NTV Telugu Site icon

Vijay: హీరో విజయ్ కొత్త పార్టీపై అన్నాడీఎంకే కీలక వ్యాఖ్యలు

Vijay

Vijay

సార్వత్రిక ఎన్నికల ముందు తమిళనాట మరో కొత్త పార్టీ పురుడుపోసుకుంది. ప్రముఖ కోలీవుడ్ హీరో విజయ్ (Vijay) ఎట్టకేలకు శుక్రవారం కొత్త పార్టీని స్థాపించారు. ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో నూతన పార్టీని నెలకొల్పారు. ఈ మేరకు విజయ్‌ అధికారికంగా సోషల్‌ మీడియాలో ప్రకటించారు.

ఈ సందర్భం విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతోందని స్టాలిన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పోటీ చేయట్లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇతర పార్టీలకు కూడా మద్దతు ఇవ్వబోమని చెప్పుకొచ్చారు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక పార్టీ జెండా, అజెండాను త్వరలోనే ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు.

అన్నాడీఎంకే రియాక్షన్ ఇలా..
విజయ్ స్థాపించిన కొత్త పార్టీపై అన్నాడీఎంకే (AIADMK )విమర్శలు గుప్పించింది. ఇన్నాళ్లకు పిల్లి బయటపడిందని ఆ పార్టీ నేత కోవై సత్యన్ వ్యాఖ్యానించారు. విజయ్‌కి ఎప్పుట్నుంచో రాజకీయ కోరికలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. బీజేపీ నుంచి అన్నాడీఎంకే తెగతెంపులు చేసుకున్నాక.. హీరో రజనీకాంత్‌ను లాక్కోవాలని చూశారని.. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదని చెప్పుకొచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో సినీ గ్లామర్ కావాలని బీజేపీ (BJP) ప్రయత్నించిందని.. అందులో భాగంగానే ఇప్పుడు విజయ్ తెరపైకి వచ్చారని పేర్కొన్నారు. తమిళనాడులో బీజేపీ ఎదగాలంటే కచ్చితంగా సినీ ప్రపంచం నుంచి ఎవరొకరు కావాలి.. ఆ ప్లాన్‌లో భాగంగానే ఇప్పుడు విజయ్ వచ్చారు. ఏదేమైనా బీజేపీకి.. విజయ్‌కి గుడ్ లక్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.