Site icon NTV Telugu

‘ఈ శరీరం నాదే కానీ ఇందులో నేను లేను..’ ఇండియాలో ట్రాన్స్‌జెండర్ల సర్జరీల వెనుక నమ్మలేని నిజాలు

Gender Affirming Surgeries

Gender Affirming Surgeries

Gender-affirming surgeries:వారిపై జోకులు పేలుస్తారు. సినిమాల్లో, కామెడీ షోల్లో వారిని అవమానించడమే పెద్ద జోకు! ఎవర్ని అయినా తిట్టాలంటే వారినే వాడుకుంటారు. ఇంకెవర్ని అయినా చిన్నచూపు చూడాలంటే వాళ్లని ఉదాహరణగా చూపించే అలవాటు ఈ సమాజానికి కొత్తమీ కాదు. ఒక మనిషిని అవమానించడానికి ట్రాన్స్‌జెండర్లనే ఆయుధంగా మార్చేసే సమాజం.. ఈ ప్రపంచంలో కేవలం రెండే లింగాలు ఉన్నాయనే అజ్ఞానంలో బతుకుతుంటుంది. ఇదే బయాలజీ అని భ్రమపడుతుంటుంది. కానీ రియాల్టీ వేరు.

మనిషి శరీరం ఒకటైతే..మనసు మరో కథ చెబుతుంది. క్రోమోసోమ్స్ ఒక దారి చూపిస్తే.. గుర్తింపు మరో దారిలో నడుస్తుంది. ఇంట్లో అర్థం చేసుకోరు.. బయట అంగీకరించరు.. ఉద్యోగం ఇవ్వరు.. చివరికి బ్రతకడానికి స్థలం కూడా ఇవ్వరు..! అయినా ఇండియాలో సర్జరీల ద్వారా, థెరపీల ద్వారా జెండర్‌ను మార్చుకుంటూ బతుకుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. క్రికెటర్‌ సంజయ్ బంగార్‌ కుమారుడు.. 24ఏళ్ల ఆర్యన్‌ బంగార్‌ హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీతో పాటు సర్జరీ చేయించుకుని ఒక ట్రాన్స్‌విమెన్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించిన తర్వాత ఈ అంశం మరోసారి చర్చకు దారితీసింది. ఇంతకీ ఒక మనిషి అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా జీవించాలనుకోవడం లేదా అమ్మాయిగా పుట్టి అబ్బాయిగా మారాలనుకోవడాన్ని సైన్స్ ఎలా చూస్తుంది? మెడికల్‌ సైన్స్‌ చెబుతున్న నిజాలేంటి? ఈ ట్రాన్సిషన్స్‌ చుట్టూ ఉన్న అపోహలేంటి?

ఈ శరీరం నాదే కానీ ఇందులో నేను లేను అనిపించే క్షణాలు ఎంత బరువుగా, ఎంత భారంగా ఉంటాయో అది అనుభవించిన వారికే తెలుస్తుంది. మనిషి తనను తాను అర్థం చేసుకునే ప్రయత్నం
లోపల నుంచే మొదలవుతుంది. చాలా మందికి చిన్నప్పటినుంచే ఒక అసౌకర్యం ఉంటుంది.
తమ శరీరం తమకు సరిపోవడం లేదనే భావన ఉంటుంది.

ఫిజికల్‌గా అబ్బాయిలా కనిపించినా అమ్మాయిలా బతకాలనే ఆలోచన ఉంటుంది. వయసు పెరిగినా ఆ ఆలోచన అలానే కంటిన్యూ అవుతుంది. కాస్త ఏజ్ వచ్చిన తర్వాత ఇది మరింత స్పష్టంగా మారుతుంది. మెడికల్ సైన్స్ దీన్ని స్పష్టంగా వివరిస్తుంది. జెండర్ ఐడెంటిటీ అనేది మనిషి తనను తాను ఎలా గుర్తించుకుంటాడో చెప్పే ఆలోచన. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇది మానసిక వ్యాధి కాదు. అయితే శరీరం, గుర్తింపు మధ్య గ్యాప్‌ ఎక్కువ ఉండడం వల్ల కలిగే బాధను జెండర్ డిస్ఫోరియా అని పిలుస్తారు. ఈ పరిస్థితిలో ఉన్నవారు తమ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. దీన్నే ట్రాన్సిషన్ అంటారు. ఈ ట్రాన్సిషన్ మూడు దశల్లో జరుగుతుంది. మొదటిది తమని తాము అంగీకరించుకోవడం. రెండోది సమాజంలో తమ గుర్తింపుతో జీవించడం. అంటే పేరు మార్చుకోవడం, నచ్చిన దుస్తులు వేసుకోవడం. ఇక మూడోది మెడికల్ దశ. ఇక్కడే చాలా మందికి సందేహాలు మొదలవుతాయి.

హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ అంటే ఏంటి? జెండర్ ఛేంజ్ సర్జరీ అంటే ఏంటి? ఇవి రెండూ ఒకటేనా అనే డౌట్ ఉంది. నిజానికి ఏ చికిత్స తీసుకోవాలన్నా ముందుగా మెడికల్‌ టెస్టులు పాస్‌ అవ్వాల్సిందే. డాక్టర్‌ చెప్పిందే ఫైనల్ అవుతుంది. హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ అంటే శరీరంలో ఉన్న హార్మోన్ల స్థాయిని మార్చడమని అర్థం.

అబ్బాయిగా పుట్టిన వ్యక్తి ఈస్ట్రోజెన్ తీసుకుంటే శరీరంలో స్త్రీ లక్షణాలు మెల్లగా అభివృద్ధి చెందుతాయి. అమ్మాయిగా పుట్టిన వ్యక్తి టెస్టోస్టెరోన్ తీసుకుంటే పురుష లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. ఈ మార్పులు ఒక్కరోజులో రావు. నెలలు పడుతుంది. కొన్నిసార్లు సంవత్సరాలు పడుతుంది. ముందుగా బాడీ ఫ్యాట్ మారుతుంది. జుట్టు పెరుగుదల మారుతుంది. ఇది పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే హార్మోన్ థెరపీ తీసుకున్నవారిలో చాలా మంది ఆ దిశలోనే ఆగిపోతారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనల ప్రకారం సుమారు 50 నుంచి 70 శాతం మంది ట్రాన్స్ వ్యక్తులు హార్మోన్ థెరపీనే ఎంచుకుంటారు. సర్జరీకి వెళ్లేవారు చాలా తక్కువ. సుమారు 10 నుంచి 30 శాతం మంది మాత్రమే జెండర్ అఫర్మింగ్ సర్జరీ చేయించుకుంటారు. అందులో ఇది చాలా ఖరీదైన ప్రక్రియ. ఇండియాలో సుమారు 10లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. అలాగే ఇది శాశ్వత మార్పు.. తిరిగి మార్చలేని నిర్ణయం!

అందుకే సర్జరీకి ముందు నెలల తరబడి కౌన్సిలింగ్ జరుగుతుంది. వైద్యుల టీమ్ ఉంటుంది. సైకాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్, సర్జన్ కలిసికట్టుగా పనిచేస్తారు. జెండర్‌ ఛేంజ్‌ సర్జరీకి వ్యక్తి సిద్ధంగా ఉన్నాడా? మనసు స్థిరంగా ఉందా అన్నదాన్ని అంచనా వేస్తారు. సర్జరీలు కూడా ఒక్కటే ఉండవు. చెస్ట్ సర్జరీలు, జననేంద్రియాలకు సంబంధించిన సర్జరీలు ఉంటాయి. ప్రతి ఒక్కరి అవసరం వేరేలా ఉంటుంది. ఇక్కడే చాలా పెద్ద అపోహలు ఉన్నాయి. ట్రాన్స్‌గా కనపడే వారందరూ సర్జరీ చేయించుకుంటారు అనుకోవడం తప్పు. కొంతమంది హార్మోన్‌ రీప్లేస్‌మెంట్ థెరపీతోనే ఆగిపోతారు.

2011 జనగణన ప్రకారం ఇండియాలో సుమారు 5లక్షల మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో పెద్ద నగరాల్లో ప్రత్యేక క్లినిక్స్ పెరిగాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌ లాంటి నగరాల్లో మెడికల్ సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.

ఇటు చిన్న పట్టణాల్లో పరిస్థితి మాత్రం గతంలో లాగే ఉంది. నిజానికి ఇక్కడ అసలు కష్టం శరీర మార్పు కాదు.. మనుషుల చూపులు, ఒంటరితనం, అర్థం చేసుకోని మాటలు, సంబంధాలు కోల్పోయే భయం..! ప్రపంచవ్యాప్తంగా కూడా ట్రాన్స్‌జెండర్లలో డిప్రెషన్ రేట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే కుటుంబ మద్దతు ఉన్నవారిలో మాత్రం మానసిక సమస్యలు లేవని అధ్యయనాలు చెబుతున్నాయి.

చివరగా ఇదంతా శరీరం గురించి మాత్రమే కాదండి.. మనసు చెప్పే నిజాన్ని వినిపించుకునే ధైర్యం గురించి కూడా..! ఎందుకంటే ప్రపంచం ఎంత ఆలస్యంగా అర్థం చేసుకున్నా, అసలు అర్థం చేసుకోకపోయినా ఒక వ్యక్తి తనను తాను అంగీకరించుకున్న ఆ క్షణమే నిజమైన స్వేచ్ఛ వచ్చినట్టు!

Exit mobile version