సెలవుల సమయంలో చాలా మంది ఏం కోరుకుంటారు? మంచి రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, రుచికరమైన భోజనం, ప్రశాంతమైన వాతావరణం. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. ఇందులో విశ్రాంతి కాదు… భయం కావాలి. కన్‌ఫర్ట్ కాదు… ఛాలెంజ్ కావాలి. రిలాక్సేషన్ కాదు… అడ్రినలిన్ రష్ కావాలి. ఈ కొత్త ట్రావెల్ ట్రెండ్ పేరు డేర్ కేషన్.
డేర్ అంటే సాహసం. వెకేషన్ అంటే సెలవులు. ఈ రెండు కలిస్తే డేర్ కేషన్. అంటే భయాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ప్లాన్ చేసుకునే సెలవు ప్రయాణం. ఒకప్పుడు హాలిడే అంటే ఒత్తిడిని మర్చిపోవడం కోసం వెళ్లేవారు. ఇప్పుడు చాలా మంది తమ భయాలను జయించడానికి ప్రయాణాలు చేస్తున్నారు.
డేర్‌కేషన్ ట్రెండ్ ఎలా పెరుగుతోంది?
ఒక్కసారి ఊహించండి. లడాఖ్‌లో మైనస్ 25 డిగ్రీల చలిలో పూర్తిగా గడ్డకట్టిన నదిపై నడవడం. చీకటితో నిండిపోయిన గుహల్లోకి దిగిపోవడం. ఉద్ధృతంగా ప్రవహించే నదిలో రాఫ్టింగ్ చేయడం. వందల అడుగుల ఎత్తు నుంచి బంగీ జంప్ చేయడం.. ఇవన్నీ ప్రమాదకరంగా అనిపించినా ఇప్పుడు లక్షలాది మంది ఇలాంటి అనుభవాల కోసం డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఇంతకీ అసలు ఈ ట్రెండ్ ఎందుకు పెరుగుతోంది? దీనికి సమాధానం కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచంలో వచ్చిన మార్పుల్లో ఉంది.
కరోనా సమయంలో నెలల తరబడి ఇళ్లకే పరిమితమైన ప్రజలు జీవితాన్ని కొత్త కోణంలో చూడటం ప్రారంభించారు. ప్రతిరోజూ ఒకే రకమైన జీవితంలో తాము ఎంత మెకానికల్‌గా మారిపోయామో చాలామందికి అర్థమైంది. అందుకే సాధారణ సెలవులు కాకుండా జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాలను వెతకడం మొదలుపెట్టారు. ఇక్కడ సోషల్ మీడియా కూడా కీలక పాత్ర పోషించింది.
డేర్‌కేషన్‌ను సోషల్‌మీడియా ఎలా ప్రమోట్ చేస్తోంది?
ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో భారీ కొండలపై ట్రెక్కింగ్ చేస్తున్న వీడియోలు, లోతైన లోయల్లో బంగీ జంపింగ్ చేస్తున్న రీల్స్, మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో క్యాంపింగ్ చేస్తున్న ఫోటోలు వైరల్ కావడం ప్రారంభమైంది. ఇవి చూసిన వాళ్లలో కూడా అలాంటి అనుభవాలు పొందాలనే ఆసక్తి పెరిగింది. దీంతో డేర్ కేషన్ ఒక గ్లోబల్ ట్రావెల్ ట్రెండ్‌గా మారిపోయింది. అయితే ఇది కేవలం సోషల్ మీడియా కోసం చేసే స్టంట్ మాత్రమే కాదు. దీని వెనుక సైన్స్ కూడా ఉంది. సైకాలజిస్టులు దీన్ని యూస్ట్రెస్ అని పిలుస్తారు. సాధారణంగా ఒత్తిడి అంటే మనకు నెగటివ్ భావన ఉంటుంది. కానీ యూస్ట్రెస్ అనేది పాజిటివ్ స్ట్రెస్. ఇది మన మెదడును మరింత అప్రమత్తంగా ఉంచుతుంది. ఏకాగ్రతను పెంచుతుంది. ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది.
