విశాఖపట్నంలో ఒక విచిత్రమైన దొంగతనం ఉదంతం వెలుగుచూసింది. సాధారణంగా పురుషులు చేసే చైన్ స్నాచింగ్‌లకు భిన్నంగా, ఇక్కడ ఏకంగా ఒక తల్లీకొడుకు దొంగలుగా అవతారమెత్తి పోలీసులకే షాక్ ఇచ్చారు. ధనలక్ష్మి (40) అనే మహిళ చేసిన వ్యాపారంలో భారీగా నష్టపోయి అప్పులపాలైంది. ఎలాగైనా సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో, ఆమె యూట్యూబ్ లో చైన్ స్నాచింగ్ చేసే విధానాలను చూసింది. ఆ తర్వాత తన 20 ఏళ్ల కొడుకు అచ్చుత్‌ను కూడా ఈ నేరంలో భాగస్వామిని చేసింది. కొడుకు వేగంగా బైక్ నడుపుతుంటే, వెనుక కూర్చున్న తల్లి ఒంటరిగా వెళ్లే మహిళల మెడలోని గొలుసులను లాక్కొని పరారయ్యేవాళ్లు.
గత నెలలో విశాఖలోని సుజాత నగర్‌లో నడుచుకుంటూ వెళ్తున్న ఒక మహిళ మెడలోంచి ఈ తల్లీకొడుకులు బైక్‌పై వచ్చి క్షణాల్లో చైన్ తెంచుకుని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితులను పక్కాగా గుర్తించి, రామ టాకీస్ సమీపంలో ఆ తల్లీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దొంగిలించిన రెండు బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా చైన్ స్నాచింగ్‌లకు మహిళలు దూరంగా ఉంటారని భావించే పోలీసులకు, ఈ విచిత్ర జోడిని చూసి ఆశ్చర్యపోవడం వారి వంతైంది. సమాజంలో తప్పుదారి పట్టే పిల్లలను సరిదిద్దాల్సిన తల్లి, తానే స్వయంగా కొడుకును దొంగగా మార్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

