YS Vijayamma: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహారం సంచలనం సృష్టించింది. వీఐపీ రాహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెపై కేసు నమోదైంది. ఆరోపణలతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 333, 353,337 సెక్షన్ల కింద షర్మిలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. కుమార్తె వైఎస్ షర్మిల అరెస్ట్ నేపథ్యంలో ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు బయల్దేరిన వైఎస్ విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ విజయమ్మను ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు రానీయకుండా ఇంటి వద్దే పోలీసులు కట్టడి చేశారు. దీంతో వైఎస్ విజయమ్మ ఇంటివద్దే దీక్షకు పూనుకున్నారు. విజయమ్మలో పోలీసులు వాగ్వాదానికి దిగారు. తన కూతురిని చూడడానికి వెళ్తుంటే ఎందుకు ఆపుతున్నారంటూ విజయమ్మ పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు ఇలా చేయడం తప్పుకాదా.. పాదయాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధమా అన్నారు. మరోవైపు వైఎస్ షర్మిలను ఎస్‌ఆర్‌నగర్ పీఎస్‌లోనే ఉంచడంతో వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దాంతో వైఎస్సార్‌టీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్ చేశారు.
Read Also: Sajjala ramakrishna Reddy: షర్మిల అరెస్ట్ బాధాకరం.. ఆమె రాజకీయ నిర్ణయాలపై మేం స్పందించం..
సోమవారం నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని లింగగిరిలో వైఎస్ షర్మిలకు చెందిన బస్సుపై టీఆర్ఎస్ నాయకులు దాడిచేసి నిప్పు పెట్టారు. ఆమె కాన్వాయ్ లోని నాలుగు వాహనాలను ధ్వంసం చేశారు. టీఆర్ఎస్ శ్రేణుల దాడిని వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు అడ్డుకొనే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి హైద్రాబాద్లో వదిలి వెళ్లిపోయారు. అయితే నర్సంపేటలో టీఆర్ఎస్ శ్రేణుల దాడికి నిరసనగా ఇవాళ ప్రగతి భవన్ ముట్టడికి వైఎస్ఆర్‌టీపీ పిలుపునిచ్చింది. పోలీసుల కళ్లుగప్పి షర్మిల సోమాజీగూడ నుండి ధ్వంసమైన కారుతో ప్రగతి భవన్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు పంజాగుట్టలో షర్మిలను అడ్డుకున్నారు. అయితే కారులో నుండి దిగకుండా ఆమె నిరసనకు దిగారు. ప్రగతి భవన్ కు తాను వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. కారు అద్దాలు కూడా దించలేదు. దీంతో పోలీసులు క్రేన్ సహాయంతో కారుతో సహా షర్మిలను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పీఎస్‌కు షర్మిల అనుచరులు, వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ ముందు భవనం పైకి ఎక్కి వి వాంట్ జస్టిస్ అంటూ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.