Site icon NTV Telugu

Subhash Chandra Bose Jayanti: 70గంటల పని విధానం.. 100ఏళ్ల క్రితం నేతాజీ ఏం చెప్పారు?

Subash Chandra Bose Work Life Balance

Subash Chandra Bose Work Life Balance

జనవరి 23..! పరాక్రమ దివస్..! దేశమంతా నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను గుర్తు చేసుకునే రోజు. స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన విప్లవవీరుడి జన్మదినం. ఇదే సమయంలో ఇండియాలో మరో చర్చ గట్టిగా వినిపిస్తోంది. యువత రోజుకు 12 గంటలు పనిచేయాలా? వారానికి 70 నుంచి 90 గంటలు పని చేయడమే దేశానికి సేవా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ పని గంటల చర్చకు సమాధానం నేతాజీ వందేళ్ల క్రితమే చెప్పారు. 1924లో, స్వాతంత్ర్య పోరాటం ఉద్ధృతంగా ఉన్న రోజుల్లోనే, మనిషి రోజుకు నాలుగు నుంచి ఆరు గంటలకంటే ఎక్కువ పని చేయాల్సిన అవసరం లేదని నేతాజీ రాశారు. పని మనిషిని బతికించాలి కానీ మనిషిని యంత్రంగా మార్చకూడదని నేతాజీ హెచ్చరించారు. ఈరోజు మనం నేతాజీని జయంతి రోజున గుర్తు చేసుకుంటున్నాం. కానీ ఆయన చెప్పిన మాటలను ఫాలో అవుతున్నామా?

దేశం ముందుకు వెళ్లాలంటే ప్రజలతో చాకిరి చేయించాలా? లేదా ప్రజలకు జీవించే సమయం ఇవ్వాలా? వందేళ్ల క్రితం ఒక యోధుడు చెప్పిన మాటలు ఈరోజు కార్పొరేట్ వాదనలకు ఎందుకు భిన్నంగా ఉన్నాయి?

1924లో జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే, ఇండియన్ సివిల్ సర్వీస్‌కు రాజీనామా చేశారు నేతాజీ. జైలు నుంచి విడుదలైన తర్వాత బెంగాలీలో ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసం పేరు ‘అమ్రా కి చాయి?’ అంటే ‘మనకు ఏం కావాలి?’ అని అర్థం. ఇది సాధారణ వ్యాసం కాదు.. రాజకీయ ప్రసంగం అంతకన్నా కాదు. స్వతంత్ర దేశంలో మనిషి ఎలా జీవించాలనే విషయంలో ఆయన ఇచ్చిన స్పష్టమైన దృక్కోణం ఈ వ్యాసంలో కనిపిస్తుంది.

ఒక మనిషి బతకడానికి రోజుకు నాలుగు నుంచి ఆరు గంటలకంటే ఎక్కువ పని చేయాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టారు నేతాజీ. ఆ రోజుల్లో పరిస్థితులు మరింత ఘోరంగా ఉండేవి. బ్రిటిష్ పాలనలో భారతీయ కార్మికులు రోజుకు 12 నుంచి 16 గంటలు పనిచేసేవారు. ఫ్యాక్టరీల్లో, రైల్వేల్లో, తోటల్లో శ్రమ దోపిడీ సాధారణంగా కనిపించేది. నేతాజీ దీన్ని కేవలం ఆర్థిక సమస్యగా చూడలేదు. ఇది మనిషి ఆత్మను చంపే వ్యవస్థగా చూశారు. మనిషి శరీరమే కాదు, అతని ఆలోచనలు, సృజనాత్మకత, ప్రేమ లాంటి అంశాలు బతకాలన్నది ఆయన నమ్మకం. నిజానికి జీవితంలో పని ఒక భాగం మాత్రమే. ఇదే నేతాజీ ఆలోచన. పని గంటలు పెంచితే దేశం ఎదుగుతుందన్న భావనను ఆయన అప్పుడే తిరస్కరించారు. మనిషి అలసిపోయే స్థాయిలో పని చేయించడం అభివృద్ధి కాదు. అది దోపిడీ మాత్రమే అని స్పష్టంగా చెప్పారు.

