China Robot: చైనా రోబోలు.. భారత్‌కు పొంచి ఉన్న ముప్పు..! డ్రాగన్ టార్గెట్‌ అదేనా?

China Commercial Robots (1)

China Commercial Robots (1)

చైనా నుంచి ప్రపంచానికి మరో భారీ షాక్ తగలనుంది. ఒకప్పుడు చవకైన ఎలక్ట్రానిక్ వస్తువులతో ప్రపంచ మార్కెట్లను ముంచెత్తిన డ్రాగన్ దేశం.. ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకొస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు.. సోలార్ ప్యానెల్స్ తరహాలోనే.. హ్యూమనాయిడ్ రోబోల తయారీలో గుత్తాధిపత్యం సాధించేందుకు చైనా వేగంగా అడుగులు వేస్తోంది. దీన్ని యావత్ ప్రపంచం ‘ది నెక్ట్స్ చైనా షాక్‌’గా చూస్తోంది. ఇంతకీ చైనాలో రోబోటిక్స్ విప్లవానికి కారణాలేంటి…?? దీనివల్ల యూరప్.. భారత్ లాంటి దేశాలకు పొంచి ఉన్న ప్రమాదం ఏంటి?

హ్యూమనాయిడ్‌ రోబోలు..ప్రపంచానికి సవాల్:

బీజింగ్ శివార్లలోని లింగీ ఐటెక్ ఫ్యాక్టరీలో పదుల సంఖ్యలో హ్యూమనాయిడ్ రోబోలు వరుసగా నిలబడి క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఇక్కడ సర్క్యూట్ బోర్డులకు స్క్రూలు బిగించడం నుంచి చురుకుగా కదలడం వరకు ఈ రోబోలు ఎన్నో పనులు చేస్తున్నాయి. మూడు దశాబ్దాలుగా చైనా సప్లై చైన్‌లో లింగీ కీలక పాత్ర పోషించింది. ఐఫోన్లు.. ల్యాప్‌టాప్‌లకు విడిభాగాలు అందించే స్థాయి నుంచి ఏకంగా అధునాతన రోబోల తయారీ దిశగా ఈ కంపెనీ ప్రయాణం సాగుతోంది. చైనా ప్రపంచానికి విసురుతున్న అతిపెద్ద సవాల్‌గా దీన్ని చూడొచ్చు. మొదట చవకైన ఎలక్ట్రానిక్స్ ప్రపంచాన్ని కమ్మేశాయి. ఆ తర్వాత ప్రభుత్వ అండతో ఎలక్ట్రిక్ వాహనాలు.. సోలార్ ప్యానెల్స్ పాశ్చాత్య దేశాల మార్కెట్లను శాసించాయి. ఇప్పుడు రోబోల వంతు వచ్చింది.

ఈ రోబోల తయారీలో చైనా లక్ష్యాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. వచ్చే ఏడాది లోపు 20 వేల రోబోలను ఉత్పత్తి చేయాలని లింగీ కంపెనీ భావిస్తోంది. 2028 నాటికి లక్ష… 2030 నాటికి 5 లక్షల రోబోలు తయారు చేయగల సామర్థ్యాన్ని ఈ కంపెనీ పెంచుకోనుంది. చైనాలో ఇలాంటివి ఐదు ఫెసిలిటీస్ ఉన్నాయి. 2030 నాటికి ఏటా 20 లక్షల రోబోలను ఉత్పత్తి చేయాలన్నది వారి టార్గెట్. చైనాలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతుండటం, యువత కొరత ఉండటంతో భవిష్యత్తులో ఈ హ్యూమనాయిడ్ రోబోలకు భారీ డిమాండ్ ఉంటుందని అంచనా. తయారీ రంగం.. ప్రమాదకరమైన పారిశ్రామిక పనులు.. హెల్త్‌కేర్ విభాగాల్లో వీటిని విస్తృతంగా వినియోగించనున్నారు.

