Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!

  • ఉద్యోగం జీవించడానికి ఆదాయం మాత్రమే
  • ఉద్యోగమే జీవితం కాదు
  • లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
Job

Job

ఈ మధ్య ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వచ్చాక ఆయా కంపెనీల్లో లేఆఫ్‌లు పెరిగిపోతున్నాయి. అమాంతంగా వందలాది మందిని తొలగిస్తున్నారు. ఉన్నట్టుండి చాలా మంది జాబ్స్ కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఉద్యోగి పెట్టిన పోస్ట్ ఇప్పుడు తాజాగా వైరల్ అవుతోంది.

ఉద్యోగం అంటే జీవించడానికి అవసరమైన ఆదాయం సంపాదించే మార్గం మాత్రమేనని.. అదే మన జీవితంగా మారకూడదని సోషల్ మీడియాలో ఓ ఉద్యోగి పోస్ట్ చేసింది. ఉద్యోగం నుంచి తొలగింపునకు గురైన తర్వాత అనైషి (Anaishi) అనే ఉద్యోగి ఎక్స్‌ వేదికగా చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఉద్యోగం కోసం వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబంతో గడిపే సమయాన్ని త్యాగం చేయకూడదంటూ ఆమె ఇచ్చిన సందేశానికి పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు.

తాను ఇష్టపడే ఉద్యోగం చేసేవాడినని, తనతో కలిసి పనిచేసే సహోద్యోగులంటే కూడా ఎంతో అభిమానం ఉండేదని అనైషి తెలిపారు. అయితే అనూహ్యంగా ఉద్యోగం కోల్పోవడంతో పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసుకున్నారు. ఉద్యోగం కోసం ఆఫీసులో ఆలస్యంగా ఉండటం, పని వేళలు ముగిసిన తర్వాత కూడా ఈమెయిల్స్‌ చెక్‌ చేయడం, వారాంతాల్లోనూ పని చేయడం వంటి వాటిని తగ్గించుకోవాలని ఆమె సూచించారు. ఉద్యోగం మన జీవితాన్ని గడపడానికి ఆదాయాన్ని ఇస్తుంది తప్ప.. అదే మన జీవితమైపోకూడదని పేర్కొన్నారు.

అనైషి పోస్ట్‌పై స్పందించిన ఓ నెటిజన్‌.. సంస్థలు ఉద్యోగులను భర్తీ చేయగలవని, కానీ కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో గడపాల్సిన సమయాన్ని తిరిగి పొందలేమని వ్యాఖ్యానించారు. ఉద్యోగం కోసం సాయంత్రాలు, వారాంతాలు, వ్యక్తిగత క్షణాలను త్యాగం చేస్తే.. ఆ సమయాన్ని మళ్లీ వెనక్కి తీసుకురాలేమని అభిప్రాయపడ్డారు. మరో నెటిజన్‌ మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను ఎక్కువ గంటలు పనిచేయడానికి కారణం ఉద్యోగంలో తనకు గర్వంగా అనిపించడమేనని, సంస్థకు తాను ప్రత్యామ్నాయం లేని వ్యక్తినని భావించడం కాదని తెలిపారు. అనైషికి మంచి ఉద్యోగం లభించాలని ఆకాంక్షిస్తూ.. వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూనే పనిపట్ల నిబద్ధతతో ఉండగలిగే సంస్థలో ఆమెకు అవకాశం రావాలని కోరుకున్నారు.

మరో యూజర్‌ ఉద్యోగాన్ని ఇష్టపడటం, ఉద్యోగంలో కొనసాగడంపై నియంత్రణ కలిగి ఉండటం రెండూ వేర్వేరు అంశాలని పేర్కొన్నారు. పని పట్ల, సహోద్యోగుల పట్ల ఎంత అభిమానం ఉన్నా.. పరిస్థితులు మారితే ఉద్యోగి ఒక వ్యాపార నిర్ణయంలో భాగంగా మారవచ్చని వ్యాఖ్యానించారు.అందువల్ల ఉద్యోగులు తమ ఉపాధిని కాపాడుకోవడంతో పాటు.. కార్యాలయం వెలుపల కూడా సంతృప్తికరమైన జీవితాన్ని నిర్మించుకోవాలని సూచించారు.

మరికొందరు అనైషికి ధైర్యం చెప్పారు. ఉద్యోగం కోల్పోవడం బాధాకరమే అయినప్పటికీ.. ఇది మరింత మంచి జీతం, మెరుగైన పని వాతావరణం ఉన్న సంస్థలో అవకాశం పొందేందుకు మార్గం కావచ్చని అభిప్రాయపడ్డారు. జరిగిన పరిణామం నుంచి కోలుకోవడానికి కొంత సమయం తీసుకోవాలని, కొత్త అవకాశాల పట్ల ఆశావహంగా ఉండాలని సూచించారు. మొత్తంగా అనైషి పోస్ట్‌ ఉద్యోగ భద్రత, సంస్థల పట్ల ఉద్యోగుల నిబద్ధత, పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత వంటి అంశాలపై మరోసారి చర్చకు తెరతీసింది. కెరీర్‌లో ఎదగడం ఎంత ముఖ్యమో.. కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత ఆనందానికి సమయం కేటాయించడం కూడా అంతే ముఖ్యమనే అభిప్రాయాన్ని పలువురు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.