P Susheela Post a Video For Fans: ప్రముఖ సినీ గాయని, పద్మభూషణ్ గ్రహీత పి.సుశీల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం (ఆగస్టు 19) చెన్నైలోని కావేరి ఆస్పత్రి నుంచి నేరుగా ఇంటికి చేరుకున్నారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నా అని ఓ వీడియో ద్వారా సుశీల తెలిపారు. అభిమానుల ప్రార్థనలే తనను రక్షించాయని పేర్కొన్నారు. తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వస్తోన్నవదంతులను ఎవరూ నమ్మవద్దని అభిమానులను కోరారు.
86 ఏళ్ల సుశీల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దాంతో కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఇది సాధారణ కడుపు నొప్పేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. రెండు రోజులు చికిత్స తీసుకున్న సుశీల.. సోమవారం క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. తాను క్షేమంగా ఉన్నానంటూ అభిమానుల కోసం ఓ వీడియో విడుదల చేశారు.
Also Read: Vinesh Phogat: ఎవరికీ మినహాయింపు ఉండదు.. ఆ బాధ్యత వినేశ్ ఫొగాట్‌దే: కాస్
‘నేను ఇప్పుడే ఇంటికి చేరుకున్నారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. కావేరి ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది బాగా చూసుకున్నారు. అభిమానుల ప్రార్థనలే నన్ను రక్షించాయి. దేవుడిని నమ్మిన వారు ఎప్పుడూ చెడిపోరు. నన్ను ఆ భగవంతుడు రక్షించినట్లే.. మిమ్మల్ని కూడా కాపాడుతాడు. నన్ను అభిమానించే వారందరికీ నా కృతజ్ఞతలు. మీరందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి’ అని సుశీల పేర్కొన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా మొత్తం 9 భాషల్లో 40 వేలకు పైగా పాటలను ఆమె ఆలపించారు. తన గాన ప్రతిభకు గుర్తింపుగా జాతీయ అవార్డు, పద్మభూషన్ పురస్కారాలను అందుకున్నారు. వయసు రీత్యా గత కొంత కాలంగా సుశీల ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.