విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి 2025 దసరా ఉత్సవాలు ముగిసిన విషయం తెలిసిందే. తాజాగా నిర్వహించిన హుండీ లెక్కింపులో రికార్డు స్థాయిలో ఆదాయం నమోదైంది. దసరా నవరాత్రుల 11 రోజుల హుండీ లెక్కింపు పూర్తవగా.. ఈసారి అమ్మవారి హుండీ ఆదాయం 10.30 కోట్లను దాటింది. గత సంవత్సరం 2024 దసరా నవరాత్రులలో 9.32 కోట్లు వస్తే.. ఈసారి దాదాపు ఒక కోటి రూపాయల పెరుగుదల నమోదైంది.
ఇంద్రకీలాద్రిపై రెండు రోజుల పాటు ఆలయ అధికారులు హుండీ లెక్కింపు నిర్వహించారు. అధికారులు మొత్తం 106 సంచులు, 480 హుండీలు తెరచి లెక్కించారు. మొదటి రోజు 3.57 కోట్లు, రెండవ రోజు 6.73 కోట్లు లెక్కయ్యాయి. అదనంగా 387 గ్రాముల బంగారం, 19 కేజీల 450 గ్రాముల వెండి, అలాగే పలు దేశాల విదేశీ కరెన్సీ కూడా హుండీలో కనిపించాయి. భక్తుల విరాళాలతో అమ్మవారి హుండీ ఆదాయం ఈసారి రికార్డు స్థాయికి చేరుకుంది.
