ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో నేటి నుంచి ‘వారహి నవరాత్రులు’, ‘ఆషాఢ సారె’ సమర్పణ ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. జూన్ 26 నుంచి జులై 4 వరకు వారహి నవరాత్రులు, జూన్ 26 నుంచి జూలై 24 తేదీ వరకు అమ్మవారి ఆషాఢ మాస సారె సమర్పణ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇంద్రాకిలాద్రిపై ఈరోజు ఉదయం 8 గంటలకు దేవస్థానం సిబ్బంది తరఫున ఈవో శీనా నాయక్ చేతుల మీదగా అమ్మవారికి మొదటి సారెను సమర్పిస్తారు.
జూన్ 26 నుండి జూలై 24 వరకు వివిధ దేవాలయాలు, ధార్మిక సంస్థల నుంచి భక్త సమాజముల అమ్మవారికి ఆషాఢ మాస సారె సమర్పించడం జరుగుతుంది. మహా మండపంలోని 6వ అంతస్తులో అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్టించి.. ప్రత్యక పూజాభిషేకాలు నిర్వహిస్తారు. జూన్ 29న కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు. జూలై 4న పూర్ణహుతి కార్యక్రమంతో వారాహి నవరాత్రుల ఉత్సవాలు ముగుస్తాయి.
Also Read: Rishabh Pant: రిషబ్ పంత్‌కు కెరీర్ ఉత్తమ ర్యాంకు!
సాధారణంగా ఆషాఢంలో ఎలాంటి శుభకార్యాలూ జరగవు. అయితే పూజా కార్యక్రమాలకు మాత్రం అనువైన మాసమని చెబుతారు. అలాంటి పవిత్ర మాసంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు పలు ప్రాంతాలకు చెందిన భక్తులు సారె పేరుతో రకరకాల కానుకల్ని సమర్పిస్తారు. అమ్మవారికి భక్తులు వస్త్రాలూ, పూలూ, పండ్లూ, మిఠాయిలూ, గాజులూ, కొబ్బరికాయలూ సమర్పిస్తారు. ఆషాఢం మాసంలోనే అమ్మవారు శాకంబరీ దేవిగానూ భక్తులకు దర్శనం ఇస్తారు. జూలై 8 నుంచి 10వ తేదీ వరకు శాకంబరీదేవి ఉత్సవాలు జరగనున్నాయి.
