Site icon NTV Telugu

Varalakshmi Vratham 2025: నేడు వరలక్ష్మీ వ్రతం.. శుభ ముహూర్తం, పూజ విధానం ఇదే!

Varalakshmi Vratham 2025

Varalakshmi Vratham 2025

Varalakshmi Vratham 2025 Shubh Muhurat and Puja Vidhanam: శ్రావణ మాసంలోని శుక్లపక్షం, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతంను ఆచరిస్తారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఈ వ్రతంను చేసుకుంటారు. వరలక్ష్మీ వ్రతం ఆచరించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపద, వైభవం సంవృద్ధిగా ఉంటాయని నమ్మకం. అలాగే పేదరికం, బాధలు తొలగిపోతాయని పురాణాలు చెబుతాయి.

ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 8న వచ్చింది. వరలక్ష్మీ వ్రతం లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది. ఈ రోజున వివాహమైన స్త్రీలందరూ ఉపవాసం ఉంటూ.. వరాలనిచ్చే వరలక్ష్మీ తల్లిని ఎంతో నిష్టగా, నియమ నిబంధనలతో పూజించుకుంటారు. సుదీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు ఆచరిస్తారు. అంతేకాకుండా ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉండాలని సంపదకు చిహ్నం వరలక్ష్మీ దేవిను కొలుస్తారు. పంచాంగం ప్రకారం.. వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 8న సూర్యోదయంతో ప్రారంభమై.. ఆగస్టు 9న సూర్యోదయంతో ముగుస్తుంది.

శుభ ముహూర్తం:
వరలక్ష్మీ వ్రతం పూజ ఆచరించడానికి కొన్ని స్థిర లగ్నాలు ఉన్నాయి. ఈ సమయాల్లో వ్రతం చేసుకుంటే విశేషమైన ఫలితాలు కులుగుతాయని పండితులు చెబుతున్నారు. సింహ లగ్న పూజ ముహూర్తం ఉదయం 6.29 గంటలకు ప్రారంభమై.. 8.46 గంటలకు ముగుస్తుంది. ఈ ముహూర్త వ్యవధి 2 గంటల 17 నిమిషాలు. ఒకవేళ ఈ సమయంలో వీలుకాకపోతే వృశ్చిక లగ్నంలో వ్రతం చేసుకోవచ్చు. వృశ్చిక లగ్న పూజ ముహూర్తం మధ్యాహ్నం 1.22 నుంచి 3.41 వరకు ఉంటుంది. ఈ ముహూర్తపు వ్యవధి 2 గంటల 19 నిమిషాలు.

కుంభ లగ్న ముహూర్తం రాత్రి 7.27 గంటలకు ప్రారంభమై.. రాత్రి 8.54 గంటల వరకు ఉంటుంది. ఈ ముహూర్తపు వ్యవధి 1 గంట 27 నిమిషాలు. ఇక చివరగా వృషభ లగ్న పూజ ముహూర్తం అర్ధరాత్రి 11.55 గంటల నుంచి 1.50 గంటల వరకు ఉంటుంది. దీని వ్యవధి 1 గంట 56 నిమిషాలు. సాధారణంగా వరలక్ష్మీ వ్రతం పూజ పగటిపూట చేస్తారు. కాబట్టి వీలైనంత వరకు పగటిపూట ముహూర్తపు సమయంలో జరుపుకోవడం మంచిది.

వరలక్ష్మీ వ్రతం 2025 పూజ విధి:
వరలక్ష్మీ పూజ దీపావళి సమయంలో చేసే మహాలక్ష్మీ పూజ మాదిరిగానే ఉంటుంది. కానీ ఈ వ్రతానికి ప్రత్యేక నైవేద్యాలు, మంత్రాలు ఉంటాయి. పూజ సమయంలో కట్టే పవిత్ర దారాన్ని తోరం అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు సతీమణి వరలక్ష్మీ తల్లికి నైవేద్యంగా తీపి వంటకం సమర్పించాలి. ఎక్కువగా ఆవుపాలతో పరమాన్నం తయారు చేస్తారు. వరలక్ష్మీ వ్రతం కలశ స్థాపనతో ప్రారంభమవుతుంది. ఆపై లక్ష్మీ అష్టోత్తర శతానామావళి, హారతి, తోరం కట్టడం ఉంటుంది. భక్తులు లక్ష్మీదేవి విగ్రహాన్ని పువ్వులు, ఆభరణాలు, పట్టువస్త్రాలతో అలంకరించి.. భక్తి శ్రద్ధలతో మంత్రాలను జపిస్తూ పూజ చేస్తారు.

Exit mobile version