శక్తికాంత దాస్.. ఆర్బీఐ గవర్నర్. మోడీ ప్రభుత్వంలో గత రెండు పర్యాయాల నుంచి ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ కొనసాగుతున్నారు. తాజాగా మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ అంశం చర్చకు వచ్చింది. శక్తికాంత దాస్‌నే కొనసాగిస్తారా? లేదంటే కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా? అన్న అంశంపై చర్చ నడుస్తోంది. అయితే ముచ్చటగా మూడోసారి కూడా శక్తికాంత దాస్‌కే అవకాశం దక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరో ఆరు నెలల్లో శక్తికాంత దాస్ పదవి కాలం ముగుస్తుంది. అయితే ఓ ఇంటర్వ్యూలో మళ్లీ ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగుతారా? అని ప్రశ్నించగా.. ఇది ఊహాజనిత ప్రశ్న అని.. ఆరు నెలల సమయం ఉందని.. తర్వాత చూద్దాంలే అని సమాధానం దాట వేశారు.
శక్తికాంత దాస్ తమిళనాడు కేడర్‌కు చెందిన 1980 బ్యాచ్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. డిసెంబర్ 12, 2018లో ఆర్బీఐ గవర్నర్‌గా బాధత్యలు చేపట్టారు. అనంతరం పదవిని 2021లో మరో మూడేళ్ల పొడిగించారు. 2023లో ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు. ఇక మూడోసారి కూడా కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చింది. మరోసారి అవకాశం ఇస్తారో.. లేదంటే మరొకరికి ఇస్తారో చూడాలి.