మనిషి మెదడు భయాన్ని కలిగించిన ఘటనలను చాలా కాలం గుర్తుంచుకుంటుంది. అందుకే సాధారణ హోటల్ గదిలో గడిపిన రెండు రోజులు మర్చిపోవచ్చు కానీ జీవితంలో మొదటిసారి వంద అడుగుల ఎత్తు నుంచి జంప్ చేసిన అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేం.
అందుకే కొంతమంది థెరపిస్టులు కూడా ఈ తరహా సాహస అనుభవాలను యాంగ్జైటీ తగ్గించడానికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడానికి ఉపయోగపడతాయంటున్నారు. ఇక భారత్ విషయానికి వస్తే డేర్ కేషన్ ప్రేమికులకు ఇండియా ఒక స్వర్గం లాంటిది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యమైన భౌగోళిక ప్రాంతాలు భారత్‌లో ఉన్నాయి. లడాఖ్‌లోని జాన్స్‌కార్ వ్యాలీ అందులో ఒకటి. ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో జాన్స్‌కార్ నది పూర్తిగా గడ్డకడుతుంది. ఈ గడ్డకట్టిన నదిపై జరిగే చాదర్ ట్రెక్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ట్రెక్కింగ్ అనుభవాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. మైనస్ 25డిగ్రీల వరకు పడిపోయే ఉష్ణోగ్రతల్లో మంచుపై నడవడానికి శారీరక ధైర్యంతో పాటు మానసిక దృఢత్వం కూడా అవసరం.
మరోవైపు మేఘాలయలోని చెర్రాపుంజీ కూడా డేర్ కేషన్ ప్రియులను ఆకర్షిస్తోంది. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో భారీ లోయలు, సహజ వేర్లతో ఏర్పడిన బ్రిడ్జిలు, అంతులేని గుహ వ్యవస్థలు ఉన్నాయి.
ముఖ్యంగా క్రెమ్ లియాట్ ప్రా గుహ ఆసియాలోనే అత్యంత పొడవైన గుహలలో ఒకటి. ఇందులోకి ప్రవేశించిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా చీకటి మాత్రమే కనిపిస్తుంది. అలాంటి వాతావరణంలో ముందుకు సాగడం నిజమైన డేర్ టెస్ట్‌గా చెప్పవచ్చు. ఇక రిషికేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గంగా నదిలో జరిగే గ్రేడ్ ఫోర్, గ్రేడ్ ఫైవ్ స్థాయి వైట్ వాటర్ రాఫ్టింగ్ ప్రపంచవ్యాప్తంగా అడ్వెంచర్ ప్రేమికులను ఆకర్షిస్తోంది. అంతేకాకుండా నీర్ ఘర్ ప్రాంతంలో క్లిఫ్ జంపింగ్, లోతైన లోయలపై బంగీ జంపింగ్ వంటి అనుభవాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అందుకే రిషికేశ్‌ను భారత్‌లోని అడ్వెంచర్ క్యాపిటల్‌గా చాలామంది పిలుస్తున్నారు. అయితే డేర్ కేషన్ అందరికీ సరిపోతుందా అంటే కాదు. భద్రతా ప్రమాణాలు పాటించే సంస్థలను ఎంచుకోవడం, సరైన శిక్షణ పొందడం, ఆరోగ్య పరిస్థితిని ముందుగా అంచనా వేయడం చాలా ముఖ్యం.
ఎందుకంటే ధైర్యం, నిర్లక్ష్యం మధ్య చాలా చిన్న గీత మాత్రమే ఉంటుంది. అయినా ఒక విషయం మాత్రం నిజం. నేటి తరం సెలవుల్లో కేవలం విశ్రాంతి మాత్రమే కాదు, జీవితాన్ని కొత్తగా అనుభవించాలని కోరుకుంటోంది. అందుకే భయాన్ని తప్పించుకోవడం కాకుండా దానిని ఎదుర్కొనే ప్రయాణాల వైపు అడుగులు వేస్తోంది. బహుశా అందుకేనేమో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు డేర్ కేషన్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

