CM Vijay: సింహాసనం విజయ్‌ది.. వ్యూహం కాంగ్రెస్‌ది.. నట్టేట మునిగిన ఏఐఏడీఎంకే రెబెల్స్..!

Political

Political

తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన మంత్రివర్గాన్ని విస్తరించిన విషయం తెలిసిందే. అయితే తమిళనాడులో దాదాపు 59 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం(క్యాబినెట్)లో భాగస్వామి అయింది. విజయ్ మంత్రివర్గంలో కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది కాంగ్రెస్ భవిష్యత్ పొలిటికల్ వ్యూహంలో భాగం అని చెప్పవచ్చు. దీనిలో విజయ్ కూడా పొలిటికల్ గా మాస్టర్ మైండ్ ఉపయోగించినట్లు క్లియర్ గా తెలుస్తోంది.

విశ్వాస పరీక్షలో సీఎం విజయ్‌కు మద్దతుగా ఓటు వేసిన 25 మంది ఏఐఏడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలను విజయ్ తెలివిగా పక్కన పెట్టారు. మంత్రి పదవులపై ఆశలతో వచ్చిన తిరుగుబాటు నేతలకు (వేలుమణి, షణ్ముగం వర్గం) మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. వారిపై ఉన్న అవినీతి ఆరోపణలు, ప్రజావ్యతిరేకత కారణంగా విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల తిరుగుబాటుదారులు ఇప్పుడు అటు పదవులు లేక, ఇటు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (EPS)ని ఎదిరించలేక నట్టేట మునిగారు.

మైనారిటీ లేదా స్వల్ప మెజారిటీతో ఉన్న తన ప్రభుత్వానికి భవిష్యత్తులో మిత్రపక్షాల నుండి ఎలాంటి ముప్పు రాకుండా ఉండటానికి విజయ్ సరికొత్త ప్లాన్ వేశారు.  కూటమి పార్టీలను (కాంగ్రెస్, త్వరలో చేరబోయే విసికె, ఐయూఎంఎల్) నేరుగా ప్రభుత్వంలో భాగస్వాములను చేయడం ద్వారా వారు ప్రభుత్వాన్ని పడగొట్టకుండా ‘రాజకీయ భీమా’ కల్పించుకున్నారు.

గతంలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే వైపు ఉన్న బలమైన ‘సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్’ కూటమి ఈ నిర్ణయంతో అధికారికంగా ముక్కలైంది. తమిళనాడులో బీజేపీ వ్యతిరేక ఓట్లకు కేవలం డీఎంకే ఒక్కటే దిక్కు కాదనే సందేశాన్ని విజయ్ ఇచ్చారు. గత 60 ఏళ్లుగా తమిళనాడులో డీఎంకే లేదా ఏఐఏడీఎంకేలు ఒంటరిగా పూర్తి మెజారిటీతో పాలిస్తూ, చిన్న పార్టీలకు అధికారంలో వాటా ఇచ్చేవి కావు. కానీ విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ఈ పాత సంప్రదాయాన్ని బద్దలు కొట్టి, చిన్న పార్టీలను ప్రభుత్వంలో చేర్చుకోవడం ద్వారా తమిళనాడును ‘కూటమి ప్రభుత్వాల’ యుగం వైపు తీసుకెళ్లింది. ఈ మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో పుంజుకోవడానికి, 2029 లోక్‌సభ ఎన్నికల్లో టీవీకే-కాంగ్రెస్ బలమైన కూటమిగా ఏర్పడటానికి ఒక పునాదిగా మారింది.