Site icon NTV Telugu

Vontimitta Kalyanam 2025: ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవం.. కడప మీదుగా వెళ్లే వాహనాలు దారి మళ్లింపు!

Vontimitta Kodanda Rama Swamy Kalyanotsavam

Vontimitta Kodanda Rama Swamy Kalyanotsavam

ఒంటిమిట్టలో సీతారాముల కల్యా ణోత్సవం సందర్భంగా నేటి ఉదయం 9 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు కడప మీదుగా వెళ్లే వాహనాలను అధికారులు దారి మళ్లించారు. కడప నుంచి తిరుపతి వైపు వెళ్లే వాహనాలు అలంఖాన్ పల్లె సమీపంలోని ఇర్కాన్, ఊటుకూరు కూడళ్ల మీదుగా రాయచోటికి వెళ్లి అక్కడ నుంచి తిరుపతికి వెళ్లాల్సి ఉంటుంది. తిరుపతి నుంచి కడప వైపు వచ్చే వాహనాలు రాయచోటి మీదుగా రావాల్సి ఉంటుంది. రాజంపేట వైపు నుంచి కడపకు వచ్చే భారీ వాహనాలు రాయచోటి మీదుగా దారి మళ్లించారు. ద్విచక్ర వాహనాలు సాలాబాద్ నుంచి ఇబ్రహీంపేట, మాధవరం మీదుగా మళ్లించారు.

కళ్యాణోత్సవానికి వచ్చే భక్తుల వాహనాలకు కడప మార్గంలో 13 ప్రాంతాలతో పాటు సాలాబాద్ వద్ద అయిదు ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు అధికారులు కేటాయించారు. రాజంపేట మార్గంలో ద్విచక్రవాహనాలు, ఆర్టీసీ బస్సులు ఒంటిమిట్ట మండలం సాలాబాద్ క్రాస్ వద్ద, కడప నుంచి వచ్చే వారు సిద్దవటం మండలం ఉప్పరపల్లె సాయిబాబా గుడి వద్ద నిలపాల్సి ఉంటుంది. ఆయా చోట్ల నుంచి కల్యాణ వేదిక వద్దకు ఉచిత బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు.

ఇక ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం శుక్రవారం సాయంత్రం 6:30 నుంచి 8:30 మధ్య పండు వెన్నెలలో వైభవంగా జరగనుంది. సీతారాముల కల్యాణోత్సవానికి వైఎస్సార్‌ జిల్లా యంత్రాగం, టీటీడీ సర్వం సిద్ధం చేశాయి. భక్తులకు పంపిణీ చేయడానికి లక్ష ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను టీటీడీ సిద్ధం చేసింది. సీతారాముల కల్యాణాన్ని లక్ష మంది ప్రత్యక్షంగా వీక్షించేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. సీఎం చంద్రబాబు కల్యాణోత్సవంలో పాల్గొననున్నారు. సీఎం సాయంత్రం 5 గంటలకు ఒంటిమిట్ట చేరుకుని.. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేస్తారు.

Exit mobile version