Site icon NTV Telugu

Vasant Panchami: వసంత పంచమి ఎందుకు జరుపుకుంటారు..? ప్రత్యేకత ఏంటి..?

Vasant Panchami

Vasant Panchami

Vasant Panchami: వసంత పంచమి (బసంత్ పంచమి)ను జ్ఞానం, విద్య, కళలు, అభ్యాసాలకు అధిష్ఠాన దేవత అయిన సరస్వతి దేవి జన్మదినంగా హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పండుగ వసంత ఋతువు ఆరంభాన్ని సూచించడంతో పాటు, కొత్త ఆలోచనలు, విద్యా ప్రారంభాలకు శుభప్రదమైన రోజుగా భావిస్తారు. ఇక, 2026లో వసంత పంచమిని అత్యంత పవిత్రమైన దినంగా పరిగణిస్తున్నారు. ఈ రోజున వివాహాలు, గృహప్రవేశాలు, కొత్త పనుల ప్రారంభం వంటి శుభకార్యాలను ప్రత్యేక ముహూర్తం చూడకుండానే నిర్వహించవచ్చని శాస్త్రాలు చెబుతాయి. ముఖ్యంగా విద్యార్థులు, కళాకారులు ఈ రోజున సరస్వతి పూజ చేయడం అత్యంత శుభఫలితాలను ఇస్తుందని నమ్మకం.

వసంత పంచమి 2026 – పూజ శుభ సమయం విషయానికి వస్తే.. ఉదయం 7:15 గంటల నుండి మధ్యాహ్నం 12:50 గంటల వరకు అని పండితులు చెబుతున్నారు.. ఈ సమయంలో సరస్వతి దేవిని పూజించడం అత్యంత ఫలవంతమైనదిగా భావిస్తారు. ఈ సమయానికి లోపే ప్రార్థనలు పూర్తి చేయడం శ్రేయస్కరం అని సూచిస్తున్నారు..

అసలు వసంత పంచమి నాడు ఎలా పూజించాలి?
వసంత పంచమి నాడు ఎలా పూజించాలనే విషయాల్లోకి వెళ్తే.. పసుపు, వసంత రంగు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించాలి.. ఎరుపు, నలుపు రంగు దుస్తులు ధరించకూడదు అని చెబుతున్నారు.. తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖంగా కూర్చొని పూజ చేయాలి.. శుభ సమయం కాకపోతే, సూర్యోదయం తర్వాత రెండున్నర గంటల నుంచి సూర్యాస్తమయం తర్వాత రెండున్నర గంటల మధ్య పూజ చేయవచ్చు అని సూచిస్తున్నారు..

పూజా సామగ్రి ఏంటి?
– తెల్ల గంధపు ముద్ద
– పసుపు లేదా తెలుపు పువ్వులు
– చక్కెర మిఠాయి, పెరుగు లేదా కుంకుమపువ్వుతో చేసిన పాయసం

పూజా సమయంలో చేయాల్సిన మంత్ర జపం:
వసంత పంచమి రోజు చేసే పూజ విషయానికి వస్తే.. “ఓం ఐం సరస్వత్యై నమః”.. ఈ మంత్రాన్ని భక్తితో జపించడం వల్ల విద్య, జ్ఞానం, వివేచన పెరుగుతాయని విశ్వాసం.

వసంత పంచమి కథ – సరస్వతి దేవి ఆవిర్భావం
పురాణాల ప్రకారం, బ్రహ్మ దేవుడు విశ్వ సృష్టి చేసిన తర్వాత తన సృష్టిని పరిశీలించగా, ఎక్కడా జీవ చైతన్యం కనిపించలేదు. ప్రపంచం నిశ్శబ్దంగా, నిశ్చలంగా ఉండటంతో బ్రహ్మ అసంతృప్తి చెందాడు. అప్పుడు విశ్వంలో ఒక ముఖ్యమైన అంశం లోపించిందని గ్రహించాడు. విష్ణువు అనుమతితో బ్రహ్మ తన కమండలం నుంచి కొన్ని నీటి బిందువులను భూమిపై చల్లాడు. ఆ నీటి బిందువులు పడగానే, ఒక దివ్యశక్తి భూమిపై అవతరించింది. ఆమె నాలుగు చేతులతో, ఒక చేతిలో వీణ, మరో చేతిలో పుస్తకం, జపమాల పట్టుకుని, ఆశీర్వదించే ముద్రలో దర్శనమిచ్చింది. బ్రహ్మ ఆమెను వీణ వాయించమని కోరగా, ఆమె వీణ తీగలు మోగగానే విశ్వమంతా శ్రావ్యమైన ధ్వనితో నిండిపోయింది. ఆ శబ్దంతో జీవులకు వాక్చాతుర్యం, జ్ఞానం లభించింది. అప్పుడే బ్రహ్మ ఆమెకు “సరస్వతి” అనే నామాన్ని ప్రసాదించి, వాక్కు, విద్య, జ్ఞానానికి అధిష్ఠాన దేవతగా ప్రకటించాడు. సరస్వతి దేవి ఆవిర్భావం వసంత పంచమి నాడే జరిగిందని నమ్ముతారు. అందుకే ఈ రోజును సరస్వతి దేవి జన్మదినోత్సవంగా భక్తి భావంతో జరుపుకుంటారు.

Exit mobile version