18 ఏళ్ల వయసులో ఆమెను అపహరించారు. బహిరంగంగా లైంగిక హింసకు గురిచేశారు. ఆమె శరీరం విరిగిపోయింది. మనసు చీలిపోయింది. న్యాయం కోసం రెండు సంవత్సరాలు ఎదురుచూసింది.
FIR ఉంది.. కేసు ఉంది. కానీ నిందితుడే లేడు. అసలు ఈ కేసులో ఒక్క అరెస్టు కూడా లేదు.. విచారణ జరగనే లేదు. న్యాయం కోసం ఎదురుచూసిన ఆ యువతి చివరకు ప్రాణాలతో పోరాడుతూ 20ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచింది. ఈ రెండున్నరేళ్లు ఆమె శరీరం నరకాన్ని అనుభవించింది. ఓ ట్రోమాలోనే బతుకీడ్చింది. వైద్య చికిత్సలు సాగినా ఉపయోగం లేకుండాపోయింది. మణిపూర్‌లో జరిగిన ఈ ఘటన గురించి పెద్దగా చర్చ జరగలేదు. అమ్నెస్టీ ఇంటర్నెషనల్ లాంటి మానవహక్కుల సంస్థలు దీనిపై ఎంతో విచారం వ్యక్తం చేశాయి. మణిపూర్‌లో యువతిపై జరిగిన ఈ హింస కేవలం ఒక్క ఘటన మాత్రమే కాదు.. ఇలాంటివి ఎన్నో జరిగాయి.. ఇంకెన్నో జరుగుతున్నాయి.
ఓ వర్గంలో భయాన్ని నాటడానికి స్త్రీ శరీరాన్ని యుద్ధభూమిగా మార్చే విధానమిది. ఇంతకీ మణిపూర్‌లో మహిళల శరీరాలు ఎందుకు అస్త్రంగా మారాయి?
మణిపూర్‌లో జరుగుతున్న ఈ లైంగిక హింస ఒక్క వ్యక్తిగత నేరం కాదు. ఇది ఒక పద్ధతి. ఒక ఆయుధం. కొన్ని వర్గాలను మానసికంగా కూల్చేయడానికి ఎంచుకున్న అత్యంత క్రూరమైన మార్గం. 2023 మే నుంచి మొదలైన ఈ ఘర్షణల్లో మహిళలపై జరిగిన దాడులు కోఇన్సిడెన్స్‌గా జరగలేదు. ఇళ్ల నుంచి లాగివెయ్యడం, గుంపులుగా అ*త్యాచారం చేయడం, నగ్నంగా ఊరేగించడం, వీడియోలు తీసి భయపెట్టడం లాంటి ఎన్నో ఘనలు ఒకే ఉద్దేశంతో జరిగాయి. అదే భయాన్ని నాటడం..! అవమానాన్ని ఆయుధంగా మార్చడంతో పాటు ఒక వర్గం మొత్తాన్ని తలవంచేలా చేయడం! కుకి-జో మహిళలు ఈ హింసకు ప్రధాన లక్ష్యంగా మారారు. వారు ఏ నేరం చేయలేదు. ఆయుధాలు పట్టలేదు. కానీ వారి శరీరాల మీద ప్రతీకారం తీర్చుకున్నారు. ఎందుకంటే ఘర్షణల్లో స్త్రీ శరీరం ఎప్పుడూ ఆయుధంగానే కనపిస్తున్న చరిత్ర మనది. ఆమెను నలిపితే కుటుంబం నలుగుతుంది. కుటుంబం నలిగితే వర్గం మొత్తం నలుగుతుంది. ఇదే ఈ హింస వెనుక ఉన్న క్రూరమైన మైండ్‌సెట్.
ఈ యువతి కేసులో ప్రతీది స్పష్టంగా ఉంది. అపహరణ జరిగింది. వైద్య చికిత్స జరిగింది. FIR నమోదైంది. కానీ అక్కడే వ్యవస్థ ఆగిపోయింది. రెండున్నరేళ్లలో ఒక్క అరెస్ట్ లేదు. ఒక్క నిందితుడి పేరు బయటకు రాలేదు. విచారణ ముందుకు కదలలేదు. ఈ మౌనమే అసలు నేరం.
న్యాయం ఆలస్యం కావడం మాత్రమే కాదు.. న్యాయం లేకపోవడమే ఆమెను మానసికంగా చంపింది. ఆమె మరణానికి తక్షణ కారణం ఏదైనా కావచ్చు. కానీ ప్రధాన కారణం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. శారీరక గాయాలు, లోపల పెరిగిన ఇన్ఫెక్షన్లు, ఎప్పుడూ వెంటాడిన ట్రోమా, భద్రతలేని జీవితం ఆమె ప్రాణాలను మెల్లిగా తీసేశాయి. ఇటు మణిపూర్‌లో ఇప్పటివరకు 260 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది శరణార్థులయ్యారు. కానీ మహిళలపై జరిగిన లైంగిక హింసకు సంబంధించి న్యాయ ప్రక్రియ దాదాపు నిలిచిపోయింది.
బాధితుల గొంతు వినిపించకుండా పోయింది. భయంతో చాలామంది ముందుకు రావడం లేదు. ముందుకు వచ్చిన ఈ యువతి లాంటి వాళ్లకే న్యాయం దక్కకపోతే.. మిగిలినవాళ్ల పరిస్థితి ఏంటి?
ALSO READ: పిల్లలకు భరించలేని హింస.. పేరెంట్స్, టీచర్ల దెబ్బకు టీనేజ్‌లోనే మెంటల్ టార్చర్!
