పశ్చిమాసియా యుద్ధపుటంచులలోకి జారుకుంటోంది. ఓ వైపు ఇరాన్ ప్రతీకార దాడులకు దిగితే.. వాటిని ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ఆ రెండు దేశాలకూ పలు ప్రపంచ దేశాలు మద్దతుగా నిలుస్తుండడంతో ఇది పూర్తిస్థాయి యుద్ధంగా మారుతుందేమోననే ఆందోళన నెలకొంది. యుద్ధభయాలు కమ్ముకోవడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. పలు దేశాలు ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటాయేమోనని భయపడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితిలో మన దేశ పరిస్థితి ఏంటి..? యుద్ధం జరిగితే మనకు కలిగే నష్టాలేంటి..?
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలకు కారణాలు అనేకం. దశాబ్దాలుగా దేశాల మధ్య ఆధిపత్య పోరు ఇక్కడ నిత్యం రావణకాష్టాన్ని రగిలిస్తోంది. మతవాదం, చమురు, దేశాల మధ్య ఆధిపత్య పోరు.. పశ్చిమాసియాలో అశాంతికి కారణాలుగా చెప్పుకోవచ్చు. పాలస్తీనాతో మొదలైన సమస్యను చాలా వరకూ దేశాలు దౌత్యమార్గంలో పరిష్కరించుకోగలగాయి. అయితే ఇరాన్ మాత్రం పాలస్తీనాకే మద్దతుగా నిలిచింది. సిరియా, లెబనాన్, యెమెన్ లలోని తన మద్దతుదారుల ద్వారా ఇజ్రాయెల్ పై పరోక్షంగా యుద్దం చేస్తూ వస్తోంది. ఇప్పుడిది తారస్థాయికి చేరింది. తమ శత్రుమూకలను పూర్తిగా తుదముట్టించాలనే పట్టుదలతో ఉంది ఇజ్రాయెల్. అందుకే కలుగుల్లో దాక్కున్న టెర్రరిస్టులను వెంటాడి మరీ చంపేస్తోంది. ఎక్కడా గాజాలో మొదలైన ఉద్రిక్తతలు ఇప్పుడు పశ్చిమాసియాలోని దాదాపు అన్ని దేశాలకూ వ్యాపించాయి. అయితే ఇది ఇంతటితో ఆగేలా లేదు.
ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు. పైగా మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టేందుకు ఇజ్రాయెల్ ఎత్తుగడలు వేస్తోంది. తమ అనుకూల గ్రూపుల నేతలను ఇజ్రాయెల్ తుదముట్టించడంతో ఇరాన్ తట్టుకోలేకపోతోంది. అందులో భాగంగానే ఇజ్రాయెల్ పై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ పరిణామాన్ని ఇజ్రాయెల్ అస్సలు ఊహించలేదు. అందుకే ఇరాన్ పెద్ద తప్పు చేసిందని.. దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. అంటే ఇరాన్ పై ఇజ్రాయెల్ పోరుకే సిద్ధమవుతున్నట్టు అర్థమవుతోంది. వాస్తవానికి ఇజ్రాయెల్ తన శత్రుదేశాలపై ఆధిపత్యం కోసం పరితపిస్తుంటుంది. హెజ్బొల్లా, హమాస్, హౌతీ గ్రూపులకు చెందిన కీలక నేతలను నిర్దాక్షిణ్యంగా మట్టుబెట్టడాన్ని చూస్తే ఇజ్రాయెల్ కసి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఇజ్రాయెల్ అన్నంతపనీ చేస్తే అది ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపించడం మాత్రం ఖాయం. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మన దేశంపై యుద్ధం ప్రభావం ఎంతమేర ఉంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది.
మధ్యప్రాచ్యం నుంచే చమురును ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది భారత్. ముఖ్యంగా ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ లాంటి దేశాలు మనకు చమురు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాయి. యుద్ధం వస్తే అది కేవలం ఇరాన్ కు మాత్రమే పరిమితం కాదు. గల్ఫ్ దేశాలన్నింటిపైనా ప్రభావం పడుతుంది. అప్పుడు చమురు దిగుమతి తగ్గుతుంది.. డిమాండ్ పెరుగుతుంది. అదే జరిగితే మొదట ప్రభావితమయ్యేది చమురు ధరలే. యుద్ధం పూర్తస్థాయిలో ప్రారంభం కాకపోయినా అప్పుడే చమురు ధరలు ఎగబాకుతున్నాయి. మున్ముందు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. చమురు ధరలు పెరిగితే అది దేశ ప్రజలందరిపైనా ప్రభావం చూపిస్తుంది. పెట్రోధరలు పెరిగితే నిత్యావసరాలు, రవాణా.. లాంటివి కూడా పెరుగుతాయి.
ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వస్తే దౌత్యపరంగా భారత్ అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. యుద్ధరంగంలో నిలుస్తున్న రెండు దేశాలతో మనకు సత్సంబంధాలున్నాయి. ఇజ్రాయెల్ తో భారత్ కు సుదీర్ఘ కాలంగా చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. మన దేశానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇజ్రాయెల్ సాయం చేస్తోంది. వ్యవసాయరంగంలో కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీని అమలు చేస్తోంది. రక్షణ, అణ్వాయుధ టెక్నాలజీలను ఇచ్చిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నాయి. అమెరికా తర్వాత ఇజ్రాయెల్ తోనే భారత్ అత్యంత సన్నిహిత సంబంధాలను కలిగి ఉంటుందని చెప్పొచ్చు. ఇరాన్ తో కూడా భారత్ కు మంచి సంబంధాలున్నాయి. అణుకార్యక్రమాల వల్ల అంతర్జాతీయ సమాజం ఇరాన్ పై ఆంక్షలు విధించింది. అంతకుముందు వరకూ భారత్ కు చమురు ఎగుమతి చేస్తున్న రెండో అతి పెద్ద దేశంగా ఇరాన్ నిలిచింది. ఆంక్షలు ఉన్నప్పటికీ ఇరాన్ తో భారత్ ఇప్పటికీ సంబంధాలను కొనసాగిస్తోంది. ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు ప్రభుత్వం సంతాప దినం ప్రకటించింది. అంతేకాదు.. ఆ మధ్య ఓ కార్గో నౌకను పట్టుకున్నప్పుడు అందులోని 17 మంది భారతీయులను ఇరాన్ విడిచిపెట్టింది. దీన్నిబట్టి ఇరాన్ కు మన దేశం ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు దేశాలూ యుద్ధంలో తలపడితే భారత్ ఎటువైపు మొగ్గు చూపినా మరో దేశంతో దౌత్య సంబంధాలు దెబ్బతింటాయి. ఇలాంటప్పుడు భారత్ పరిస్థితి కత్తిమీద సామే.
ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత్ చేపట్టిన పలు ప్రాజెక్టులకు అవాంతరాలు ఎదురయ్యే ప్రమాదముంది. ఒకవేళ ఆ ప్రాజెక్టులు మూలన పడితే వాణిజ్య, రవాణా రంగాలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి రావచ్చు. గతేడాది ఢిల్లీలో జీ20 సదస్సు జరిగంది. ఇందులో ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ పై సంతకాలు జరిగాయి. భారత్, అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, యూరోపియన్ యూనియన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు. భారీ రవాణా నెట్ వర్క్ నెలకొల్పడం ఈ కారిడార్ ఉద్దేశం. ఇది పూర్తయితే భారత్ ఉత్పత్తులు యూఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, గ్రీస్ మీదుగా యూరప్‌కు సులభంగా చేరుకుంటాయి. ఒకవేళ యుద్ధం జరిగితే ఈ కారిడార్ మూలన పడొచ్చు. ఇక ఇరాన్ లోని చాబహార్ పోర్టు భారత్ కు కీలకంగా ఉంది. దీన్ని అభివృద్ధి చేసేందుకు 2015లో రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని వల్ల అఫ్గనిస్తాన్, మధ్య ఆసియాతో వాణిజ్యం కోసం పాకిస్తాన్ గుండా వెళ్ళాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇజ్రాయెల్ తో యుద్ధం వస్తే ఈ ప్రాజెక్టు కూడా పూర్తికాకపోవచ్చు.
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల మన దేశ విదేశీ మారక నిల్వలపై తీవ్ర ప్రభావం పడడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు లక్షలాది మంది ఉపాధి, ఉద్యోగావకాశాలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
మన దేశానికి చెందిన లక్షలాది మంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ లో కూడా భారతీయుల సంఖ్య ఎక్కువే. వీళ్లంతా తమ సంపాదనను భారత్ కు పంపిస్తున్నారు. మన రూపాయితో పోల్చితే గల్ఫ్ కరెన్సీ విలువ ఎక్కువ. దీంతో మనవాళ్లు ఆర్థికంగా లబ్ది పొందుతున్నారు. లక్షల డాలర్లను మన దేశానికి తరలిస్తున్నారు. దీని వల్ల మన దేశ విదేశీ మారకపు నిల్వలు బలంగా ఉంటున్నాయి. ఒకవేళ యుద్ధం మొదలైతే ఆయా దేశాల్లో ఉన్న భారతీయులు ఇంటిముఖం పట్టాల్సి రావచ్చు. అదే జరిగితే దాని ప్రభావం నేరుగా విదేశీ మారక నిల్వలపై పడుతుంది. అంతేకాదు.. లక్షలాదిమందిని క్షేమంగా స్వదేశం తీసుకురావడం కూడా మన ప్రభుత్వానికి కత్తి మీద సామే.
బటర్ ఫ్లై ఎఫెక్ట్ గురించి మనందరికీ తెలుసు కదా.. ఎక్కడో జరిగే ఓ సంఘటన మరెక్కడో ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కూడా అంతే. ఆ రెండు దేశాల మధ్య పోరు ప్రపంచంలోని పలు దేశాలపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావం చూపించడం ఖాయం. ఇందుకు మన దేశం అతీతం కాదు. అయితే ఆ నష్టం ఎంత తక్కువ చేయగలిగితే అంత సక్సెస్ అయినట్టు లెక్క.