Site icon NTV Telugu

Xi Jinping India Letter: భారత్‌కు జిన్‌పింగ్ రహస్య లేఖ.. అమెరికా గురించి ఏం చెప్పారంటే..

Xi Jinping India Letter

Xi Jinping India Letter

Xi Jinping India Letter: ఉప్పునిప్పు లాంటి రెండు దేశాలను అగ్రదేశం అమెరికా దగ్గర చేసిందా? సుంకాల సెగతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నది ఒక దేశం అయితే, ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించాలని తహతహలాడేది మరో దేశం. ఈ రెండు దేశాల మధ్య ఉన్న కామన్ పాయింట్ అమెరికా. ఇంతకీ ఈ రెండు దేశాలు ఏవేవి అంటే.. భారత్ – చైనా. 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎప్పుడైతే అమెరికా సుంకాల దాడులు చేయడం ప్రారంభించిందో అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు అనూహ్యంగా మారడం మొదలయ్యాయి. అప్పటి వరకు ఉప్పునిప్పుల ఉన్న దేశాలు కాస్తా.. స్నేహ హస్తాలను ఇచ్చుకోవడం మొదలు పెట్టాయి. ఈ రెండు దేశాల మధ్య కామన్ పాయింట్ ఏంటంటే ఇవి రష్యా నుంచి అత్యధిక స్థాయిలో చమురు కొనుగోలు చేస్తున్న దేశాలు కావడం. తాజాగా ఓ వార్త సంచలనం సృష్టిస్తుంది. చైనా అధ్యక్షుడు భారత్‌కు రహస్యంగా ఒక లేఖను రాసినట్లు బ్లూమ్‌బర్గ్ తన నివేదికలో పేర్కొంది. ఏడేళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటన నేపథ్యంలో అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌కు రాసిన రహస్య లేఖలో ఏముంది అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తానికి ఈ లేఖలో ఏముంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: EX MP Margani Bharat : ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు.. వచ్చేది మేమే

మార్చిలో జిన్‌పింగ్ లేఖ..
చైనాతో అమెరికా వాణిజ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకున్న సమయంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మార్చిలో రహస్య లేఖ రాశారని బ్లూమ్‌బెర్గ్ తన నివేదికలో పేర్కొంది. ఈ లేఖ భారత్- చైనాల మధ్య సంబంధాలను ఒక మలుపు తిప్పిందని, లేఖను చాలా జాగ్రత్తగా, ఉద్దేశపూర్వకంగా రాసినట్లు తెలిపింది. లేఖలో అమెరికా ఆర్థిక కార్యకలాపాలపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. భారత్- చైనా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశాలను అన్వేషించడానికి కొత్త దౌత్య కార్యక్రమాలను ప్రతిపాదించిందని నివేదిక పేర్కొంది. చైనా, ఇండియా రెండింటిపై వాషింగ్టన్ వాణిజ్య ఒత్తిడి పెరిగిన సమయంలో జిన్‌పింగ్ లేఖ వచ్చిందని వెల్లడించింది.

దౌత్య సంబంధాలను తిరిగి ప్రారంభించాలి..
చైనా ప్రయోజనాలను ప్రభావితం చేసే అన్ని అమెరికా ఒప్పందాలపై లేఖలో అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశాడని నివేదిక పేర్కొంది. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలను తిరిగి ప్రారంభించాలని కోరినట్లు తెలిపింది. ఈ సమాచారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా ఇచ్చినట్లు వివరించింది. ఇండియాకు లేఖ అందిన తర్వాత జూన్ నాటికి న్యూఢిల్లీ బీజింగ్‌తో చర్చలను తిరిగి ప్రారంభించింది. గత వారం ఇరుదేశాలు సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునే ప్రయత్నాలను తిరిగి ప్రారంభించడానికి అంగీకరించాయి. ఇది 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ నుంచి కనిపించే పురోగతి. దీనిపై ముంబైలోని చైనీస్ కాన్సులేట్‌లో పనిచేసిన మాజీ చైనా దౌత్యవేత్త కుయ్ హాంగ్జియాన్ మాట్లాడుతూ.. ఇరుదేశాల సంబంధాలలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని అన్నారు. ఈ మార్పు వచ్చిన తర్వాత మాత్రమే జిన్‌పింగ్ జాగ్రత్తగా నడుచుకుంటున్నారని, ద్వైపాక్షిక సంబంధాలకు మార్గనిర్దేశం చేయడానికి మరింత అధికారిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.

కొన్ని అడ్డంకులు..
భారత్- చైనా సంబంధాల పునరుద్ధరణకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 90 ఏళ్ల దలైలామా మరణం తర్వాత వారసత్వ సమస్య, చైనా బహిష్కరించిన టిబెటన్ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ నుంచి పనిచేయడం ఒక అడ్డంకి అని పేర్కొన్నారు. తర్వాత దలైలామా ఎంపిక ప్రక్రియ, అభ్యర్థిని బీజింగ్ ఆమోదించాలని చెప్పే 1793 సామ్రాజ్య ఆర్డినెన్స్‌ను చైనా ప్రభుత్వం ఉదహరించడం, దలైలామాకు భారతదేశం రాజకీయ ఆశ్రయం కల్పించడం కూడా .. ఇరుదేశాల సంబంధాల బలోపేతానికి అడ్డంకులుగా మారవచ్చని అంటున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని రెండు దేశాలు చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

READ ALSO: Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం.. మూడేళ్ల యుద్ధంలో రెండో అతిపెద్ద దాడి

Exit mobile version