NTV Telugu Site icon

Zoom Layoffs: ఇక జూమ్ వంతు.. 13వందలమందికి ఉద్వాసన

Zooom 1

Zooom 1

ఐటీలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు ఊడతాయో, ఎవరి జీతాల్లో కోత పడుతుందో తెలీని దుస్థితి ఏర్పడింది. ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోందన్న వార్తలతో కంపెనీలు ముందు జాగ్రత్త పడుతున్నాయి. ఖర్చులు పెరుగుతున్నాయి. ఆదాయం పడిపోతోంది. అందుకే జీతాలు తగ్గించడం, లేదంటే ఉద్యోగుల్ని తగ్గించడం చేస్తున్నాయి. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలీక ఉద్యోగులు వణికిపోతున్నారు. ఉద్యోగం ఎప్పటివరకు ఉంటుందో, ఎప్పుడు ఊడుతుందోనని తెగ హైరానా పడుతున్నారు.

ప్రస్తుతం ఆ భయాలు అలానే ఉన్నాయి మరి. దిగ్గజ కంపెనీలు కూడా తామేం తక్కువ అన్నట్టుగా పెద్ద ఎత్తున ఉద్యోగులను తగ్గించేస్తున్నాయి. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకోవడానికి అంటూ కంపెనీలు పింక్ స్లిప్ లు జారీచేస్తున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటికే టెక్, ఐటీ రంగంలో లేఆఫ్స్ ఎలా ఉన్నాయో చూశాం. ఇటీవల అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, గూగుల్, మెటా వంటి కంపెనీలు కూడా వేలల్లో ఉద్యోగుల్ని ఇంటికి పంపించాయి. తర్వాత దేశీయంగా ఐటీ సంస్థలు విప్రో, ఇన్ఫోసిస్ వంటివి కూడా పెర్ఫామెన్స్ సరిగా లేదన్న కారణంతో వేలాదిమందికి సెండాఫ్ చెప్పేశాయి. ఇప్పుడు జూమ్ సంస్థ వంతు వచ్చింది.

Read Also: Golden Gavel Award: అమెరికాలో తెలుగు వాడి సత్తా..పిట్ట కొంచెం కూత ఘనం

ఈ లేఆఫ్స్ కంపెనీల జాబితాలో జూమ్ చేరింది. తన వర్క్‌ఫోర్స్‌లో 15 శాతం లేదా 1300 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ ఎరిక్ యువాన్ మంగళవారం ఒక బ్లాగ్ పోస్ట్ చేశారు. కరోనా సమయంలో ఇంటి దగ్గర నుంచి పనిచేసేవారు ఎక్కువైన నేపథ్యంలో.. డిమాండ్‌కు తగ్గట్లుగా ఎక్కువ మందిని నియమించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వారిని పంపించక తప్పట్లేదని ఆయన వివరణ ఇచ్చారు.

డిమాండ్‌ను అందుకోవడానికి 24 నెలల వ్యవధిలో ఉద్యోగుల్ని 3 రెట్లు ఎక్కువగా నియమించుకుంది జూమ్. సీఈఓ ఎరిక్ కంపెనీ ఖర్చును తగ్గించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తన వేతనంలో ఏకంగా 98 శాతం కోత విధించుకున్నట్లు సంచలన నిర్ణయం ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితికి జవాబుదారీగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, 2023లో కార్పొరేట్ బోనస్‌ను కూడా వదులుకుంటున్నట్లు వెల్లడించారు. ఇంకా ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్స్ టీమ్ కూడా తమ కనీస వేతనాలను 20 శాతం మేర తగ్గించుకుంటున్నాయని అన్నారు. ఇక ఉద్యోగం కోల్పోయిన వారు యూఎస్‌లో ఉన్నట్లయితే వారికి 16 వారాల వేతనం, హెల్త్‌కేర్ కవరేజీ, యాన్యువల్ బోనస్ అందుతాయని ఆయన అన్నారు.

Read Also: Revanth Reddy: ప్రగతిభవన్‌పై రేవంత్‌ కామెంట్స్.. బీఆర్‌ఎస్‌ నేతలు సీరియస్‌