WCL 2025: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టోర్నీల్లో వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) కూడా ఒకటిగా చేరిపోయింది. దీనికి కారణం మనకు ఎంతో ఇష్టమైన రిటైర్డ్ క్రికెట్ లెజెండ్స్ మరోసారి మైదానంలో కనిపించడమే. ఈ టోర్నీ రెండవ సీజన్ జూలై 18 నుండి ఆగస్టు 2 వరకు ఇంగ్లాండ్ లోని నాలుగు ప్రధాన వేదికలపై జరగనుంది. మొదటి సీజన్‌లో ట్రోఫీ గెలుచుకున్న ఇండియా ఛాంపియన్స్ జట్టు, మరోసారి యువరాజ్ సింగ్ నాయకత్వంలో టైటిల్‌ను నిలుపుకోవడానికి సిద్ధమైంది. యువరాజ్‌తో పాటు జట్టులో శిఖర్ ధావన్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు వంటి మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు మళ్లీ బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 16 మందితో కూడిన జట్టును తాజాగా ప్రకటించబడింది.
Read Also:IBPS PO Notification 2025: త్వరపడండి.. పరీక్ష ఒక్కటే.. 11 బ్యాంకుల్లో 5208 ఉద్యోగాలు..!
ఈ టోర్నమెంట్‌లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ లాంటి ఆరు దేశాల లెజెండరీ జట్లు పోటీపడతాయి. రౌండ్ రాబిన్ లీగ్ విధానంలో జరుగనున్న ఈ టోర్నీలో ప్రతి జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అగ్ర నాలుగు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్ విజేతలు ఆగస్టు 2న జరిగే ఫైనల్‌లో కప్పు కోసం తలపడతారు.
ఇండియా ఛాంపియన్స్ జట్టు జూలై 20న పాకిస్తాన్ ఛాంపియన్స్‌తో, 22న దక్షిణాఫ్రికా, 26న ఆస్ట్రేలియా, 27న ఇంగ్లాండ్, 29న వెస్టిండీస్ జట్లతో లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. గత సీజన్‌లో టీమిండియా యువరాజ్ సింగ్ సారథ్యంలోని జట్టు మూడు మ్యాచ్‌లలో ఓడిపోయినా, రెండు విజయాలతో నాల్గవ స్థానంలో నిలిచి సెమీస్‌కు చేరింది. ఆ తర్వాత సెమీలో ఆస్ట్రేలియాను చిత్తు చేసి, ఫైనల్ లో పాకిస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచి టైటిల్ గెలుచుకుంది.
Read Also:Cyberabad Police: స్పా సెంటర్లకు ఇక దబిడి దిబిడే.. హెచ్చరికలు జారీచేసిన పోలీసులు
ఈసారి కూడా యువీ సారథ్యంలో మరోసారి బాలన్స్ గా ఉన్న జట్టు ద్వారా భారత్ విజయం దిశగా ముందుకెళ్తుందా అనేది వేచి చూడాల్సిందే. శిఖర్ ధావన్ తొలిసారి ఈ లెజెండ్స్ టోర్నీలో ఆడబోతుండగా, ఆల్ రౌండర్ల పటిష్ట సమీకరణతో జట్టు మరింత బలంగా మారింది. భారత క్రికెట్ అభిమానులకు ఇది మరోసారి తమ ఇష్టమైన లెజెండ్స్‌ను మైదానంలో చూడగల ప్రత్యేక అవకాశం కలగనుంది. మరి ఈ టోర్నీకి ప్రకటించిన జట్టు ఇలా ఉంది.
ఇండియా ఛాంపియన్స్ జట్టు: యువరాజ్ సింగ్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, గురుకీరత్ మాన్, వినయ్ కుమార్, సిద్దార్థ్ కౌల్, వరుణ్ ఆరోన్, అభిమన్యు మిథున్, పవన్ నేగి మిథున్
