WPL 2027: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027 సీజన్‌కు సంబంధించి కీలక మార్పు చోటుచేసుకుంది. ముంబై వేదికగా జరగాల్సిన మ్యాచ్‌లను బ్రబౌర్న్ స్టేడియం నుంచి వాంఖడే స్టేడియానికి మారుస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయం తీసుకుంది. అయితే మ్యాచ్‌ల తేదీలు, షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. ముంబై లెగ్‌లో భాగంగా జరగాల్సిన మొత్తం 11 మ్యాచ్‌లకు వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
వాస్తవానికి WPL 2027 ఐదో ఎడిషన్‌కు సంబంధించిన వేదికలు, తేదీలను సెప్టెంబర్ 15, 2026న జరిగిన సమావేశంలో లీగ్ పాలక మండలి ఖరారు చేసింది. దీని ప్రకారం జనవరి 26 నుంచి ఫిబ్రవరి 7 వరకు ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (CCI) బ్రబౌర్న్ స్టేడియంలో 12 నుంచి 20వ మ్యాచ్‌లతో పాటు ఎలిమినేటర్, ఫైనల్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఫిబ్రవరి 14 నుంచి CCI వేదికగా ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ప్రారంభం కానుంది. దీంతో WPL ముగిసిన తర్వాత పిచ్‌లు కోలుకోవడానికి తగినంత సమయం ఉండదని ఐసీసీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో CCIలో జరగాల్సిన మ్యాచ్‌లను మరో వేదికకు మార్చాలని ఐసీసీ కోరింది. దీనికి WPL కమిటీ ఆమోదం తెలపడంతో వేదికను వాంఖడే స్టేడియానికి మార్చారు.
ఇక WPL 2027 సీజన్ జనవరి 14న వడోదరలో ప్రారంభం కానుంది. అక్కడ జనవరి 24 వరకు తొలి 11 మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం ముంబైకి టోర్నీ షిఫ్ట్ అవుతుంది. ఫిబ్రవరి 7న ముంబైలో ఫైనల్‌తో ఐదో సీజన్ ముగుస్తుంది. రెండు వేదికల్లోనూ అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
🚨 𝗔𝗻𝗻𝗼𝘂𝗻𝗰𝗲𝗺𝗲𝗻𝘁 🚨
Wankhede Stadium to host Mumbai leg of #TATAWPL 2027 instead of CCI’s Brabourne Stadium 🏟️
The dates and fixtures will remain unchanged.
All details 🔽
https://t.co/6Pa5H4GHr0
— Women’s Premier League (WPL) (@wplt20) November 15, 2026

