NTV Telugu Site icon

Gang War: హాలీవుడ్ తరహాలో గ్యాంగ్‌వార్.. వీడియో వైరల్

Fight

Fight

రెండు గ్రూపుల మధ్య జరిగిన గ్యాంగ్‌వార్ హాలీవుడ్ సినిమాను మించిపోయింది. అచ్చం సినిమాలో మాదిరిగానే రెండు గ్రూపులు ఘర్షణకు తలపడ్డాయి. రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడం.. ఆరుగురు యువకులు వీరంగం సృష్టించడం.. ఒక యువకుడు కర్రతో బీభత్సం సృష్టించడం.. అతడిపై వేగంగా కారు దూసుకురావడంతో వాతావరణం రణరంగంగా మారిపోయింది. కర్ణాటకలోని ఉడిపిలో జరిగిన సంఘటనకు సంబంధించిన దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒక వైద్యుడు వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెట్టింట వైరల్‌గా మారాయి.

సమయం అర్ధరాత్రి. ప్రాంతం ఉడిపి-మణిపాల్ హైవే. రెండు కార్లు. ఆరుగురు యువకులు. ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. ఒక్కసారిగా ఆ ప్రాంతం రణరంగంగా మారిపోయింది. సినిమాలో మాదిరిగా రెండు గ్రూపులు ఫైటింగ్‌కు దిగాయి. అందులో ఒక కారు స్పీడ్‌లో రివర్స్‌ అయి మరొకటి బానెట్‌ను ఢీకొట్టింది. ఒక్కసారిగా నల్లటి పొగ వెలువడింది. కొద్దిసేపటికే రెండు కార్లలోని వ్యక్తులు దిగి ఒకరినొకరు కొట్టుకోవడం ప్రారంభించారు. ఓ కారు వేగంగా దూసుకొచ్చి… కర్ర పట్టుకున్న యువకుడిని ఢీకొట్టింది. ఒక్కసారిగా అతడు నేలపై పడిపోయాడు. ప్రత్యర్థి వర్గానికి చెందిన మరో వ్యక్తి.. గాయపడిన వ్యక్తిపై ఎటాక్ చేశాడు. కర్రతో కొట్టడం కనిపించింది. దీంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మే 18 రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రహదారికి సమీపంలో ఉన్న ఎత్తైన భవనంలో నివాసం ఉంటున్న వైద్యుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఘటనలో రెండు మారుతీ స్విఫ్ట్ కార్లు పాల్గొన్నట్లు చూపించారు.

ఇది చాలా దారుణమైన పరిస్థితి అని ఆర్థోపెడిక్ సర్జన్ డా. దుర్గాప్రసాద్ హెగ్డే పోస్ట్‌లో పేర్కొన్నారు. ఉడిపిలో జరిగిన గ్యాంగ్‌వార్.. అర్ధరాత్రి జరిగిందని తెలిపారు. కుంజిబెట్టు సమీపంలో ఉడిపి-మణిపాల్ హైవేపై రెండు గ్రూపులు ఘర్షణ పడ్డాయని వెల్లడించారు. ఈ యువ తరం ఎక్కడికి వెళుతోంది? దోషులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ దుర్గాప్రసాద్ హెగ్డే పోస్ట్‌లో డిమాండ్ చేశారు.

సోషల్ మీడియాలో ఫైటింగ్ దృశ్యాలు చక్కర్లు కొడుతుండడంతో పోలీసులకు చేరాయి. దృశ్యాలు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారని తెలిపారు. ఆర్థిక తగాదాల కారణంగానే గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు.
పరారీలో ఉన్న నలుగురి కోసం గాలింపు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. హాలీవుడ్ రేంజ్‌లో జరిగిన ఫైటింగ్‌ను మీరు కూడా చూసేయండి.