Site icon NTV Telugu

Cricket Tragedy: చివరి బంతి వేశాడు, మ్యాచ్ గెలిపించాడు.. కానీ మైదానంలోనే మరణించాడు!

Sam

Sam

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఓ క్రికెట్ ఆటగాడు మైదానంలోనే మృతి చెందాడు. స్థానికంగా జరిగిన ఓ టోర్నమెంట్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి తన జట్టును గెలిపించాడు కానీ.. జీవిత పోరాటంలో మాత్రం ఓడిపోయాడు. చివరి బంతి వేసిన తర్వాత ఆ బౌలర్ అకస్మాత్తుగా మరణించాడు. ఈ ఘటనతో అందరూ షాక్ అయ్యారు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి వైరల్ అయింది.

మొరాదాబాద్‌లోని బిలారి బ్లాక్‌లో ఉత్తరప్రదేశ్ వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ ఓ టోర్నమెంట్‌ను నిర్వహించింది. బిలారిలోని చక్కెర మిల్లు మైదానంలో ఆదివారం మొరాదాబాద్, సంభాల్ జట్లు తలపడ్డాయి. మొరాదాబాద్ మొదట బ్యాటింగ్ చేసింది. ఛేదనలో సంభాల్ విజయానికి చివరి నాలుగు బంతుల్లో 14 పరుగులు అవసరం అయ్యాయి. మొరాదాబాద్ ఫాస్ట్ బౌలర్ అహ్మర్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో.. సంభాల్ జట్టు 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి బంతి పడగానే మొరాదాబాద్ ప్లేయర్స్ సంబరాల్లో మునిగిపోయారు. అహ్మర్ మాత్రం తీవ్ర అస్వస్థతతో మైదానంలో కుప్పకూలాడు.

Also Read: Smriti Mandhana: తొలి బ్యాటర్‌గా స్మృతి మంధాన ప్రపంచ రికార్డు.. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు!

అహ్మర్ ఖాన్ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. భయాందోళనకు గురైన మొరాదాబాద్ ప్లేయర్స్ వెంటనే చికిత్స అందించారు. అక్కడే ఉన్న వైద్యుడు మైదానంలో అతడికి సీపీఆర్ చేశాడు. దాంతో అహ్మర్ కాస్త కుదుటపడ్డాడు. ఆ తర్వాత అతన్ని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యుడు పరిశీలించగా.. అహ్మర్ అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనతో మ్యాచ్ గెలిచిన ఆనందం శోకసంద్రంగా మారింది. తోటి ప్లేయర్స్, ప్రేక్షకులు దిగ్భ్రాంతి చెందారు. అహ్మర్ స్థానిక మొరాదాబాద్ జట్టుకు సీనియర్ బౌలర్ అని, చాలా సంవత్సరాలుగా క్రికెట్‌లో చురుగ్గా పాల్గొంటున్నాడని టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు.

Exit mobile version