Site icon NTV Telugu

Ganesh Chaturthi 2025: వినాయకుడి విగ్రహం పెడుతున్నారా? ఇది మీ కోసమే..

Ganesh Chaturthi

Ganesh Chaturthi

Ganesh Chaturthi 2025 : ఏ శుభ కార్యమైనా ముందుగా వినాయకుడి పూజతోనే ప్రారభమవుతుంది. అలాంటి ఏకదంతుడి పండుగంటే మహా సంబరమే. ఎక్కడ చూసినా గణేష్ సందడే. గల్లీ గల్లీలో మండపాలు వెలిశాయి. రావయ్య గణపయ్య అంటూ సర్వంగా సుందరంగా ముస్తాబయ్యాయి. గణపతి బప్పా మోరియా అంటూ ఊరూవాడా సందడే సందడే. ఇప్పటికే విగ్రహాలను తీసుకువచ్చి పందిళ్లలో నెలకొల్పుతున్నారు. జై జై గణేశా అంటూ ఆగమన్‌ వేడుకలు వీధివీధినా హోరెత్తుతున్నాయి. డ్రమ్స్ దరువుల మధ్య గణపతి బప్పా మోరియా నినాదాలు మార్మోగుతున్నాయి.. వర్షంతో వేడుకలకు అంతారయం కలిగినా.. బొజ్జ గణపయ్య కోసం అవి ఏమీ లెక్కచేయడం లేదు భక్తులు.. ఇక, ప్రతి ఏడా వినాయక చవితి (గణేష్‌ చతుర్థి) భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి తేదీన వస్తుంది. 10 రోజుల అనంతరం గణేష్ పండుగ అనంత చతుర్దశి రోజున ముగుస్తుంది. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి ఆగస్టు 27 నుంచి అంటే ఇవాళ ప్రారంభమై.. సెప్టెంబర్ 7 వరకు కొనసాగుతుంది. వినాయక చవితికి ఉత్సవాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.. గణనాథుడిని పూజించడానికి ఊరూ వాడా ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈక్రమంలో వినాయక చవితి పండుగ రోజు విగ్రహ ప్రతిష్టకు శుభ ముహూర్తం ఏంటి?, గణనాథుడు పూజా విధానం ఏంటి..? భక్తులు ఓసారి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

వినాయకుడి విగ్రహ ప్రతిష్ట శుభ ముహూర్తం:
గణేష్ చతుర్థిని ఈ రోజు అనగా ఆగస్టు 27న జరుపుకుంటున్నారు.. భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి ఆగస్టు 26న మధ్యాహ్నం 1:54 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 27న మధ్యాహ్నం 3:44 గంటల వరకు ఉంటుంది. వినాయక చవితి రోజున గణపతిని పూజించడానికి ఉత్తమ సమయాలు ఇలా ఉన్నాయి.. ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 1:40 వరకు ఉంది. దీని శుభ ముహూర్తం మొత్తం వ్యవధి 2 గంటల 34 నిమిషాలు. విగ్రహ ప్రతిష్టకు ఈ సమయం అత్యుత్తమమైనది అని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి.. నియమ, నిష్టలతో పూజ చేయడం వల్ల వినాయకుడి అనుగ్రహం లభిస్తుందంటున్నారు..

గణపయ్య పూజను ఎలా చేయాలి..? :
ఉదయాన్నే అందరూ నిద్రలేచి.. స్నానం తర్వాత ఇంటిని, పూజ గదిని శుభ్రం చేయాలి. మామిడాకు తోరణాలు, పూలతో ఇంటిని అలంకరించుకోవాలి. పీటకు పసుపు రాసి.. ఇంటి ఉత్తర లేదా ఈశాన్య దిశలో పెట్టాలి. ఓ పళ్లెంలో బియ్యం పోసి వాటిపై తమలపాకులు పేర్చుకోవాలి. ఆ తమలపాకులపై వినాయక విగ్రహాన్ని పెట్టాలి. ఆవు నెయ్యితో దీపాలు, అగరువత్తులు వెలిగించాలి. పాలవెల్లిని పసుపు, కుంకుమతో అలంకరించి.. మామిడాకుడులు కట్టి వినాయక విగ్రహంకు వేయాలి. పాలవెల్లికి నాలుగు వైపులా మొక్కజొన్న పొత్తులు, పూలు, పండ్లు, పత్రితో అలంకరించాలి. రాగి లేదా ఇత్తడి పాత్రకు పసుపు రాసి, అందులో నీళ్లు పోసి పైన కొబ్బరికాయ, జాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి. గణపతికి పసుపు, కుంకుమ, గంధం, కర్పూరం, తమలపాకులు, పూలు, పండ్లు, ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం వంటివి నైవేద్యంగా సమర్పించాలి. ఆపై వినాయక వ్రతకల్పం చదివి పూజ పూర్తి చేస్తే మంచి ఫలితాలు అందుకుంటారని పండితుల మాట…

వినాయకుడి మండపానికి వాస్తు ఉండాలా..?:
వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టచడం మాత్రమే కాదు.. గణేష్​ మండపాల ఏర్పాటులో వాస్తును తప్పకుండా పాటించాలని పండితులు అంటుంటారు. తూర్పు లేదా ఉత్తరం దిక్కులో గణేశుడి ముఖం ఉండేట్టు చూసుకోవాలని చెబుతున్నారు..

గణేష్‌ చతుర్థి రోజు చంద్రుడిని చూడకూడదా..? సమయం ఏంటి..?
ఆది నుంచి గణేష్ చతుర్థి నాడు చంద్రుడిని చూడటం అశుభమని భావిస్తారు. దీని కూడా ఓ సమయం చెబుతున్నారు పండితులు.. ఆగస్టు 27న ఉదయం 9:28 నుంచి రాత్రి 8:57 వరకు చంద్రుడిని చూడకూడదు అంటున్నారు. ఇక, ఇప్పటికే ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వినాయక చవితి శోభ కనిపిస్తోంది.. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా.. వినాయక మండపాల దగ్గర డెకరేషన్‌ కార్యక్రమాల్లో మునిగిపోతున్నారు యువత..

Exit mobile version