×
×
Ad

చైనా సాధిస్తున్న ఈ సాంకేతిక పురోగతి ప్రపంచ దేశాలకు సవాలుగా మారుతోంది. ముఖ్యంగా యూరప్ దేశాలు చైనా అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్ దెబ్బకు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఈవీలు.. సోలార్ ప్యానెల్స్ విషయంలో ఇప్పటికే యూరప్ సంస్థలు చైనా కంపెనీలతో పోటీ పడలేక చతికిలపడ్డాయి. ఇప్పుడు రోబోటిక్స్ రంగంలోనూ చైనా గుత్తాధిపత్యం సాధిస్తే తమ పరిశ్రమలు దెబ్బతింటాయని భయపడుతున్నాయి. చైనా రోబోలకు అడ్డుకట్ట వేస్తే ఫ్యూచరిస్టిక్ పరిశ్రమలకు అవసరమైన టెక్నాలజీని అందిపుచ్చుకోలేమనే డైలమా ఆ దేశాలను వేధిస్తోంది.

చైనా నుంచి ఇండియాకు భారీగా దిగుమతులు:

భారత్ విషయానికి వస్తే పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంది. గత పదేళ్లలో చైనా నుంచి దిగుమతులు భారీగా పెరిగాయి. కేవలం సెల్ ఫోన్లు.. బొమ్మలే కాదు.. అడ్వాన్స్‌డ్ మెషీనరీ.. ఎలక్ట్రానిక్స్.. సోలార్ ప్యానెల్స్.. లిథియం బ్యాటరీలు లాంటివి పెద్ద ఎత్తున చైనా నుంచి ఇండియాకు వస్తున్నాయి. 2025 నాటికి ఈ దిగుమతులు రికార్డు స్థాయిలో 130 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా. రెండు దేశాల మధ్య వాణిజ్యం 155 బిలియన్ డాలర్లు ఉంటే అందులో భారత్ వాటా నామమాత్రమే. చైనా మొత్తం వాణిజ్యంలో ఇండియా కేవలం 3 శాతం మాత్రమే తీసుకుంటోంది. కానీ చైనా మొత్తం మిగులు వాణిజ్యంలో 10 శాతం భారత్ నుంచే వస్తోంది.

చైనా కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడానికి 2014లో మేక్ ఇన్ ఇండియా కింద పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి. గుజరాత్, మహారాష్ట్రల్లో ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయాలని భావించారు. అయితే సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా 2020లో పెట్టుబడుల విధానాన్ని భారత్ కఠినతరం చేసింది. సరిహద్దు పంచుకుంటున్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేశారు. దీంతో చైనా పెట్టుబడులు ఆగిపోయాయి. మళ్ళీ ఇటీవలే మార్చి 10న క్యాబినెట్ ఈ నిబంధనల్లో కాస్త సడలింపులు ఇచ్చింది. ఆటోమెటిక్ రూట్ కింద క్యాపిటల్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్ తయారీలో 10 శాతం వరకు పెట్టుబడులకు అనుమతి ఇచ్చారు.

జాయింట్ వెంచర్ల ద్వారా చైనా కంపెనీలను ఇండియాకు రప్పించి వారి నుంచి టెక్నాలజీని పొందాలన్నది భారత్ సరికొత్త వ్యూహంగా కనిపిస్తోంది. తద్వారా గ్లోబల్ సప్లై చైన్‌లో భాగం కావాలని ఇండియా ఆశిస్తోంది. కానీ కీలక రంగాలకు చెందిన టెక్నాలజీని ఇతర దేశాలకు ఇవ్వడానికి చైనా అంగీకరించడం లేదు. బ్యాటరీలు, రోబోటిక్స్ టెక్నాలజీ చైనాకే పరిమితం కావాలనేది వారి ఉద్దేశం. ఈవీ టెక్నాలజీని టాటా మోటార్స్‌కు బదిలీ చేస్తారనే వార్తలను చైనా ఆటోమేకర్-చెరి తీవ్రంగా ఖండించడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. టెక్నాలజీ పంచుకోవడం వల్ల భారత్ బలపడితే.. భవిష్యత్తులో తమకే నష్టమని చైనా బలంగా నమ్ముతోంది.

:ఫణి కుమార్ (NTV DIGITAL)