అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. కొయ్యురు మండలంకు చెందిన వైసీపీ జెడ్పీటీసీ వారా నూకరాజు దారుణ హత్యకు గురయ్యాడు. భూతగాదాలే నూకరాజు హత్యకు కారణమని పోలీసులు చెప్పారు. ఈరోజు భూమి విషయంలో గిరిజనులకు, ఆయనకు మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం.. చివరకు హత్యకు దారితీసింది. సమాచారం అందుకున్న రోలుగుంట పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. నూకరాజు హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రోలుగుంట మండలం చటర్జీపురం వద్ద జడ్పిటిసి జెడ్పీటీసీ వారా నూకరాజుకు పది ఎకరాల పొలం ఉంది. భూమికి సంబంధించిన పట్టా ఆయన పేరు మీదే ఉంది. ఆ భూమిని గిరిజనులు సాగు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ భూమి విషయం మీద గిరిజనులకు, ఆయనకు గొడవలు జరుగుతున్నాయి. గతంలో నూకరాజు మీద గిరిజనులు దాడి చేశారు. ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో దాదాపు నెల రోజుల పాటు చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు.
Also Read: AUS vs IND: ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. నితీశ్ రెడ్డిపై వేటు!
ఈ గొడవల నేపథ్యంలో బైండోవర్ కేసులు కూడా పోలీసులు నమోదు చేశారు. ఈ రోజు ఉదయం జెడ్పీటీసీ వారా నూకరాజు తన భూముల దగ్గరికి వెళ్లారు. గిరిజనులకు, ఆయనకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటమాట పెరిగి గొడవపడ్డారు. ఈ గొడవలో ప్రత్యర్థులు నూకరాజును హత్య చేశారు. సమాచారం అందుకున్న రోలుగుంట పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు.
