్ కలిసి యూట్యూబ్‌ను ప్రారంభించారు. ఇంటర్నెట్ వినియోగదారులు తమ వీడియోలను ఇతరులతో పంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన ప్లాట్‌ఫామ్ లేకపోవడంతో, ఈ ముగ్గురు ఈ ఆలోచనతో ముందుకు వచ్చారు. YouTube ప్రారంభించిన కేవలం 1 సంవత్సరం లోపే, అది ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పాపులర్ అయిపోయింది. దీనిని గూగుల్ 2006లో 1.65 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది! ప్రస్తుతం యూట్యూబ్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వెబ్‌సైట్. గూగుల్ మొదటి స్థానంలో ఉంది. ప్రతి నెలా 2.5 బిలియన్ యూజర్లు యూట్యూబ్ ను సందర్శిస్తున్నారు!

యూట్యూబ్ ను మొదట ఒక డేటింగ్ వెబ్ సైట్ గా ప్రారంభించాలనుకున్న విషయం చాలా మందికి తెలీదు. కానీ ఇది నిజం. YouTubeను ప్రారంభించినప్పుడు “Tune In, Hook Up” అనే డేటింగ్ కాన్సెప్ట్‌ అనుకున్నారు. అంటే యూజర్లు తమ వీడియోలను అప్‌లోడ్ చేసి, తమ గురించి చెప్పుకోవాలి. తమ డేటింగ్ పార్ట్‌నర్‌ను వెతుక్కోవాలి. అందుకే యూట్యూబ్ ను వేలంటైన్స్ డే రోజు లాంఛ్ చేశారు. కానీ ఇది వర్కవుట్ కాలేదు. ఎవరూ తమ గురించి చెప్పుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆ ఐడియాను పక్కన పెట్టేశారు. కేవలం డేటింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా, ఎలాంటి వీడియో అయినా అప్‌లోడ్ చేయొచ్చని చెప్పారు. దీంతో కొన్ని నెలల్లోనే వీడియోలు విపరీతంగా అప్ లోడ్ కావడం మొదలైంది. అలా ఇప్పుడు YouTube ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌గా మారిపోయింది!

ఇప్పుడు యూట్యూబ్ లో కోట్లాది వీడియోలున్నాయి. మరి YouTubeలో అప్ లోడ్ అయిన మొట్ట మొదటి వీడియో ఏది అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా..? 2005 ఏప్రిల్ 23న జావేద్ కరీమ్ “Me at the zoo” అనే వీడియోను అప్‌లోడ్ చేశారు. ఈ 18 సెకన్ల వీడియోలో, జావేద్ కరీమ్, సాన్ డియాగో జూలో ఉన్న ఏనుగుల గురించి చెప్పారు. అదే యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన తొలి వీడియో! ఇప్పటికి ఈ వీడియో 300 మిలియన్ వ్యూస్ దాటింది.

YouTube ఇప్పుడొక సంచలనం. ఆరంభంలో ఇది కేవలం వెబ్ సైట్ మాత్రమే. అయితే కాలానుగుణంగా ఇది మారుతూ వచ్చింది. ప్రారంభంలో యూట్యూబ్ కేవలం వ్యక్తిగత వీడియోలను షేర్ చేసుకునే ప్లాట్‌ఫామ్‌గా ఉన్నా, తర్వాత టీవీ, సినిమాల కంటే ఎక్కువ ప్రభావం చూపించే మాధ్యమంగా మారింది. న్యూస్, ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్, గేమింగ్, టెక్నాలజీ – ఇలా ప్రతి రంగంలో యూట్యూబ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు యూట్యూబ్ లో దొరకని వీడియో లేదు. ఏ రంగానికి సంబంధించిన వీడియో అయినా ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఏదైనా తెలుసుకోవాలనుకునే వాళ్లకు ఇదొక గ్లోబల్ లైబ్రరీ.

YouTubeలో అనేక వీడియోలు ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాయి. అయితే రికార్డు వ్యూస్ సంపాదించిన వీడియోలేవో తెలుసా..? 2012లో “Gangnam Style” పాట యూట్యూబ్‌లో 1 బిలియన్ వ్యూస్ సాధించిన మొదటి వీడియోగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు అత్యధికంగా వీక్షించబడిన వీడియో మాత్రం “Baby Shark Dance”. ఇది 13 బిలియన్ వ్యూస్ దాటి రికార్డు సృష్టించింది!

YouTube ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చనే విషయం చాలా మందికి తెలుసు. అయితే ఏఏ మార్గాల ద్వారా డబ్బు వస్తుందో ఇప్పుడు చూద్దాం.. YouTube Partner Program ద్వారా, కంటెంట్ క్రియేటర్లు తమ వీడియోల ద్వారా ఆదాయం పొందే అవకాశం ఉంది. యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించేందుకు అనేక మార్గాలున్నాయి. అందులో Adsense Revenue ఒకటి. ఇందులో వీడియోలపై వచ్చే యాడ్స్ ద్వారా డబ్బు వస్తుంది. రెండోది Sponsorships – ఇందుకోసం పెద్ద కంపెనీలతో మీరు ఒప్పందాలు చేసుకోవచ్చు. మూడోది Memberships – ఇందులో వీక్షకులు చందా చెల్లించి ప్రత్యేక కంటెంట్ పొందగలరు. నాలుగోది Merchandise Sales – మీ బ్రాండ్‌కు సంబంధించిన వస్తువులను అమ్ముకోవచ్చు. టాప్ YouTubers ఏటా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఇలా మీరు కూడా కంటెంట్ క్రియేటర్‌గా ఎదగొచ్చు!