ఈరోజు కొంతమంది కార్పొరేట్ లీడర్లు ప్రచారం చేస్తున్న 70 నుంచి 90 గంటల వర్క్ కల్చర్‌కు ఆయన మాటలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఆధునిక కార్పొరేట్ ప్రపంచం ప్రొడక్టవిటీని గంటలతో కొలుస్తోంది. ఎక్కువ గంటలు అంటే ఎక్కువ దేశసేవ అన్న భావనను రుద్దుతోంది. కానీ ఆధునిక వైద్య, శాస్త్రీయ అధ్యయనాలు మాత్రం ఈ ప్రచారాన్ని తీవ్రంగా తిప్పుబడుతున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ కలిసి విడుదల చేసిన నివేదికలు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. వారానికి 55 గంటలకు మించి పనిచేసే వారిలో గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం భారీగా పెరుగుతోంది.ఎక్కువ గంటలు పని చేయడం డిప్రెషన్, బర్నౌట్, కుటుంబ సంబంధాల కూలిపోవడానికి కారణమవుతోంది. అంటే నేతాజీ వందేళ్ల క్రితం అనుభవంతో చెప్పిన మాటలకు ఇప్పుడు శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. ఇతర దేశాలు ఇదే విషయాన్ని అర్థం చేసుకున్నాయి.

ఐస్లాండ్, యూకే, జపాన్, న్యూజిలాండ్ లాంటి దేశాలు నాలుగు రోజుల పని వారాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశాయి. పని గంటలు తగ్గాయి. జీతాలు తగ్గలేదు. ఫలితం ఏమైంది? ఉద్యోగుల ఆనందం పెరిగింది. ఒత్తిడి తగ్గింది. చాలా చోట్ల ప్రొడక్టవిటీ కూడా పెరిగింది. తక్కువ పని చేసి ఎక్కువ ఫలితం సాధ్యమని ప్రపంచం నిరూపిస్తోంది.

అయితే ఇండియాలో మాత్రం ఇంకా శ్రమను త్యాగంగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. యువత శక్తిని పీల్చి పిప్పిచేయడం ద్వారా దేశం ముందుకు వెళ్తుందన్న భావన బలపడుతోంది. ఇదే సమయంలో నేతాజీని మనం ఫొటోలకే పరిమితం చేస్తున్నాం. ఆయన ఆలోచనలను పట్టించుకోవడం లేదు. వాస్తవానికి నేతాజీ అతిపెద్ద సోషలిస్ట్. ఆయన శ్రమ విముక్తిని కోరుకున్నారు. శ్రమ మనిషిని స్వేచ్ఛగా చేయాలి తప్ప బానిసగా చేయకూడదన్నది ఆయన లక్ష్యం. స్వరాజ్యం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ కాదు. జీవించడానికి సమయం, ఆలోచించడానికి స్వేచ్ఛ, సృజనాత్మకతకు అవకాశం ఇవ్వడమే నిజమైన స్వరాజ్యమన్నది ఆయన నమ్మకం.

మరి వందేళ్ల క్రితమే నేతాజీ చెప్పిన మాటలను నేటి కార్పొరేట్ ప్రపంచం ఎందుకు వినలేకపోతోంది? అభివృద్ధి చెందిన దేశం కావాలంటే ఎక్కువ గంటలు పని చేయాలా? లేదా మంచి జీవితాన్ని నిర్మించుకోవాలా? నేతాజీ ఆ ప్రశ్నకు సమాధానం అప్పుడే ఇచ్చారు. పని మనిషిని బతికించాలి కానీ ఓ యంత్రంగా తయారు చేస్తే దేశం ముందుకు వెళ్లదు..!

ALSO READ: ‘మీ ఆహారం కంపు కొడుతోంది..’ఇండియాపై వివక్ష విషం కక్కిన అహంకార అమెరికా.. చివరకు ఫ్యూజులౌట్!

Exit mobile version